రాష్ట్రంలో అసైన్డ్ కమిటీలు ఎత్తేశారు : భట్టి విక్రమార్క

  • ఖమ్మం జిల్లాలో ఫారెస్ట్ అధికారిపై దాడి బాధాకరం
  • కేసీఆర్ కాలయాపన చేయబట్టే ఘాతుకం: భట్టి విక్రమార్క

ఖమ్మం జిల్లాలో ఫారెస్ట్ అధికారిపై దాడి చాలా బాధాకరమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సీఎం కాలయాపన చేయబట్టే ఈ ఘాతుకం జరిగిందని ఆరోపించారు. భూమిపై హక్కు కోల్పోతున్నామన్న భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉంటే.. ఈడీ, ఐటీ, స్టేట్ జీఎస్టీ అధికారులు పోటీపడి దాడులు చేస్తున్నాయన్నారు. ఒకరిపై మరొకరు పైచేయి చాటుకోవడం కోసం దాడులు చేసుకుంటున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు.

ప్రభుత్వం అధికారులు.. రైతులకు మధ్య చిచ్చు పెడుతోంది

సర్కార్ పోడు రైతులకు అన్యాయం చేస్తోందని.. అధికారులు, రైతులకు మధ్య చిచ్చు పెడుతోందని భట్టి విక్రమార్క ఆరోపించారు. గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన లక్షలాది ఎకరాల అసైన్డ్ భూములు పార్ట్ –బీలో పెట్టి.. వాటిని ఇంత వరకు పరిష్కారం చేయకపోవడం వల్ల వారి జీవితాలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయన్నారు. భూమిపై హక్కులు కోల్పోయామన్న ఆందోళనతో గ్రామాల్లోని ప్రజలు భయ కంపితులై బతుకుతున్నారు. ఫారెస్ట్ యాక్ట్ కూడా రాష్ట్రంలో అమలు చేయకపోవడం వల్ల పెద్ద ఎత్తున ఇబ్బందులు వస్తున్నాయన్నారు. 

అసైన్డ్ కమిటీలే ఎత్తేశారు

భూమిలేని నిరుపేద ప్రజల కోసం గత ప్రభుత్వాల హయాంలో ల్యాండ్ అసైన్డ్ మెంట్ కమిటీలు ఉండేవని.. ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేలు కమిటీలో ఉండి.. ప్రభుత్వ భూములను నిరుపేదలకు లేదా .. ఇతరత్రా అవసరాలకు ఉపయోగించుకునేందుకు ప్రతి సంవత్సరం సమావేశాలే జరిగేవని గుర్తు చేశారు. గత 8 సంవత్సరాల నుంచి అసైన్డ్ మెంట్ కమిటీల సమావేశాలే జరపకపోగా అసైన్డ్ కమిటీలే ఎత్తేశారని తెలిపారు. 

ఒక వేళ భూ పంపిణీ చేయాలనుకున్నా.. భూమి ఉండి, భూమి పొందడానికి దరఖాస్తు పెట్టుకున్నా 8 సంవత్సరాల నుంచి పరిష్కారం కావడం లేదని భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. చాలా చోట్ల భూమి సేకరించినా.. 8 సంవత్సరాల నుంచి ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు పట్టాలకు నోచుకోని పరిస్థితి ఉందన్నారు. భూమి ఉన్నటువంటి రైతులతో పాటు భూమి లేని వారి పరిస్థితి కూడా ప్రమాదకరంగా మారిందన్నారు. భూ సమస్యలు పరిష్కరించకుంటే మరిన్ని అనర్థాలు జరిగే అవకాశం ఉందని భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు.