![కేంద్ర బడ్జెట్‌ను సవరించాలి .. రైతు, కార్మిక సంఘాల నాయకుల డిమాండ్](https://static.v6velugu.com/uploads/2025/02/farmers-and-trade-union-leaders-demand-revision-of-central-budget_EHyieWoUqD.jpg)
ముషీరాబాద్, వెలుగు: కేంద్ర బడ్జెట్ ను సవరించే వరకు ఐక్యంగా ఉద్యమిస్తామని రైతు, కార్మిక సంఘాల నాయకులు చెప్పారు. సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా బుధవారం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మొద్దని, ఎరువులకు ఇస్తున్న సబ్సిడీలో కోత విధించొద్దని, రైతుల ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, వ్యవసాయ మార్కెట్ సవరణ ముసాయిదాను రద్దు చేయాలని, తెలంగాణ రాష్ట్రానికి విభజన హామీలు అమలు చేయాలని నినాదాలు చేశారు.
సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ టి.సాగర్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట్ రాములు పాల్గొని మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌ను తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. విభజన హామీలను పరిష్కరించేలా ఒత్తిడి తేవాలన్నారు. వ్యవసాయ రంగాన్ని విస్మరించి మరోసారి మోసగించిందని విమర్శించారు.