- దుద్యాల మండలం లగచర్లలో ఘటన
- ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ
- గ్రామంలోకి రావాలంటూతీసుకెళ్లిన బీఆర్ఎస్ లీడర్
- ఆఫీసర్లు వెనక్కి వెళ్లిపోవాలంటూరైతుల ఆందోళన
- మాట్లాడుతుండగానే కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై అటాక్
- రాళ్లు, కట్టెలతో దాడి.. అధికారుల వాహనాలు ధ్వంసం
- అడిషనల్ కలెక్టర్, సబ్ కలెక్టర్,స్పెషల్ ఆఫీసర్‌కు గాయాలు
- రిపోర్ట్ ఇవ్వాలని సీఎస్, డీజీపీకి ఆదేశం
కొడంగల్, వెలుగు:ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్, అధికారులపై రైతులు, గ్రామస్తులు దాడి చేశారు. వారి కార్లపై రాళ్లు, కట్టెలతో అటాక్ చేశారు.
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో సోమవారం ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ఆఫీసర్ల వాహనాలు ధ్వంసమయ్యాయి. కార్ల అద్దాలు పగిలిపోయాయి. కొడంగల్ఏరియా డెవలప్మెంట్అథారిటీ (కడా) స్పెషల్ఆఫీసర్ వెంకట్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జరుగుతున్నప్పుడు అధికారులకు భద్రతగా ఒక్క పోలీసు కూడా లేరు. దీంతో కలెక్టర్‌ను ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది, డ్రైవర్ రక్షించారు. కాగా, తమపై నిజమైన రైతులు దాడి చేయలేదని, కొందరు అల్లరిమూకలు కావాలనే ఈ అటాక్ చేశాయని కలెక్టర్ తెలిపారు.మరోవైపు ఈ దాడి వెనక బీఆర్ఎస్ హస్తం ఉన్నదని కాంగ్రెస్‌పార్టీ ఆరోపించింది.
ఏం జరిగిందంటే?
వికారాబాద్ జిల్లా దుద్యాల, లగచర్ల, పోలేపల్లిలోని 1,350 ఎకరాల్లో ఇండస్ట్రియల్కారిడార్ఏర్పాటు కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. మొదట ఫార్మా విలేజ్ఏర్పాటు చేద్దామని అనుకున్నా స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో ఇండస్ట్రియల్కారిడార్ఏర్పాటుకు నిర్ణయించింది. ఇందులో భాగంగానే సోమవారం దుద్యాలలో అధికారులు గ్రామసభ, ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం కోసం ఉదయం కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్కలెక్టర్ లింగ్యా నాయక్, సబ్కలెక్టర్ఉమాశంకర్ప్రసాద్, కడా స్పెషల్ఆఫీసర్ వెంకట్‌రెడ్డితో పాటు ఇతర అధికారులు వచ్చారు. అయితే, గ్రామసభకు ఒక్క రైతు కూడా హాజరు కాలేదు. గంట సేపటివరకూ వారి కోసం వేచిచూసినా రాలేదు.
అప్పుడే కలెక్టర్ ప్రతీక్ జైన్ దగ్గరకు బీఆర్ఎస్ లీడర్ మొగవోని సురేశ్వచ్చారు. ‘సార్.. రైతులందరూ లగచర్లలో ఉన్నారు. అక్కడే టెంట్ వేశాం. మీరు అక్కడికి వస్తే మాట్లాడొచ్చు’ అని నమ్మించాడు. దీంతో కలెక్టర్, అడిషనల్కలెక్టర్, సబ్‌కలెక్టర్, కడా స్పెషల్ ఆఫీసర్వారి వారి కార్లలో 5 కిలోమీటర్ల దూరంలోని లగచర్లకు వెళ్లారు. గ్రామంలోని రామాలయం దగ్గరకు వెళ్లిన కలెక్టర్, ఇతర అధికారులు కారు దిగి, రైతులతో మాట్లాడడం మొదలెట్టారు. వెంటనే ఓ పక్క నుంచి 20 నుంచి 30 మంది వరకు కలెక్టర్‌పైకి తోసుకుంటూ వచ్చారు. దాడికి దిగుతున్నారని గుర్తించిన వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది, డ్రైవర్.. కలెక్టర్‌ను కారు దగ్గరకు తీసుకెళ్లారు. ఇదే సమయంలో ఇతర అధికారులపై దాడి చేయబోతున్నారని గమనించిన కలెక్టర్.. వారిని కాపాడేందుకు ముందుకు వచ్చారు.
అప్పటికే రైతులు, గ్రామస్తులు రాళ్లు, కర్రలతో దాడి చేయడం మొదలుపెట్టారు. వెంటనే కలెక్టర్‌ను ఆయన సెక్యూరిటీ సిబ్బంది, డ్రైవర్ కారు ఎక్కించి ముందుకు తీసుకువెళ్లబోయారు. ఈ దశలో ఆయన వాహనంపై దాడి చేశారు. వెనుక అద్దాలపై రాళ్లు వేయడంతో, అవి పగిలిపోయాయి. అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్, స్పెషల్ఆఫీసర్ వెంకట్‌రెడ్డి దొరకడంతో వారిని ఇష్టమున్నట్టు కొట్టారు. కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో వారు గాయపడ్డారు. దాడి చేస్తున్న వారి నుంచి తప్పించుకోవడానికి సమీపంలోని వరి చేన్లలోకి పరుగులు తీశారు. అయినా వదలకుండా వెంటపడ్డారు. అప్పుడే దుద్యాల నుంచి మిగతా పోలీసులు రావడంతో ప్రాణాలతో బయటపడగలిగారు.
170 మంది పోలీసులున్నా..
లగచర్లలో అడిషనల్ కలెక్టర్, సబ్ కలెక్టర్, కడా స్పెషల్ఆఫీసర్, ఇతర అధికారులు సెప్టెంబర్25న ప్రజా భిప్రాయ సేకరణకు వెళ్లగా.. గ్రామస్తులు నిరసనకు దిగారు. కాంగ్రెస్ లీడర్‌కు చెందిన వాహనాలు ధ్వంసం చేయడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి, అందరినీ చెదరగొట్టారు. ఈ ఘటన జరిగిన15 రోజులకు కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ పెట్టగా.. ముగ్గురు డీఎస్పీలతో కలిసి మొత్తం 170 మంది పోలీసులు బందోబస్తుగా వచ్చారు. అయితే, వీరంతా దుద్యాలలో ముందు ప్రజాభిప్రాయ సేకరణ జరపాలనుకున్న ప్రాంతం వద్ద ఉన్నారు. కానీ, సురేశ్ అనే వ్యక్తి కలెక్టర్‌ను, ఇతర అధికారులను లగచర్లకు తీసుకువెళ్లగా.. పోలీసులు మాత్రం వెంట వెళ్లకుండా దుద్యాలలోనే ఉండిపోయారు. ఇంటెలిజెన్స్కూడా ఏం జరుగబోతోందో గుర్తించడంలో విఫలం అవడం వల్లే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తున్నది.
ఉద్యోగ సంఘాల నిరసన
కలెక్టర్, ఇతర అధికారులపై దాడికి పాల్పడ్డ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వికారాబాద్ ఇన్చార్జి అదనపు కలెక్టర్ సుధీర్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ఆవరణలో జిల్లా అధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకపోతే పెన్ డౌన్ చేస్తామని, ఆఫీసులు ఓపెన్ చేయబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అలాగే, కొడంగల్మండల పరిషత్ ఆఫీసు ఎదుట ఎంపీడీవో ఉషశ్రీ ఆధ్వర్యంలో, మున్సిపల్‌ఆఫీసు ఎదుట మున్సి పల్కమిషనర్ బలరాం నాయక్, ఎమ్మార్సీ దగ్గర ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేశాయి. కలెక్టరేట్‌తో పాటు తహసీల్దార్ ఆఫీసుల వద్ద నిరసన తెలిపారు. జిల్లా పరిషత్ ఆఫీసు సిబ్బంది, నవాబుపేట తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు.
ముమ్మాటికీ బీఆర్ఎస్ కుట్రే: కాంగ్రెస్ లీడర్లు
బీఆర్ఎస్ కుట్రలో భాగంగానే అధికారులపై దాడులు జరిగాయని కాంగ్రెస్ లీడర్లు ఆరోపించారు. దాడికి నిరసనగా జిల్లా లైబ్రరీ చైర్మన్ రాజేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో కొడంగల్‌లోని ఎన్‌హెచ్–163పై బైఠాయించి, నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్ కావాలనే ఈ దాడి చేయించారని, బీఆర్ఎస్ లీడర్ సురేశ్ దీన్ని ముందుండి నడిపించాడని ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. గంటసేపటి తర్వాత పోలీసులు వచ్చి సర్ది చెప్పి, ఆందోళన విరమింపజేశారు.
మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశాం: ఐజీ సత్యనారాయణ
లగచర్లలో అధికారులపై దాడికి పాల్పడినవారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని మల్టీ జోన్– -2 ఐజీ సత్యనారాయణ స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ ఆఫీసులో ఎస్పీ నారాయణరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. రైతుల ప్రజాభిప్రాయ కోసం వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్, కడా స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి తదితరులపై కొందరు వ్యక్తులు ముందస్తు పథకం ప్రకారం దాడి చేసినట్టు వీడియోలు చూస్తే స్పష్టమవుతున్నదని తెలిపారు.
ఈ సంఘటనకు సంబంధించి 3 ఎఫ్ఐఆర్స్ నమోదు చేశామన్నారు. ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులున్న ప్రాం తానికి మొగవోని సురేశ్ వచ్చి ‘గ్రామంలో టెంట్ వేశాం, అక్కడికి రండి మాట్లాడుదాం’ అని కలెక్టర్ ప్రతీక్ జైన్‌కు చెప్పాడని అన్నారు. రైతులతో మాట్లాడానికే వచ్చాం కదా అని కలెక్టర్ ప్రతీక్ జైన్, అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్, కడా స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, ముగ్గురు డీఎస్పీలతో కలిసి వెళ్లారని చెప్పారు. అధికారులు టెంట్‌లోకి వచ్చి మాట్లాడే లోపే ‘కలెక్టర్ గో బ్యాక్’ అంటూ ఓ వైపు నినాదాలు చేస్తూ.. మరో వైపు మరి కొందరు అధికారులపై దాడులకు తెగబడ్డారని చెప్పారు.
ఈ ఘటనలో కడా స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డితో పాటు అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్దికి గాయాలైనట్టు చెప్పారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రి కి తరలించామన్నారు. ఇప్పటి వరకు 15 మంది నిందితులను గుర్తించామని, మొత్తం 110 నుంచి 120 వరకు నిందితులు ఉంటారని తెలిపారు. వారి ఫోన్ నంబర్లను కూడా పరిశీలిస్తున్నట్టు చెప్పారు.