
శివ్వంపేట, వెలుగు : ఎండోమెంట్, రెవెన్యూ ఆఫీసర్లపై రైతులు మండిపడ్డారు. శివ్వంపేట మండలం దొంతి గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయానికి సర్వే నంబర్ 78, 79,100, 109, 136, 499లో 242 ఎకరాల భూములు ఉన్నాయి. గ్రామానికి చెందిన రైతులు దశాబ్దాలుగా ఆ భూమి సాగు చేసుకుంటున్నారు. ఎండోమెంట్డిప్యూటీ కలెక్టర్అనిత, ఆర్డీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ శ్రీనివాస్ చారి శనివారం రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న
రైతులు కౌలు అగ్రిమెంట్ చేసుకొని సాగు చేసుకోవాలని, రైతుబంధు, రైతు బీమా వర్తింప జేస్తామని, బ్యాంకులో రుణాలు ఇప్పిస్తామని చెప్పారు. దీనికి రైతులు కౌలు అగ్రిమెంట్ కు అంగీకరించమని, తమకు రైతుబంధు, రైతు బీమా ఏమీ వద్దన్నారు. గవర్నమెంట్ వ్యాల్యూ ప్రకారం డబ్బులు కడతామని, తాము సాగు చేసుకుంటున్న భూములు తమ పేరు మీద పట్టా చేసి పాసుబుక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వంశపారపర్యంగా సాగు చేసుకుంటూ ఈ భూమిపై ఆధారపడి ఉన్న మేము కౌలు ఎందుకు కడతామన్నారు. ప్రాణాలు పోయినా సరే భూమి మాత్రం వదలమన్నారు. ఈ భూమి అసలు దేవాదాయ భూమి కాదు, ఇనాం భూమి అని అన్నారు.