ఫారెస్ట్​బీట్​ ఆఫీసర్​ తీరుపై గిరిజనుల ఆగ్రహం

లింగంపేట, వెలుగు: మండలంలోని రామాయిపల్లి ఫారెస్ట్​బీట్ ఆఫీసర్​బండి భూపతి నిర్లక్ష్యం కారణంగా తమకు పోడు భూముల పట్టాలు రాలేదని ఆరోపిస్తూ గురువారం మధ్యాహ్నం లింగంపేట మండలంలోని జగదాంబతండా, అన్నారెడ్డిపల్లి తండాలకు చెందిన గిరిజనులు స్థానిక పోలీస్​ స్టేషన్​కు తరలివచ్చారు. రామాయిపల్లి శివారులో రెండు తండాలకు చెందిన గిరిజనులు ఏళ్లుగా పోడుభూములు సాగు చేస్తున్నారని, పోడు పట్టాల కోసం రెవెన్యూ, ఫారెస్ట్​ఆఫీసర్లు జాయింట్​సర్వే చేయలేదని చెప్పారు. పట్టాలు ఇప్పిస్తానని బీట్​ఆఫీసర్​భూపతి లంచం డిమాండ్​ చేశాడన్నారు. డబ్బులు ఇవ్వకపోవడంతో తమకు పట్టాలు అందకుండా  చేసినట్లు ఆరోపించారు. బీట్​ ఆఫీసర్​పై జిల్లా కలెక్టర్​కు, డీఎఫ్​వోకు ఫిర్యాదు చేస్తామని గిరిజనులు పేర్కొన్నారు.

గిరిజనులపై పోలీసులకు ఫిర్యాదు..

రామాయిపల్లి ఫారెస్ట్​పరిధిలోని 688 కంపార్ట్​మెంట్​లో జగదాంబతండాకు చెందిన గుగులోత్​లక్ష్మణ్, రమావత్​ కుమార్, ఎఫ్​ఆర్​సీ చైర్మన్​సరిచంద్​తో పాటు మరికొందరు గిరిజనులు పోడు భూముల పేరిట 9 హెక్టార్ల భూమిని చదును చేశారని,3.5 హెక్టార్ల విస్తీర్ణంలో చెట్లు నరికారని డిప్యూటీ రేంజ్ఆఫీసర్​రవి, బీట్​ఆఫీసర్ ​బండి భూపతి గురువారం స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. డిప్యూటీ రేంజ్​ఆఫీసర్​రవి గిరిజనులతో మాట్లాడుతూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని, అప్పటి వరకు చెట్లు నరకొద్దని కోరగా, గిరిజనులు నిరాకరించారు. పట్టాలు ఇచ్చే వరకు పోడు భూములు సాగు చేసుకుంటామని తేల్చి చెప్పారు. ఫారెస్ట్​బీట్​ఆఫీసర్​ భూపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ ప్రకాశ్​తెలిపారు.