- పెండింగ్ రుణమాఫీని త్వరలోనే మంజూరు చేస్తాం
- పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క
ఏటూరునాగారం, వెలుగు: పంట సాగు చేసే వాళ్లకే రైతు భరోసా ఇస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. రైతుబంధు పేరిట గత పాలకులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. మంగళవారం ములుగు జిల్లా కన్నాయిగూడెం, ఏటూరునాగారం మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో బీడు, పడావు భూములకు కూడా రైతుబంధు ఇచ్చారని, నిజమైన రైతులకు పట్టాదారులకు మాత్రం పాస్ పుస్తకాలు లేవంటూ రైతుబంధు ఇవ్వలేదని విమర్శించారు.
రాష్ట్రంలో సాగు విస్తీర్ణం ఎంత ఉందో గుర్తించి, నిజమైన లబ్ధిదారులకే రైతు భరోసా దక్కేలా చర్యలు తీసుకుంటున్నామి చెప్పారు. రెన్యూవల్ చేయని రైతులకు రుణమాఫీ కాలేదని, గత పాలకుల నిర్లక్ష్యంతో జరిగిన తప్పిదాలను సమీక్షించి, రుణమాఫీ కానివారి వివరాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న రూ. 500 బోనస్‌తో సన్నవడ్లు పండించిన రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. ఇండ్లు లేని పేదల కోసం రూ. 5 లక్షలతో ఇండ్లు మంజూరు చేయనున్నట్టు తెలిపారు. మంత్రి వెంట అడిషనల్ కలెక్టర్ మహేందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్ పాల్గొన్నారు.