పెద్దపల్లి, వెలుగు: పండించిన వడ్లు అమ్ముకునేందుకు కొనుగోలు సెంటర్లలో రైతులు అరిగోస పడుతున్నరు. వారం నుంచి మబ్బులు పడుతుండటంతో ఎంత ఎండబోసినా మాయిశ్చర్ తగ్గడం లేదు. దీన్ని కారణంగా చూపి సొసైటీ నిర్వాహకులు వడ్లు కొంటలేరు. ఒకవేళ కొన్నా తాలు, తట్టు పేరు మీద 3 నుంచి 5 కేజీల వరకు తరుగు తీస్తున్నరు. 1001 దొడ్డు రకం వడ్లు అసలే కొంటలేరు. దీంతో రైతులు దళారులను ఆశ్రయిస్తున్నారు. వివిధ కారణాలతో కొనుగోళ్లు ఆలస్యమవుతుండడంతో రైతులు రాత్రుళ్లు చలిలో వడ్ల కుప్పల కాడనే పడుకోవాల్సి వస్తోంది. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎవరికి చెప్పుకున్నా ప్రయోజనం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎవరూ పట్టించుకుంటలేరు...
పెద్దపల్లి జిల్లాలో వానాకాలం వడ్ల దిగుబడి 4.80 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని అంచనా వేయగా ఇప్పటి వరకు 80 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారు. జిల్లాలో 300 కు పైగా కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేశారు. కొనుగోళ్లు మొదలై 20 రోజులు గడిచినా స్పీడ్ అందుకోవడం లేదు. సెంటర్ల నిర్వహణలో ప్రభుత్వం చేతులెత్తేసింది. కొనుగోళ్లు సరిగా లేక సెంటర్ల వద్ద వేలాది మంది రైతులు పగలు, రాత్రి అక్కడే ఉంటున్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం ఎదులాపూర్వంటి ఏరియాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడ్ల కుప్పల వద్దకు ఫారెస్ట్నుంచి అడవి పందులు వస్తుండటంతో రైతులంతా రాత్రుళ్లు కాపలా ఉంటున్నారు. మరోవైపు మిల్లర్లు, అధికారులు ఒక్కటై రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మాయిశ్చర్ 17 శాతం రావాలి, కానీ మబ్బులు పడుతుండటంతో రావటం లేదు.
దీన్ని ఆసరాగా చేసుకొని తేమ శాతం ఎక్కువ ఉందని, తాలు పేరిట క్వింటాల్‌కు 5 కేజీల వరకు తరుగు తీస్తున్నారు. కొన్ని సెంటర్లలో మాయిశ్చర్ వచ్చినా తాలు ఎక్కువగా ఉందని కొర్రీలు పెడుతున్నారు. తూర్పార పట్టిన వడ్లు పంపించినా మిల్లర్లు ప్రతీ సంచికి 3 నుంచి 5 కేజీలు కోత పెడుతున్నారని రైతులు చెప్తున్నారు. కొన్ని కేంద్రాల్లో మిల్లర్లతో నిర్వాహకులు కుమ్మక్కై తూర్పార పట్టని వడ్లకు 3 కేజీల కోతతో తీసుకుంటున్నరు, ఆ వడ్లనే మిల్లుకు పంపగా అక్కడ మిల్లర్లు మరో 5 కేజీలు కోత పెడుతున్నారు. ఒకవైపు అధికారులు ఎక్కడైనా కొనుగోలు సెంటర్ నిర్వాహకులు, మిల్లర్లు నిబంధనలు అతిక్రమిస్తే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. కానీ ఫిర్యాదు చేసినా ఫలితం ఉంటలేదని రైతులు చెప్తున్నారు.
1001 అసలే కొంటలేరు...
1001 దొడ్డు రకం వడ్లను మిల్లర్లు అసలే కొంటలేరు. జిల్లాలో 5 వేల మెట్రిక్ టన్నుల 1001 ధాన్యం దిగుబడి వచ్చింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ కొన్నా మిల్లర్లు చెప్పిన విధంగా అదనంగా 3 నుంచి 5 కేజీలు ఎక్కువ ఇవ్వాలంటున్నారు. 1001 వడ్ల విషయంలో వ్యవసాయాధికారులు మిల్లర్లతో సమావేశమై జిల్లాలోని ప్రతీ మిల్లరు 2 లోడ్ల 1001 వడ్లు కొనాలని సూచించినట్లు తెలిసింది. తమ డిమాండ్లకు అనుగుణంగా వడ్లు అమ్మితేనే కొంటామని చెప్పినట్లు సమాచారం. దీంతో 1001 ధాన్యం పండించిన రైతుల పరిస్థితి
ఆగమైతాంది.
పోసి పదిరోజులైనా కొంటలేరు..
వడ్లు కొనుగోలు సెంటర్ల పోసి పది రోజులైంది. మాయిశ్చర్ వచ్చినా కొంటలేరు. మిల్లర్లు 1001 తీసుకుంటలేరని అంటున్రు.. రెండెకరాల్లో సాగు చేసిన.. రోజూ వడ్లు కుప్పచేస్తున్న, ఆరపోసుకుంటున్న, పనులన్నీ ఇడిసిపెట్టి సెంటర్ కాడనే ఉంటున్న, ఎవరూ పట్టించుకుంటలేరు. - సల్పాల బక్కయ్య, రైతు, చినరాత్పల్లి
ప్రతీ మిల్లుకు రెండు లోడ్లు తప్పనిసరి చేశాం..
మొదట్లో 1001 రకం వడ్లను మిల్లర్లు తీసుకోలేదు. ప్రతీ మిల్లర్ రెండు లోడ్లు తీసుకోవాలని ఆదేశించాం. జిల్లా వ్యాప్తంగా 5 వేల మెట్రిక్ టన్నుల 1001 రకం దిగుబడి వచ్చింది. అన్ని రకాల వడ్లు జిల్లాలో 4.80 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది. ధాన్యం మొత్తం సకాలంలోనే కొంటాం. - ఆదిరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి, పెద్దపల్లి జిల్లా