- బోర్లలోనూ అడుగంటుతున్న భూగర్భ జలాలు
- ఆందోళనలో రైతులు
వనపర్తి, వెలుగు : వానాకాలం సాగు చేసిన వరి పంట చేతికందడంతో యాసంగి సీజన్లో ఏ పంట సాగు చేయాలనే విషయమై రైతులు అయోమయానికి గురవుతున్నారు. కానీ సాగునీటి ప్రాజెక్టుల్లో నీళ్లు అడుగంటడంతో యాసంగి పంటలు వేసుకుంటే సాగునీరు చివరి తడి వరకు అందుతుందా? అన్న అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వరి సాగు చేసే భూముల్లో ఈసారి యాసంగిలో ఏ పంటలు సాగు చేయాలి, మళ్లీ వరి వేస్తే నీరు అందుతుందా? లేదా అన్న అయోమయంలో రైతులున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జూరాల, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్, సంగంబండ వంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద వానకాలం సీజన్ లో రైతులు సుమారు 3 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. వానాకాలంలో పూర్తి స్థాయిలో వర్షాలు కురవకపోయినా బావులు, బోర్ల సాయంతో పంటలు గట్టెక్కాయి. డిసెంబర్ నెలలో యాసంగి సీజన్ ప్రారంభమవుతుంది.
ప్రాజెక్టుల్లో నీటి కొరత..
కృష్ణా నదిపై ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుతో పాటు శ్రీశైలం రిజర్వాయర్ లోనూ నీటిమట్టాలు రోజురోజుకు తగ్గుతున్నాయి. ఈ సారి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవకపోవడంతో శ్రీశైలం డ్యాం నిండలేదు. నాగార్జున సాగర్ కు కృష్ణా నది నుంచి ఒక్క టీఎంసీ నీరు కూడా చేరలేదు. దీంతో ఇప్పటికే అక్కడ నీటి కోసం గొడవలు మొదలయ్యాయి. తెలంగాణలో యాసంగిపై ప్రభుత్వం కార్యాచరణను విడుదల చేయలేదు. ఏ ప్రాజెక్టు కింద ఎంత పంట సాగు చేయాలి? ఏ జిల్లాలో ఏయే పంటలు వేసుకోవాలనే విషయంలో ఇప్పటి వరకు స్పష్టత రాలేదు.
పంటలకు సాగునీరు అందిస్తారా? లేదా? అన్న విషయాన్ని ఇప్పటి వరకు తేల్చకపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు. ఇటు వ్యవసాయ, ఇరిగేషన్ ఆఫీసర్లు పంటల సాగుపై, సాగునీటి లభ్యతపై ఎలాంటి ప్రకటన చేయలేదు. డిసెంబర్ లో రైతులు వరి నారుమడులు పోయాల్సి ఉంది. ఒక వేళ ఆరుతడి పంటలు వేయాలని నిర్ణయిస్తే విత్తనాలు ఎలా సమకూర్చుకోవాలనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వానాకాలంలోనే వరి సాగు చేసుకోవాలని, యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలని మొదటి నుంచి ప్రభుత్వం చెబుతున్నా, రైతులకు అవేర్నెస్ కల్పించకపోవడం
అందుకు అవసరమైన ప్రణాళిక అమలు చేయకపోవడంతో ప్రతి ఏడాది యాసంగిలో రైతులు తిప్పలు పడుతున్నారు. గతంలో నీటి లభ్యతను బట్టి ఆయకట్టును ఆయా ప్రాజెక్టుల కింద స్థిరీకరించే వారు. వ్యవసాయ, రెవెన్యూ , ఇరిగేషన్ అధికారులు కలిసి తైబందీ ప్రకటించే వారు. ఇలా ముందే చెప్పడం వల్ల అవకాశం ఉన్న రైతులు మాత్రమే పంటలు వేసేవారు. ఇప్పుడు ఈ విధానం లేక అంతా వరి సాగు చేసి నీరందక ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలవల కింద 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉన్నా ఇప్పుడు ఏ మేరకు ఇస్తారో చెప్పాలని రైతులు కోరుతున్నారు. కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్, సంగంబండ ఎత్తిపోతల పథకాల ద్వారా నీరిస్తారా? లేదా? అనే విషయంపై స్పష్టత రాలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.
అవేర్నెస్ కల్పించాలి..
వరికి ప్రత్యామ్నాయంగా పంటల సాగుపై అవగాహన కల్పించాలని, విత్తనాలు అందించాలని రైతులు కోరుతున్నారు. ఇక్కడి భూములకు అనుకూలమైన పంటలపై వ్యవసాయ అధికారులు, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు అధ్యయనం చేయాలని అంటున్నారు. జొన్న, సజ్జ, మొక్కజొన్న, రాగులు, ఆముదం వంటి వాణిజ్య పంటల సాగుకు ఇక్కడ నేలలు అనుకూలంగా ఉంటాయని చెబుతున్నా, రైతులంతా సామూహికంగా సాగు చేస్తేనే దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే నీటి యాజమాన్యంలో తేడాలతో రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది.