
- అభ్యంతరం వ్యక్తం చేస్తున్న రైతులు
మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్డు కోసం ఉమ్మడి మెదక్ జిల్లాలోని 20 మండలాలు, 111 గ్రామాల పరిధిలో 3,429 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇప్పటికే అలైన్మెంట్ సర్వే పూర్తై త్రీడీ నోటిఫికేషన్ విడుదల చేశారు. కొద్ది రోజులుగా అధికారులు గ్రామ సభలు పెడుతూ రైతులను పట్టా పాస్ బుక్, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వాలని చెబుతున్నారు. కానీ సేకరించే భూమికి పరిహారం ఎంత ఇస్తారో తేల్చకుండా భూసేకరణ ప్రక్రియ చేపట్టడంపై రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మరికొన్ని చోట్ల అలైన్మెంట్ మార్చారని డిమాండ్ చేస్తున్నారు.
పరిహారం పెంచితేనె భూములిస్తాం
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో ట్రిపుల్ఆర్ వల్ల భూములు కోల్పోతున్న బాధిత రైతులు అధికారుల ముందు పలు డిమాండ్లను ఉంచారు. సంగారెడ్డి ఆర్డీవో వసంతకుమారి సమక్షంలో వారం రోజుల క్రితం భూములు కోల్పోతున్న బాధిత రైతులతో మీటింగ్ అరేంజ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో ప్రభుత్వ నిబంధనల గురించి వివరిస్తుండగా కొందరు రైతులు అడ్డుకొని పలు డిమాండ్లను ప్రస్తావనకు తెచ్చారు. చెరువు ఆయకట్టు భూములు కోల్పోతున్న తమకు భూమికి బదులుగా భూమి లేదా మార్కెట్ రేటు ప్రకారం పరిహారం చెల్లించాలన్నారు.
రోడ్డు పక్కన సర్వీస్ రోడ్డు నిర్మించి సరైన సౌకర్యాలు కల్పిస్తేనే భూములు ఇస్తామని తేల్చి చెప్పారు. ట్రిపుల్ఆర్ రోడ్డు నిర్మాణంలో ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయని వాటిని అధికారులే నివృత్తి చేయాలని కోరారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్, విద్యుత్ స్తంభాల ఏర్పాట్ల వల్ల భూములు కోల్పోయిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇక మోసపోవడానికి సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు. రైతుల డిమాండ్లకు సరైన సమాధానం ఇవ్వని అధికారులు ఉన్నతాధికారులతో చర్చించి మరోసారి కలుద్దామని చెప్పి వెళ్లిపోయారు.
రైతుల నుంచి వ్యతిరేకత
సిద్దిపేట జిల్లాలో ట్రిపుల్ ఆర్ భూసేకరణకు చిక్కుముళ్లు తప్పేలా లేవు. ఇప్పటికే ప్రాథమిక సర్వే నిర్వహించి, ప్రజాభిప్రాయ సేకరణ తోపాటు త్రీడీ నోటిఫికేషన్ జారీ చేసినా రైతుల నుంచి వ్యతిరేకత వస్తోంది. గతంలో ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా భూములిచ్చేది లేదని రైతులు స్పష్టం చేసినా అధికారులు వారి పని వారు చేస్తూ వస్తున్నారు.
గజ్వేల్ నియోజకవర్గంలో 32 కిలో మీటర్ల మేర సాగే ట్రిపుల్ఆర్ కోసం 962.27 ఎకరాలను అధికారులు సేకరించడానికి మార్కింగ్ పూర్తి చేసి త్రీడీ నోటిఫికేషన్ ను జారీచేశారు. జగదేవ్ పూర్, గజ్వేల్, వర్గల్, మర్కుక్, ములుగు మండలాల పరిధిలోని 17 గ్రామాల్లో 1,168 మంది రైతుల నుంచి 962.27 ఎకరాల భూములను సేకరించడానికి రంగం సిద్ధం చేశారు. సేకరించిన భూమికి పరిహారాల విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా కొద్ది రోజులుగా అధికారులు రైతుల పట్టా పాస్ బుక్, బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకుంటున్నారు.
రూ.8 లక్షలు ఇస్తామంటే ఎలా..?
ట్రిపుల్ఆర్ కోసం భూసేకరణ ప్రారంభించేటప్పుడు ఎకరాకు రూ.20 లక్షల వరకు ఇస్తామని చెప్పి ఇప్పుడు రూ.8 లక్షలకు మించేది లేదని అధికారులు ప్రైవేటు సంభాషణల్లో చెబుతుండడంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తంమవుతోంది. విలువైన భూములను తక్కువ ధరకు ఎలా ఇస్తామనే ప్రశ్న వారి నుంచి వస్తోంది. రెండు రోజుల క్రితం మర్కుక్ మండలం చేబర్తి, నర్సన్నపేట గ్రామాలకు చెందిన రైతులు ట్రిపుల్ఆర్ కు విలువైన భూములు ఇవ్వమని, కేసీఆర్ ఫామ్ హౌజ్ ను రక్షించడం కోసం అలైన్మెంట్ మార్చారని, కనీసం పాతిక లక్షలకు తక్కువ కాకుండా పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ట్రిపుల్ఆర్ తో తీవ్రంగా నష్టపోతున్నామని భూమికి భూమే పరిహారం ఇవ్వాలని గణేశ్పల్లి, ఇటిక్యాల, అంగడి కిష్టాపూర్, ఎర్రవల్లి రైతుల నిరసన వ్యక్తం చేశారు. గురువారం ఆర్డీవో కార్యాలయంలో ట్రిపుల్ఆర్ వల్ల ఏ విధంగా నష్టపోతున్నామో అధికారులకు వివరించడమే కాకుండా భూమికి భూమి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
నోటీసులు జారీ
జగదేవ్ పూర్ మండలం పీర్లపల్లి, ఇటిక్యాల, అలీరాజ్ పేట గ్రామాల్లో ట్రిపుల్ఆర్ కోసం సేకరిస్తున్న భూముల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇందు కోసం ఆయా రైతులకు నోటీసులు జారీ చేసి వారి వద్ద భూవివరాల సర్టిఫికెట్లు, బ్యాంకు ఖాతా నెంబర్లు తీసుకొని రావాలని సూచిస్తూ నోటీసులు జారీ చేశారు. పరిహారాలపై స్పష్టత ఇవ్వకుండా వివరాలు తీసుకుంటుండంతో ఆయా గ్రామాల రైతులు ఆగ్రహంగా వ్యక్తం చేస్తున్నారు.
దీనికి తోడు రికార్డుల్లో భూవివరాలకు, ట్రిపుల్ఆర్లార్ కోసం నిర్వహించిన సర్వేకు మధ్య వ్యత్యాసాలు ఉండడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే రెండు సార్లు సర్వే నిర్వహించినా తప్పుల తడకగా ఉండడాన్ని రైతులు తప్పుపడుతున్నారు. భూరికార్డుల ప్రకారం సర్వే నిర్వహించాల్సింది పోయి సర్వే నెంబర్లతో పాటు భూవివరాలను తప్పుగా నమోదు చేశారని వీటిని సవరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం గజ్వేల్ ఆర్డీవో వద్దనే తమ సమస్యను తేల్చుకోవాలని భావిస్తున్నారు.
భూమికి భూమే ఇవ్వాలి
ట్రిపుల్ఆర్ లో విలువైన భూములు కోల్పోతున్నందున పరిహారంగా భూమికి భూమే ఇవ్వాలి. గతంలో పరిహారం భారీగా ఇస్తామని చెప్పిన అధికారులు దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వక పోవడం అనుమానం కలిగిస్తోంది. మర్కుక్ మండలంలో ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ విషయంలో రైతులకు అన్యాయం జరిగింది. రైతులతో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతనే భూసేకరణ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి.
రాంరెడ్డి, పాతూరు, మర్కుక్ మండలం