మహబూబ్​నగర్ జిల్లాలో చివరి ఆయకట్టుకు నీటికి కటకట

మహబూబ్​నగర్ జిల్లాలో చివరి ఆయకట్టుకు నీటికి కటకట
  • పొట్ట దశలో వరి పొలాలు,ఆందోళనలో రైతులు
  • కెనాల్స్​​కింద పెరిగిపోతున్న మోటార్ల వినియోగం
  • ఏప్రిల్​లో చేతికి రానున్న వడ్లు

మహబూబ్​నగర్, వెలుగు: వరి రైతుల్లో ఆందోళన నెలకొంది. ఓ వైపు భూగర్భజలాలు వేగంగా పడిపోతుండడం.. మరో వైపు ప్రాజెక్టుల కింద వారబందీ ప్రకటించడంతో ఇబ్బందులు పడుతున్నారు. వారబందీ ప్రకారం నీటి విడుదల జరుగుతున్నా.. అవి చివరి ఆయకట్టు వరకు చేరడం లేదు. ప్రధానంగా కెనాల్స్​ పొంటి మోటార్ల వినియోగం పెరగడంతో చివరి ఆయకట్టు వరకు నీరు చేరడం కష్టమవుతోంది. దీనికితోడు వెదర్​ ఎఫెక్ట్​ కారణంగా వరి నాట్లు ఆలస్యం కావడంతో ప్రాజెక్టుల కింద ఏప్రిల్​ వరకు వరికి నీటి తడులు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

కెనాల్స్​ కింద మోటార్ల వినియోగం..

రాజీవ్​ భీమా లిఫ్ట్​ ఇరిగేషన్ స్కీమ్​లో భాగంగా లిఫ్ట్–-1 పరిధిలో నిర్మించిన సంగంబండ, భూత్పూర్​ రిజర్వాయర్ల కింద మక్తల్​ నియోజకవర్గంలోని 1.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ప్రధానంగా భూత్పూర్​ రిజర్వాయర్​ కింద 46 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా.. కేవలం సగం వరకు నీరు అందుతోంది. దీని కింద అమరచింత మండలం కొంకనోనిపల్లి వరకు సాగునీరు అందాల్సి ఉండగా, రిజర్వాయర్​ నుంచి రాయికోడ్, రాజ్​పల్లి, పాతర్​చేడ్, నర్వ వరకు మాత్రమే నీళ్లు పారుతున్నాయి. అక్కడి నుంచి లంకాల, ఉంద్యాల, కొంకనోనిపల్లి వరకు నీరు వెళ్లాల్సి ఉండగా.. కంపచెట్లు పెరగడం, కెనాల్స్​లో చెత్త పేరుకుపోవడం, మెయింటెనెన్స్​ లేక చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందడం లేదు. 

అలాగే సంగంబండ రిజర్వాయర్​ కింద 64 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా.. ఇక్కడ కూడా చివరి ఆయకట్టు వరకు సాగునీరు రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ రిజర్వాయర్​ లెఫ్ట్​ కెనాల్ కింద మంథన్​గోడ్, కాట్రేవుపల్లి, రుద్రసముద్రం, గువ్వలపల్లి, ఎర్నాగన్​పల్లి గ్రామాలకు సాగునీరు అందించాల్సి ఉండగా, సాగునీటి కొరత కారణంగా వరి సాగు చేయవద్దని  ఆఫీసర్లు రైతులకు సూచించారు. కానీ, ఈ కెనాల్​ను ఆనుకొని ఉన్న రైతులు వరి వేశారు. మోటార్లు పెట్టుకొని ఉన్న కాడికి నీటిని తోడుకుంటున్నారు. రైట్​ కెనాల్​ పరిధిలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం సాగునీటిని విడుదల చేయగా.. ఆ నీరు కేవలం నేరేడుగాం, వర్కూరు వరకు మాత్రమే వస్తున్నాయి. చివరి ఆయకట్టు ఉన్న మాగనూరు వరకు వెళ్లడం లేదు.

కోయిల్​సాగర్​ కింద అంతంతే..

కోయిల్​సాగర్​ రైట్​ కెనాల్​ కింద కోయిల్​కొండ, ధన్వాడ, మరికల్, చిన్నచింతకుంట మండలాల్లో 8 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ కెనాల్​ కింద ఆఫీసర్లు వారబందీ ప్రకారం సాగునీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మూడు తడుల నీరు ఇవ్వగా, ఈ నెల 3 నుంచి నాల్గో తడి నీటి విడుదల చేశారు. అయితే ప్రతి తడిలో 15 రోజుల పాటు నీటిని విడుదల చేయాల్సి ఉండగా.. ఆఫీసర్లు కేవలం పది రోజులు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నీరు అవసరం అవుతుండడంతో చాలా మంది రైతులు కెనాల్స్​లో బోర్లను ఏర్పాటు చేసుకొని నీటిని వాడుకుంటున్నారు. దీనికితోడు ఈ కెనాల్​ కింద రైతులు జనవరిలో వరి నాట్లు వేసుకోగా, ఏప్రిల్​ చివర్లో పంటలు చేతికొచ్చే అవకాశం ఉంది. దీంతో కెనాల్​ కింద ఏప్రిల్​ వరకు సాగునీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.

ఏప్రిల్​ వరకు  నీళ్లు ఇవ్వాలి..

నాకు 12 ఎకరాల భూమి. మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. మొత్తం 22 ఎకవరాల్లో వరి వేసిన. ఏప్రిల్​ చివర్లో పంట చేతికి వస్తుంది. అప్పటి వరకు సాగునీటిని విడుదల చేయాలే. లేకుంటే 22 ఎకరాల్లో వేసి వరి మొత్తం ఎండిపోయి నష్టం వస్తుంది.  - మల్లేశ్, పెద్దచింతకుంట, మరికల్​ మండలం

చేను ఎండుతోంది..

కురుమూర్తిరాయ లిఫ్ట్​ కింద నాకున్న రెండు ఎకరాల్లో వరి వేసిన. పది రోజుల నుంచి సాగు నీరు రావడం లేదు. చేను ఎండిపోయే దశకు చేరుకుంది. మరో వారం రోజుల పాటు నీరు రాకుంటే ఈ సీజన్​లో పంట మొత్తం లాస్​ అవుతుంది. పెట్టుబడి కూడా నెత్తిన పడేటట్లు ఉంది. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలి.

గొల్ల నంబీశ్వర్, కురుమూర్తి