ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లాలో మక్కపంట చేతికొచ్చింది. కానీ, కొనుగోళ్లపై సర్కార్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆశించిన దిగుబడి వచ్చినప్పటికీ గిట్టుబాటు ధర రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. స్థానికంగా మక్కలను ఎవరూ కొనకపోవడంతో కొందరు రైతులు నిర్మల్కు వెళ్తున్నారు. అక్కడ ప్రైవేట్ వ్యక్తులకే , తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. రెండేళ్ల నుంచి మక్క పంటను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో మక్కలు కొనాలని డిమాండ్ చేస్తున్నారు.
దిగుబడి బాగా వచ్చినా నిరాశే..
తక్కువ సమయంలో పంట సాగవుతుండటంతోపాటు, ఎక్కువ దిగుబడి వస్తుందని చాలా మంది రైతులు ఈసారి కూడా మక్క వేశారు. మొన్నటి వరకూ అకాల వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ అధిక దిగుబడి సాధించారు. కానీ, మార్కెట్లో ధర లేక అమ్ముకోలేకపోతున్నారు.
గిట్టుబాటుకాని ధర..
జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది యాసంగిలో 15 వేల ఎకరాల్లో మక్క సాగు చేశారు. గతేడాది 6 వేల ఎకరాల్లో మక్కవేసినా రైతులు ఈ సారి రెండింతలు సాగు చేశారు. ఈ ఏడు ఎకరానికి 30 నుంచి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. మార్కెట్లో దళారులు రూ. 1700లకే కొనుగోళు చేస్తున్నారు. గతేడాది బహిరంగ మార్కెట్లో రూ. 2500 వరకు ధర వచ్చింది. కానీ ఈ ఏడాది రూ. 2 వేలు కూడా రావడం లేదు. మార్కెట్లో సైతం పంట అనుకున్న స్థాయిలో కొనుగోళ్లు చేసేవారు లేకపోవడంతో నిర్మల్, నిజామాబాద్ ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో రవాణా చార్జీలు కూడా పెరుగుతున్నాయి. సర్కారు మక్కలు కొనకపోతే ఇబ్బంది తప్పదని ఆందోళన చెందుతున్నారు.
పత్తి మొదలు కొని ఏ పంట విక్రయించాలన్నా వ్యాపారులు సిండికేట్ గా మారి ధరలు తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో వ్యాపారులురేటును రూ. 1700 తగ్గించారు. మార్చి నెల చివరి వారంలో రూ. 2200 వరకు ధర పలుకగా ఏప్రిల్ మొదటి వారానికి రూ. 500ల వరకు ధర పడిపోయింది.
ప్రభుత్వమే మక్కలు కొనాలి
నేను 9 ఎకరాల్లో మక్క పంట వేశాను. 250 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కానీ, జిల్లాలో కొనేవారు లేరు. నిర్మల్ కు తీసుకుపోతున్న. మార్కెట్లో రూ. 1700ల ధరతో కొనడంతో.. నష్టం కలుగుతోంది. ప్రభుత్వమే రూ. 2200 రేటుకు కొనుగోలు చేస్తే గిట్టుబాటవుతుంది. చాలా మంది రైతులు ఆశించిన స్థాయిలో పంట దిగుబడి వచ్చింది. కానీ, ధర నష్టపోతున్నాం.
- నసీమోద్దీన్, రైతు, గాంధీనగర్, ఇచ్చోడ మండలం.