
- పాత అలైన్మెంట్ కొనసాగించాలని డిమాండ్
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట నియోజకవర్గంలోని రింగ్ రోడ్డు కొత్త అలైన్మెంట్ఇప్పుడు కొండపాక మండలంలోని దుద్దెడ రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆర్అండ్ బీ అధికారులు పాత ప్రతిపాదనను పక్కన పెట్టి దుద్దెడ గ్రామం లోపలి నుంచి కాకుండా బయటి నుంచి వెళ్లే విధంగా కొత్త ప్రతిపాదన ముందుకు తేవడం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. ఎగ్జిస్టెన్స్ రోడ్లను విస్తరిస్తూ రింగ్ రోడ్డు నిర్మాణం జరపాలని ముందు నిర్ణయించి పనులు ప్రారంభించినా కొండపాక మండలంలోని రెండు గ్రామాల్లో ఆటంకాలు ఎదురు కావడంతో ప్రస్తుతం పనులు నిలిచిపోయాయి.
రింగ్ రోడ్డుపై నుంచి భారీ వాహనాల రాకపోకలు సాగుతాయని గ్రామం మధ్య నుంచి వెళ్తే ప్రమాదాలు జరుగుతాయనే ఉద్దేశంతో కొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. దీని ప్రకారం.. దుద్దెడ గ్రామ శివార్ల నుంచి టోల్ గేట్ వరకు రింగ్ రోడ్డు నిర్మాణం కోసం 33 మంది రైతుల నుంచి పదెకరాలు సేకరించడం కోసం సర్వే నెంబర్ల వారీగా ఇటీవల ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేశారు. కానీ విలువైన భూములను ఇవ్వడానికి రైతులు అంగీకరించడం లేదు.
బందారం గ్రామంలో పెండింగ్
కొండపాక మండలం బందారం గ్రామంలో రింగ్ రోడ్డు పనులు ఏడాది కాలంగా నిలచిపోయాయి. ఎగ్జిస్ట్ రోడ్ల గుండా రింగ్ రోడ్డు నిర్మాణం చేస్తుండగా బందారం గ్రామంలో ప్రస్తుతం ఉన్న రోడ్డును 66 ఫీట్ల కు విస్తరించే విధంగా మార్కింగ్ చేయడంతో దాదాపు100 ఇండ్లకు ముప్పు ఏర్పడింది. ముఖ్యంగా కిలో మీటరు మేర గ్రామం మధ్య నుంచి వెళ్లేఈ రోడ్డు వల్ల లక్షల రూపాయలతో నిర్మించిన 20 ఇండ్లు పూర్తిగా కూల్చాల్సిన పరిస్థితి నెలకొంది. యాభై శాతం వరకు మరో 70 ఇండ్లు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇండ్ల యజమానుల ఆందోళనతో బందారం గ్రామంలో పనులు నిలిచిపోయాయి.
విలువైన భూములు కోల్పోయే పరిస్థితి
దుద్దెడ గ్రామానికి చెందిన 33 మంది రైతులకు సంబంధించి పదెకరాల గుండా కొత్త అలైన్మెంట్రూపొందించారు. ఈ భూముల విలువ బహిరంగా మార్కెట్లో ఎకరా రూ. కోటి పలుకుతోంది. దీంతో రైతులు ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. ఇదిలా ఉంటే గ్రామం మధ్య లోంచి వెళితే దాదాపు 40 ఇండ్లను పాక్షికంగా తొలగించాల్సి రావడంతో వారంతా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది.
విలువైన భూములు కోల్పోతాం
రింగ్ రోడ్డు అలైన్మెంట్మార్చడం వల్ల విలువైన భూములు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. గతంలో అధికారులు రూపొందించిన పాత అలైన్మెంట్ ప్రకారం దుద్దెడ గ్రామంలోంచి రింగ్ రోడ్డు నిర్మించాలి. ఈ విషయంపై ఇటీవల నిర్వహించిన గ్రామ సభలో భూములు కోల్పోతున్న రైతులందరం కలసి అధికారులకు విన్నవించాం. ఈ విషయంపై అధికారులు మరోసారి పునరాలోచన చేయాలి.
చింతల స్వామి చరణ్, దుద్దెడ
రైతుల అభ్యంతరాలను పరిశీలిస్తున్నాం
దుద్దెడ వద్ద రింగ్ రోడ్డు కొత్త అలైన్మెంట్ పై రైతుల అభ్యంతరాలను పరిశీలిస్తున్నాం. ఆర్అండ్ బీ అధికారులు రూపొందించిన కొత్త అలైన్మెంట్పై సర్వే నెంబర్ల ప్రకారం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి గ్రామ సభ నిర్వహించాం. గ్రామ సభలో రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలను ఉన్నతాధికారులకు నివేదించాం. వారి ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం. అవరసమైతే మరోసారి రైతులతో సమావేశమై చర్చిస్తాం.
చల్లా శ్రీనివాస్, తహసీల్దార్, కొండపాక