గోదావరిలో కాల్వలు తవ్వి .. నీళ్లు మళ్లించుకుంటున్న రైతులు

గోదావరిలో కాల్వలు  తవ్వి .. నీళ్లు మళ్లించుకుంటున్న రైతులు
  • గోదావరిలో కాల్వలు .. చివరి దశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు రైతుల పాట్లు
  • భూగర్భ జలాలు అడుగంటడంతో ఎండిపోతున్న పొలాలు
  • గోదావరిలో బావులు తవ్వి, కాల్వలు తీసి నీళ్లు మళ్లించుకుంటున్న రైతులు

మంచిర్యాల, వెలుగు : ఎండ తీవ్రత విపరీతంగా పెరగడంతో మంచిర్యాల జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. బోర్లు, బావుల్లోనూ చుక్కనీరు దొరికే పరిస్థితి లేకుండా పోయింది. ఈ జిల్లాలో కడెం ప్రాజెక్ట్‌, గూడెం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ తప్ప ఎలాంటి సాగునీటి వనరులు లేవు. గత ప్రభుత్వం ప్రాణహితను పక్కనపెట్టి కట్టిన కాళేశ్వరంతో జిల్లాకు ఎలాంటి లాభం లేకుండా పోయింది. కనీసం గోదావరిలో బోర్లు వేసి పారించుకుందామనుకున్నా బ్యారేజీలు కుంగిపోవడంతో అదీ సాధ్యం కావడం లేదు. దీంతో  చివరి దశలో ఉన్న పంటలను కాపాడుకునేందుకు రైతులు నానాపాట్లు పడుతున్నారు. తలా కొంత పోగు చేసుకొని గోదావరి నదిలో కాల్వలు తీసి పొలాలకు నీళ్లు పారించుకుంటున్నారు.

బోర్లు, బావులే ఆధారం

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది యాసంగిలో సుమారు 1.30 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. మెజారిటీ రైతులు బోర్లు, బావులపై ఆధారపడే పంటలు సాగు చేస్తున్నారు. కడెం, గూడెం ప్రాజెక్టుల ద్వారా జన్నారం, దండేపల్లి, హాజీపూర్‌ మండలాల్లోని సుమారు 30 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. ప్రస్తుతం కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో నీటిమట్టం గణనీయంగా పడిపోవడంతో మార్చి నెలాఖరు వరకే సాగునీటిని విడుదల చేశారు. దీంతో ఈ ప్రాంత రైతులు గత నెల రోజులుగా బోర్ల ద్వారానే పంటలను కాపాడుకున్నారు. 

ఐదు మండలాల్లో పరిస్థితి దయనీయం

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ దిగువన ఉన్న నస్పూర్, జైపూర్, భీమారం, చెన్నూర్, కోటపల్లి మండలాల్లోని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ మండలాల్లోని రైతులు గోదావరిని నమ్ముకొనే పంటలు సాగు చేశారు. 40 గ్రామాల పరిధిలో సుమారు 30 వేల ఎకరాల్లో వరి సాగు జరిగింది. కానీ గోదావరిలో నీరు లేకపోవడం వల్ల రైతుల అంచనాలు తప్పాయి. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ దిగువన మేడిగడ్డ వరకు గోదావరి ఎడారిని తలపిస్తోంది. ఓ చిన్న ప్రవాహం పిల్లకాల్వలా ప్రవహిస్తోంది. దీంతో చివరి దశకు వచ్చిన పంటలను కాపాడుకునేందుకు గోదావరి తీర ప్రాంత రైతులు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. 

ఆయా గ్రామాల్లోని కొందరు రైతులు తలా కొంత డబ్బు పోగు చేసుకొని గోదావరిలో బావులు తోడి మోటార్లు ఏర్పాటు చేసుకొని పంటలకు నీరందిస్తున్నారు. మరికొందరు రైతులు నదిలో కాల్వలు తీసి ఉన్న కొద్దిపాటి ప్రవాహాన్ని తమ పొలాలకు మళ్లించుకుంటున్నారు. నస్పూర్‌ మండలం సీతారాంపల్లిలో 80 మంది రైతులు తలా రూ.5 వేల నుంచి రూ.10 వేలు వేసుకుని కిలోమీటర్‌ మేర సొంతంగా కాల్వ తవ్వుకొని తమ పొలాలకు సాగు నీరు అందించుకుంటున్నారు. రెండు జేసీబీల సహాయంతో సుమారు వారం రోజులు కష్టపడి కాల్వ తవ్వుకున్నామని రైతులు తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ నుంచి నీళ్లు విడుదల చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని, మరో రెండు తడులు అందితే పంట చేతికి వస్తుందని పేర్కొన్నారు.

రూ.2 లక్షలు ఖర్చు పెట్టాం 

గోదావరిలో నీరు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు, బావులు ఎండిపోయాయి. మరికొన్ని రోజుల్లో పంట చేతికొచ్చే దశలో సాగునీటి కొరత ఏర్పడింది. దీంతో గత్యంతరం లేక గోదావరిలో కాల్వలుతీసి మోటార్లు పెట్టుకుంటున్నం. రైతులంతా కలిసి రూ.2 లక్షలు ఖర్చు చేశాం.
- తాళ్ల సంపత్, రైతు, సీతారాంపల్లి

ఎల్లంపల్లి నీళ్లు ఇయ్యాలె 

నీళ్లు లేక  గోదావరి ఎడారిగా మారింది. రూ. లక్ష కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్ట్‌‌‌‌ కూలిపోవడంతో మాకు ఈ దుస్థితి వచ్చింది. ఎగువనున్న ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌‌‌‌లో నీళ్లు ఉన్నా కిందికి ఇడుస్తలేరు. పంటలు కోతకొస్తున్నయ్. ఎల్లంపల్లి నుంచి నీళ్లు వదిలితే గోదావరి వెంబడి పొలాలు ఉన్న రైతులకు ఫాయిదా అయితుండె.
- రావుల రాజం, రైతు, సీతారాంపల్లి