
- ఈ ఏడాదిలో 4,300 ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యం
- బోరు, విద్యుత్, డ్రిప్ ఖర్చులు భరించలేమంటున్న రైతులు
- పంట దిగుబడిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
ములుగు, వెలుగు: దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే ఆయిల్ పామ్ సాగు వైపు రైతులు మొగ్గు చూపాలని ప్రభుత్వం, ఆఫీసర్లు చెబుతున్నా రైతులు మాత్రం అంతగా ఆసక్తి చూపడం లేదు. మొక్కలకు సబ్సిడీ ఇస్తున్నప్పటికీ బోరు, విద్యుత్, ఇతర అవసరాలకు భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుండడానికి తోడు పంట కోసం నాలుగేళ్ల పాటు ఎదురుచూడాల్సి రావడంతో రైతులు ఇంట్రస్ట్ చూపడం లేదు. జిల్లాలో రామప్ప, లక్నవరం, మల్లూరు ప్రాజెక్ట్‌తో పాటు గోదావరి నదీ పరివాహక ప్రాంతాలు ఉండడంతో వరి, మిర్చి సాగు చేసేందుకే రైతులు మొగ్గు చూపుతున్నారు.
గతేడాది 45 శాతమే సాగు
ములుగు జిల్లాలో 2022 – 23 సంవత్సరంలో 1,950 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయాలని ఆఫీసర్లు టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఆయిల్ పామ్ మొక్కలకు ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ ఇస్తోంది. ఒక్కో మొక్కకు రూ.197 ఖర్చు అవుతుండగా రైతు నుంచి రూ. 20 వసూలు చేస్తున్నారు. మిగతా డబ్బులను ప్రభుత్వం భరిస్తోంది. ఈ పంట సాగుపై హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు. దీంతో 9 మండలాల్లో 192 మంది రైతులు 846 ఎకరాల్లోనే సాగు చేశారు. అనుకున్న టార్గెట్‌లో 45 శాతమే పంట సాగు జరిగింది. అయితే ఆయిల్ పామ్ మొక్కలు అందించే కేఎన్ బయోసైన్స్సంస్థ సకాలంలో మొక్కలు అందుబాటులోకి తీసుకురాకపోవడం వల్లే సాగు తగ్గినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు.
ఈ సారి టార్గెట్ 4,300 ఎకరాలు
జిల్లా వ్యాప్తంగా 2023–-24 సంవత్సరానికి గానూ 4,300 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేయాలని టార్గెట్ పెట్టారు. ఇందులో భాగంగా వచ్చే మూడు నెలల్లోనే 2 వేల ఎకరాలకు సరిపడా మొక్కలు పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో రైతులకు అవగాహన కల్పించేందుకు ఆఫీసర్లు ప్రయత్నం చేస్తున్నారు. ఎకరానికి 57 మొక్కలు నాటాలని వాటిని నాలుగేళ్ల పాటు కాపాడితే తర్వాత 30 ఏళ్ల పాటు క్రాప్ వస్తుందని హార్టికల్చర్ ఆఫీసర్ వేణుగోపాల్ చెప్పారు.
భారం అవుతుందంటున్న రైతులు
ఆయిల్‌పామ్ మొక్కలకు మాత్రమే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. బోర్లు, విద్యుత్, డ్రిప్ వంటి సౌకర్యాల ఖర్చును రైతులే భరించాల్సి వస్తోంది. ఒక్క డ్రిప్ ఏర్పాటు చేసుకునేందుకే రూ. 5 వేల నుంచి రూ. 7,500 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ఆర్థిక భారం భరించలేకే రైతులు ఈ పంట సాగు వైపు మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. ఎక్కువ మొత్తం భూమి ఉన్న రైతులు మాత్రం కొంత భూమిలో ఆయిల్ పామ్ సాగు చేసేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు.
మొక్కలకే సబ్సిడీ ఇస్తున్రు
ఆయిల్‌పామ్ మొక్కలకు మాత్రమే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. ఆయిల్‌పామ్ సాగు చేయాలంటే బోరు వేసుకోవడంతో పాటు
విద్యుత్ కనెక్షన్లకు భారీ మొత్తంలో ఖర్చులు భరించాల్సి వస్తోంది. పైగా నాలుగేళ్ల పాటు ఎదురుచూడాల్సి రావడం, అప్పుడైనా పంట సరిగ్గా వస్తుందో లేదోనని రైతులు అనుమానపడుతున్నారు. ఇతర సౌకర్యాలపై కూడా సబ్సిడీ ఇవ్వాలి.
జినుకల కృష్ణాకర్‌రావు, రైతు, జంగాలపల్లి
ఆయిల్ పామ్ మంచి ప్రత్యామ్నాయం
ఆయిల్ పామ్ సాగు రైతులకు మంచి ప్రత్యామ్నాయం. నాలుగేళ్ల పాటు మొక్కలను కాపాడితే తర్వాత 30 ఏళ్ల పాటు క్రాప్ వస్తుంది. ఎకరానికి రూ.లక్ష నుంచి రూ. 2 లక్షల ఇన్‌కం ఉంటుంది. అంతర పంటలుగా మక్కజొన్న, అరటి, పసుపు, మిరప, పొద్దు తిరుగుడు, నువ్వులు, వేరుశనగ, పూలు, కూరగాయలు కూడా సాగు చేసుకోవచ్చు.
బీవీ.రమణ, హార్టికల్చర్ ఆఫీసర్, ములుగు