మరో 27,612 రైతులకు రుణమాఫీ .. నాలుగో విడతలో రూ.262 కోట్లు విడుదల

మరో 27,612 రైతులకు రుణమాఫీ .. నాలుగో విడతలో రూ.262 కోట్లు విడుదల

మెదక్​, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: నాలుగో విడత రుణ మాఫీపై రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. రైతులకు రెండు లక్షల వరకు రుణ మాఫీ అమలు చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు మూడు విడతల్లో రుణ మాఫీ అమలు చేసింది. వివిధ కారణాల వల్ల రెండు లక్షల రూపాయల లోపు రుణాలు ఉన్న కొందరు రైతులకు రుణమాఫీ కాలేదు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు కుటుంబ సభ్యుల నిర్ధారణ ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలో ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ప్రభుత్వం నాలుగో విడత రుణమాఫీకి అవసరమైన నిధులను విడుదల చేసింది. 

ఇందులో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 27,612 మంది రైతులకు రూ.262.51 కోట్లు రుణ మాఫీ అయింది.  మెదక్ జిల్లాలో నాలుగో విడతలో 7,248 మంది రైతులకు  రూ.56.87 కోట్లు మాఫీ అయ్యాయి. ఇదివరకు మూడు విడతల్లో 82,294 మంది రైతులకు రూ.604.21 కోట్ల రుణమాఫీ అయింది. నాలుగు విడతలవి కలుపుకుంటే మొత్తం 89,542 మంది రైతులకు రూ.661.08 కోట్లు మాఫీ అయ్యాయి. నాలుగో విడతలో బ్యాంకుల వారీగా, మండలాల వారీగా ఎంత మంది రైతులకు, ఎంత మేర రుణ మాఫీ అయిందనే వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు.

Also Read : మేడిగడ్డ బ్యారేజీలు డ్యామేజ్ అయినా అధికారులు పట్టించుకోలే

  సిద్దిపేట జిల్లాలో నాలుగో విడుతలో 9,064 మంది రైతులకు  రూ.95.25 కోట్లు మాఫీ అయ్యాయి. ఇదివరకు మాఫీ అయిన మూడు విడుతలు కలుపుకొని మొత్తం నాలుగు విడుతల్లో 1,11,386 మంది రైతులకు రూ.938.30 కోట్లు మాఫీ అయ్యాయి.  సంగారెడ్డి జిల్లాలో  నాలుగో విడుతలో11,301 మందికి రూ.110.39 కోట్లు  మాఫీ అయ్యాయి. నాలుగో విడతలో అర్హులైన రైతుల బ్యాంక్​ అకౌంట్లలో రుణ మాఫీ డబ్బులు జమ అవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. మూడు విడుతల్లో మెజారిటీ రైతుల రుణాలు మాఫీ కాగా ఆధార్​కార్డ్​నెంబర్​మ్యాచ్​ కాకపోవడం, రేషన్​ కార్డు లేకపోవడం వంటి కారణాలతో కొందరు రైతుల రుణాలు మాఫీ కాకపోవడంతో తమకు మాఫీ వర్తిస్తుందో లేదో అన్న ఆందోళనలో ఉన్నారు. ప్రభుత్వం నాలుగో విడత రుణ మాఫీకి అవసరమైన డబ్బులు విడుదల చేయడంతో దాదాపుగా రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకున్న అర్హులైన రైతులందరికీ మాఫీ వర్తించనుంది. దీనిపై రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.