వడ్ల గ్రేడ్ చేంజ్ .. సెంటర్లో ఏ - మిల్లుకాడ ‘కామన్’ గ్రేడ్

  • –తేమ, తాలు పేరుతో కటింగ్ 
  • ఒక్కో రైతుకు క్వింటాల్ కు రూ. 120 లాస్
  • వడ్ల కొనుగోళ్లలో రైతులకు అన్ని ఇబ్బందులే

యాదాద్రి, వెలుగు : వడ్ల కొనుగోలులో యాదాద్రి జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  వడ్ల గ్రేడ్​ సెంటర్లో ఒకలాగా, మిల్లులో ఒకలాగా  చెప్పడంతో రైతులు   ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ట్రాన్స్ పోర్ట్ విషయంలో లారీ డ్రైవర్లు కూడా ఇబ్బందులు పెడుతున్నారు. కొందరు మిల్లర్లు తాలు, తేమను సాకుగా చూపించి తూకాల్లో కోతలు పెడ్తున్నారు. మరికొందరు మిల్లర్లు తాలు, తేమతో పాటు గ్రేడ్ విషయంలో కూడా కొర్రీలు పెడుతున్నారు.

సెంటర్లో ఏ గ్రేడ్.. మిల్లు వద్ద ‘కామన్’ గ్రేడ్...

 సెంటర్లో రైతు వడ్ల అమ్మిన సమయంలో అగ్రికల్చర్ ఆఫీసర్లు 'ఏ' గ్రేడ్​తో కొనుగోలు చేశారు. తీరా మిల్లు వద్దకు లారీలు వెళ్లిన తర్వాత మిల్లర్లు కొర్రీలు పెడుతున్నారు. కామన్  గ్రేడ్ కింద అయితేనే తీసుకుంటామని లేకుంటే వడ్లను దించుకోమని తేల్చి చెబుతున్నారు. సెంటర్లో 'ఏ' గ్రేడ్ కింద కొనుగోలు చేస్తే.. ఇక్కడ కామన్ గ్రేడ్ గా ఇవ్వడమేమిటని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ గ్రేడ్ వడ్లకు మద్దతు ధర రూ.2203 అయితే 'కామన్' గ్రేడ్ వడ్లు రూ. 2183 రేటు ఉంది. గ్రేడ్ తగ్గించడం వల్ల క్వింటాల్​కు  రూ. 20 చొప్పున ఒక్కో రైతు నష్టపోతున్నారు. క్వింటాల్ రూ 120 నష్టం తేమ, తాలు పేరుతో క్వింటాల్ కు 4 నుంచి 5 కిలోలు కట్ చేస్తున్నారు. ఏ గ్రేడ్ వడ్లను బీ గ్రేడ్ చేస్తున్నారు. ఈ రెండు కలిపి ఒక్కో రైతు క్వింటాల్ కు రూ. 120 నష్ట పోతున్నారు.

తాలు.. తేమ పేరుతో...

 కొనుగోలు సెంటర్లు ఏప్రిల్ 1న ప్రారంభించారు. పేరుకు  ప్రారంభించినా.. నెలాఖరుకు గానీ  కొనుగోళ్లు ఊపందుకోలేదు. సెంటర్లు ప్రారంభించి 50 రోజులు గడిచింది.  ఇప్పటి వరకు 26 వేల మంది పైగా రైతుల వద్ద 2.70 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేశారు.  ఇంకా సెంటర్లలో వడ్ల కుప్పలు ఉన్నాయి.  తాలు, తేమ ఉన్నా. బస్తాకు రెండు కిలోల చొప్పున క్వింటాల్​కు 4 నుంచి 5 కిలోలు కోత పెడుతున్నారు. 

దీంతో క్వింటాల్ వడ్లకు రూ. 80 నుంచి రూ. 100 వరకు రైతులు నష్టపోతున్నారు. ఈ లెక్కన ఒక్కోరైతు రూ. 2 వేలకు మించి  నష్టపోతున్నారు.  కొన్ని సెంటర్లకే లారీలు వస్తున్నాయి.  మరికొన్ని సెంటర్లకు లారీలు రావడం లేదు. కొన్ని చోట్ల లారీ డ్రైవర్లు బస్తాకు రూ. 3 నుంచి రూ. 5 ఇస్తేనే తీసుకెళ్తామని, లేకుంటే తీసుకెళ్లేదే లేదని మొండికేస్తున్నారని  రైతులు చెబుతున్నారు. లారీలకు డబ్బుల విషయంలో పలు  సెంటర్లలో రైతులు, లారీ డ్రైవర్ల మధ్య గొడవలు కూడా జరిగాయి. 

ఫస్ట్ టైం ఏ గ్రేడ్.. సెకండ్ టైం బీ గ్రేడ్

తుర్కపల్లి పీఎసీఎస్ సెంటర్ లో నలుగురు రైతులకు చెందిన 372 క్వింటాళ్ల వడ్లను గత వారం కాంట పెట్టి  ఏ గ్రేడ్ గా గుర్తించారు. అనంతరం బొమ్మల రామారంలోని మిల్లుకు తరలించారు. లారీ అక్కడికి చేరుకున్న తరువాత వర్షం పడడంతో వడ్లు తడిచిపోయాయి.  మిల్లర్ వాటిని ఆన్ లోడ్ చేసుకోలేదు.  ఆ వడ్లను తిరిగి వేరే మిల్లుకు పంపించగా బీ గ్రేడ్ ఇచ్చారు. దీంతో ఆ లారీలో వడ్లు పంపిన రైతులకు ఒక్కొక్కరికి రూ 1000 నుంచి రూ. 3000 వరకు నష్టపోయారు.