- కెనాల్స్ రిపేర్లు, లిఫ్ట్‌ల నిర్వహణలో గత పాలకుల నిర్లక్ష్యం
- సామర్థ్యం మేర నీటిని విడుదల చేయలేని పరిస్థితి
- సాగునీరందక ఎండుతున్న యాసంగి పంటలు
- తీవ్ర ఆందోళనలో రైతులు
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో కెనాల్స్ రిపేర్లు, లిఫ్ట్‌ల నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో ప్రాజెక్ట్‌ల్లో నీళ్లున్నా పొలాలకు అందని పరిస్థితి. ప్రస్తుతం ఎస్సారెస్పీ నుంచి నీరు వస్తున్నా కాల్వలు సక్కగ లేక చివరి ఆయకట్టు పొలాలకు నీరుచేరడంలేదు. అలాగే ఎల్లంపల్లి ప్రాజెక్టులోనూ నీరు లేకపోవడంతో బ్యాక్ వాటర్ పై ఆధారపడి చేస్తున్న వరి ఎండిపోతోంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
ఫండ్స్ లేక రిపేర్లు చేయలే..
జగిత్యాల జిల్లాలోని ఆయకట్టుకు ఎస్సారెస్పీ నుంచి సాగునీరే ఆధారం. జిల్లా మీదుగా వెళ్తున్న కాకతీయ కాలువ నుంచి డిస్ట్రిబ్యూటరీలు, సబ్కెనాల్స్ ద్వారా పంటలకు సాగునీరు అందించాల్సి ఉంటుంది. కాగా గత సర్కార్ హయాంలో ఈ డిస్ట్రిబ్యూటరీలు నిరాదరణకు గురై శిథిలావస్థకు చేరాయి. షటర్లు కూడా పాడయ్యాయి. సబ్కెనాల్స్కు రిపేర్లు చేయకపోవడంతో లైనింగ్ దెబ్బతిని చాలాచోట్ల నీరు లీకవుతోంది. దీంతో 9వేల క్యూసెక్కుల నీటిని తరలించే సామర్థ్యమున్న కాలువల్లో 6వేల క్యూసెక్కులు కూడా తరలించే పరిస్థితి లేదు.
ఒకవేళ తరలించినా కాలువలకు గండ్లు పడుతుండడంతో 5వేల క్యూసెక్కులనే వదలుతున్నారు. దీంతో దాదాపు 30 వేల ఎకరాల చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. గత సర్కార్ హయాంలో ఫండ్స్ మంజూరు చేయకపోవడంతోనే రిపేర్లు చేయలేకపోయామని అధికారులు చెబుతున్నారు. సాగునీరు తక్కువగా వస్తుండడంతో కొందరు కాలువలకు గండ్లు పెడుతుండగా, రాత్రిళ్లు కాపాలా ఉంటున్నామని ఇంకొందరు రైతులు వాపోతున్నారు.
పంటలు ఎండుతున్నాయ్
జగిత్యాల జిల్లా పరిధి లో సారంగాపూర్, మల్యాల, వెల్గటూర్, ఎండపల్లి, పెగడపల్లి, ధర్మపురి బుగ్గారం మండలాల్లో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందక వరి పొలాలు ఎండిపోయే దశకు వచ్చాయి. ముఖ్యంగా ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ నుంచి వేంనూర్ పంప్ హౌజ్ నుంచి సాగునీరు అందించాల్సి ఉండగా నిర్వహణ లేక అది మూలపడింది. దీంతో ఎండపల్లి మండలం ఉండెడ, ముంజం పెల్లి, మారేడుపల్లి గ్రామాల్లో 1500 ఎకరాలకు నీరందడం లేదు. గొల్లపల్లి మండలం లొత్తునూరు, వెనుగుమట్ల, బొంకూరు గ్రామాల్లోని 2 వేల ఎకరాలకు పైగా వరి ఎండుతోంది. సారంగాపూర్ మండలం బట్టపల్లి పోతారం, రేచపల్లి గ్రామాల్లో ఎస్సారెస్పీ నీరు అందుతున్నప్పటికీ తూములు దెబ్బతిని నీరందడం లేదు.
Also Read: బీఆర్ఎస్తో ఆర్ఎస్పీ
మూడెకరాలు ఎండిపోయింది
నాకు ఉన్న ఐదు ఎకరాల్లో వరి సాగుచేశాను. ఎస్సారెస్పీ నుంచి నీరందకపోవడంతో మూడెకరాలు ఎండిపోయింది. వ్యవసాయ బావి కింద రెండెకరాలకు మాత్రమే నీరందుతోంది. చివరి ఆయకట్టు రైతులకు నీరందించేందుకు కెనాల్స్ రిపేర్లు చేయాలి
ఎర్రం రాజయ్య, రైతు, ముంజంపల్లి