- మద్దతు ధర కంటే రూ. 2,500 తగ్గించి కొంటున్న వ్యాపారులు
- వనపర్తి జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయని ఆఫీసర్లు
- తప్పని పరిస్థితిలో ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతున్న రైతులు
- ఓ వైపు ధర తగ్గిస్తూ, మరో వైపు మార్కెట్ సెస్‌నూ ఎగ్గొడుతున్న వ్యాపారులు
వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లాలో కంది కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ఆ పంటను సాగు చేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న ప్రైవేట్ వ్యాపారులు తమకు ఇష్టం వచ్చిన రేటు నిర్ణయిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఓ వైపు మార్కెట్ సౌకర్యం లేక, మరో వైపు కందులను దాచుకోలేక రైతులు ప్రైవేట్ వ్యాపారులు చెప్పిన రేటుకే అమ్ముకుంటున్నారు.
క్వింటాల్‌కు రూ. 2,500 నష్టం
వనపర్తి జిల్లాలో మొత్తం 6,724 ఎకరాల్లో కందిని సాగు చేయగా సుమారు 60 వేల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కానీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తమ పంటను తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్‌వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. దీంతో భారీ మొత్తంలో నష్టపోతున్నారు. క్వింటాల్ కందులకు కేంద్రం రూ. 7,550 మద్దతు ధర నిర్ణయించింది. కానీ ప్రైవేట్ వ్యాపారులు మాత్రం రూ. 5 వేలకు మించి ఇవ్వడం లేదు. దీంతో ఒక్కో రైతు క్వింటాల్‌పై రూ. 2,500 వరకు నష్టపోతున్నారు.
ఇండ్ల వద్దకే తెప్పించుకుంటున్నరు
జిల్లాలో కందులు పండించిన రైతులను కమీషన్ ఏజెంట్లు గుర్తించి డైరెక్ట్‌గా వారి వద్దకే వెళ్తున్నారు. పంటను బయటి ప్రాంతాలకు తరలించి అమ్ముకోవాలంటే సవాలక్ష నిబంధనలకు తోడు రవాణా చార్జీల భారం పడుతుందని భయపెడుతున్నారు. స్థానికంగానే కంది కొనుగోలు చేస్తామంటూ రైతులకు నచ్చజెప్పి పంటను తమ ఇండ్ల వద్దకే తెప్పించుకుంటున్నారు.
Also Read :- ఓరుగల్లులో పెద్ద రోడ్లకింద పోతున్న రైతుల బతుకులు
తీరా రైతులు పంటను తీసుకొచ్చాక క్వింటాల్‌కు రూ. 2000 నుంచి రూ. 2,500 వరకు కోత పెడుతున్నారు. ఇలా ఇండ్ల వద్దకు పంటను తెప్పించుకొని కొనడం రూల్స్‌కు విరుద్ధమైనప్పటికీ, ఎవరూ పట్టించుకోకపోవడంతో వ్యాపారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
సెస్‌నూ ఎగ్గొడుతున్నరు
రైతుల నుంచి కొనుగోలు చేసిన పంట వ్యాపారులు బయట మార్కెట్‌లో అమ్ముకోవాలంటే తప్పనిసరిగా ఒక శాతం మార్కెట్ సెస్ చెల్లించాలి. ఈ సంవత్సరం వచ్చిన దిగుబడిలో సుమారు రూ. 40 కోట్ల విలువైన పంటను ప్రైవేట్ వ్యాపారులు కొన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన మార్కెట్‌కు సుమారు రూ. 40 లక్షల సెస్ కట్టాలి. కానీ ప్రైవేట్ వ్యాపారులు తక్కువ మొత్తంలో సరుకును కొన్నట్లు చూపించి రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షలు మాత్రమే సెస్ రూపంలో చెల్లించి మమ అనిపిస్తున్నారు. ఇలా.. తక్కువ ధర ఇస్తూ ఓ వైపు రైతులను, సెస్ ఎగ్గొడుతూ మరో వైపు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రైవేట్ వ్యాపారులను అడ్డుకోవడంతో పాటు, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.