ఔటర్ రింగ్ రోడ్లు, రీజనల్ రింగ్ రోడ్లు, ఎనిమిది వరసల రోడ్లు, కొత్త సెక్రటేరియట్ భవనాలు, స్కై ఓవర్లు, ఫ్లై ఓవర్లు, మెట్రో రైలు మార్గాలు, విమానాశ్రయాలు, టీ హబ్ లు, వేలాడే వంతెనలు.. ఇలా రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధి అంటే ఇప్పటి వరకు ప్రభుత్వాల దృష్టిలో ఉన్నవి ఇవే. నగరాలు, పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధే అభివృద్ధిగా చెప్పుకునే ఒక అపసవ్య అభివృద్ధి నమూనా చలామణిలో ఉన్నదిప్పుడు. పైగా ఈ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థలు, పార్కులు, స్వచ్ఛమైన తాగు నీరు అందుబాటు, పిల్లలకు ఆట స్థలాలు లాంటివి ధనికులు, ఉన్నత మధ్యతరగతి ప్రజలు నివసించే ప్రాంతాలకే పరిమితమై, నగరాల్లో పేదలు నివసించే బస్తీలు మురికివాడలుగానే మిగిలిపోతున్నాయి. పేదల పిల్లలు చదువుకోవడానికి వెళ్లే సర్కారు బడులు, కాలేజీలు, హాస్టల్స్, పేదల వైద్య అవసరాలు తీర్చాల్సిన ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఎంతగా మౌలిక వసతుల కొరతతో ఇబ్బంది పడుతున్నాయో, వాటి పట్ల ప్రభుత్వం ఎంతగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదో మనం రోజూ చూస్తున్నాం. దశాబ్దాలు గడుస్తున్నా, గ్రామాల్లో పేద ప్రజల గృహ నిర్మాణాలకు, స్కూల్స్, ఆసుపత్రుల అభివృద్ధికి, మరీ ముఖ్యంగా వ్యవసాయానికి, పశుపోషణకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి పట్ల ప్రభుత్వాలకు పట్టింపు చాలా తక్కువే. వీటి కోసం రాష్ట్ర బడ్జెట్ లో కేటాయింపులూ అతి తక్కువ.
పల్లెల్లో మౌలిక వసతులు వద్దా..?
గ్రామాల్లో ఇప్పటికీ అనేక పేద కుటుంబాలు సరైన ఇల్లు లేక ఇబ్బంది పడటాన్ని మనం చూస్తున్నాం. ప్రభుత్వం చెప్పిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం గ్రామీణ ప్రాంతంలో ప్రజల అవసరాలను ఒక్క శాతం కూడా తీర్చలేదు. గతంలో కూడా అనేక గృహ నిర్మాణ పథకాలు అమలైనా, ఇళ్ల కొరత ఇంకా ఎక్కువగానే ఉంది. గత దశాబ్ద కాలంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఏ ప్రభుత్వమూ గ్రామాల్లో ఇండ్ల స్థలాల కేటాయింపు, ఇళ్ల నిర్మాణం పట్ల శ్రద్ధ పెట్టడం లేదు. కేటాయించే కొద్దిపాటి ఇండ్లు కూడా తమ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి పంచుకోవడం, ఫలితంగా నోరు లేని పేదలు లబ్ధిదారులుగా మారలేక నిస్సహాయంగా చూడటం.. ఇదీ చరిత్ర, వర్తమానం కూడా. గ్రామీణ ప్రజలు, ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్న మరో సమస్య గ్రామం చుట్టూ ఉండే పొలాలకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం. దశాబ్దాలు గడుస్తున్నా, ఈ డొంకలను అభివృద్ధి చేయకపోవడం, వాటిని సిమెంట్, లేదా తారు రోడ్లుగా మార్చకపోవడం, మట్టి రోడ్లు గుంతలు పడుతున్నా, పట్టించుకోకపోవడం. ఈ రోడ్ల పక్క నుంచి నీరు పోవడానికి అవసరమైన కాలువల నిర్మాణం చేపట్టకపోవడం వల్ల పొలాల నుంచి నీరు బయటకు వెళ్లక పంట నష్టాలు జరగడం గమనిస్తున్నాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈ కాలువ పనులను కొన్ని చోట్ల చేపట్టినప్పటికీ, ఆ కాలువలకు లైనింగ్ చేయకపోవడం వల్ల, అవి వేగంగా పూడిపోతున్నాయి.
రాయితీపై రైతులకు డీజిల్ ఇవ్వొచ్చు
గ్రామీణ రైతులకు బాగా ఉపయోగపడేవి రైతు సహకార సంఘాలు, ఎఫ్‌పీవోల ఆధ్వర్యంలో నెలకొల్పే కస్టమ్ హైరింగ్ సెంటర్లు. రైతులు పండించే వివిధ పంటలకు అవసరమైన యంత్రాలను ఈ సెంటర్ల లో ఉంచగలిగితే , రైతులకు తక్కువ ధరలకు సేవలు అందుతాయి. ఇప్పటికే కొన్ని ఎఫ్‌పీవోలు ఈ ప్రక్రియను అమలు చేస్తున్నాయి. వాటిని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి గ్రాంట్ లు ఇవ్వొచ్చు. కొంత మొత్తాలను రుణంగా బ్యాంకుల నుంచి ఇప్పించవచ్చు. వాటికి అయ్యే వడ్డీ భారాన్ని రాయితీగా రాష్ట్ర ప్రభుత్వం భరించవచ్చు. సహకార సంఘాలు సమకూర్చుకునే వ్యవసాయ యంత్రాలు, ప్రాసెసింగ్ యూనిట్ల కొనుగోలుపై చెల్లించే జీఎస్టీ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాయితీగా సంఘాలకు అందించవచ్చు. ఈ యూనిట్లకు అవసరమైన విద్యుత్ ను తక్కువ ధరలకు ఇవ్వొచ్చు. పంట సాగు ఖర్చులు తగ్గించడానికి, ఎకరానికి కనీసం10 లీటర్ల చొప్పున డీజిల్ ను రాయితీపై రైతులకు అందించవచ్చు.
నిధుల దుర్వినియోగం ఆపితే.. అన్నీ సాధ్యమే!
గ్రామాల్లో పాడి పశువులు, మేకలు, గొర్రెలు అనారోగ్యం బారిన పడకుండా, సంరక్షించేందుకు అవసరమైన వైద్య సేవలను ప్రతి రెండు గ్రామ పంచాయతీల మధ్యలో నెలకొల్పాలి. అక్కడ సరైన వైద్య సిబ్బందిని నియమించాలి. మందులను అందుబాటులో ఉంచాలి. చేపల చెరువుల్లో చేపల ఉత్పత్తి కూడా పెరుగుతున్నందున, వాటి సంరక్షణకు, పాలు, మాంసం, గుడ్లు, చేపల రవాణాకు అవసరమైన చర్యలు చేపట్టడంతో పాటు, వీటి కోసం కోల్డ్ చైన్ కూడా వారికి అందుబాటులో ఉంచితే, ఉత్పత్తుల్లో నాణ్యత పెరుగుతుంది. మార్కెట్ సులభం అవుతుంది. రైతులకు మంచి ధరలు లభిస్తాయి. గ్రామాల్లో నిర్మాణం అవుతున్న రైతు వేదికలను గ్రామీణ యువతీ యువకులకు, మహిళలకు, రైతులకు, కూలీ బృందాలకు వివిధ విషయాలపై శిక్షణ ఇవ్వడానికి శిక్షణా కేంద్రాలుగా ఉపయోగిస్తే నైపుణ్యం కలిగిన మానవ వనరులు గ్రామాల్లోనే అందుబాటులోకి వస్తాయి. స్థానికంగా ప్రజలకు అవసరమైన అన్ని సేవలకూ స్థానికంగానే శిక్షణ పొందిన వారికి ఉపాధి కల్పించవచ్చు. మిగిలిన వారు పట్టణాలలో నైపుణ్యం కలిగిన పనులకు వెళ్లగలుగుతారు. వీటన్నిటికీ నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రభుత్వం అడగవచ్చు. రైతు బంధు పథకంలో నిధుల దుర్వినియోగాన్ని ఆపితే ఇవన్నీ సాధ్యమే. కావాలంటే చర్చకు మేము సిద్ధం.
ప్రభుత్వ ద్వంద్వ నీతి
పంట కోసి ఆరబెట్టుకోవడానికి సరైన సౌకర్యాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొలాల మధ్యలోనే పట్టాలు పరిచి ఆరబోయడం, లేదా పొలాల మధ్య ఉండే డొంకల్లో ధాన్యం ఆరబోయడం, జిల్లా, రాష్ట్ర, జాతీయ రహదారుల వెంట పొలాలు ఉన్న రైతులు ఆయా రహదారులపై పంటలను ఎండబోయడం చూస్తున్నాం. దీని వల్ల రైతులకు ఇబ్బందులతోపాటు రోడ్లపై పోస్తున్న ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రైతులు తమ పంటలను ఆరబోసుకోవడానికి రూ. 750 కోట్లతో లక్ష కల్లాలు నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 50, 60, 75 చదరపు మీటర్లతో నిర్మించే ఈ కల్లాలకు వరుసగా రూ.56 వేలు, రూ. 68 వేలు, రూ. 85 వేలుగా బడ్జెట్ కూడా నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీలకు పూర్తి ఉచితంగా ఈ కల్లాలు నిర్మించి ఇస్తామని చెప్పింది. బీసీ, ఓసీ రైతులు మొత్తం ఖర్చులో 10 శాతం వాటా భరించాలని నిర్దేశించింది. కానీ ఈ కల్లాల నిర్మాణ ప్రక్రియ వేగంగా ముందుకు వెళ్లడం లేదు. రెండు విడతలుగా డబ్బులు విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం ముందుగా రైతులు పెట్టుబడి పెట్టుకుని నిర్మాణం ప్రారంభించాలని షరతు విధించింది. ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తుందో తెలియని రైతులు ధైర్యం చేసి కల్లాల నిర్మాణానికి ముందుకు రావడం లేదు. రైతుల ఆదాయాలు తక్కువ ఉండటం, పంట సాగు అప్పులతో పాటు, తిరిగి వీటి నిర్మాణానికి కూడా అప్పులు చేయడం అనేది రైతులకు సాధ్యం అయ్యే పని కాదు. అంతగా అవసరం లేని రాయదుర్గం –ఎయిర్‌పోర్టు మెట్రో రైలు మార్గం నిర్మాణానికి రూ. 6000 కోట్లు పూర్తిగా సొంతంగా భరించడానికి సిద్ధపడిన రాష్ట్ర సర్కారు, గ్రామీణ ప్రాంతంలో కల్లాల నిర్మాణానికి మాత్రం అలవి కాని షరతులు విధించింది. ప్రభుత్వ ద్వంద్వ నీతికి నిదర్శనమిది.
గిడ్డంగుల నిర్మాణం లేక..
గ్రామీణ ప్రాంతంలో పంటలు ఎండబెట్టుకునే కల్లాలు, పంటలను దాచుకునే గిడ్డంగులు లేకుండా రైతులకు కనీస మద్దతు ధరలు అందవని, కేంద్ర వ్యవసాయ ఉత్పత్తుల ఖర్చుల ధరల నిర్ణాయక కమిషన్(సీఏసీపీ) 2018 నుంచి ఏటా సిఫారసు చేస్తూనే ఉన్నది. కానీ ఇప్పటికీ ఎక్కడా కల్లాలు, గిడ్డంగులు ఏర్పాటుకు చర్యలు లేవు. మండల కేంద్రాల్లో నిర్మించిన గిడ్డంగుల సామర్థ్యం కూడా ఇప్పటికీ పంటల ఉత్పత్తితో పోల్చినప్పుడు తక్కువే. వాటిలో రైతులు పంటలను దాచుకునే స్థితి లేదు. ప్రతి గ్రామ పంచాయతీ మధ్యలో రైతు సహకార సంఘాలు, రైతు ఉత్పత్తి దారుల సంఘాల ఆధ్వర్యంలో గిడ్డంగులు నిర్మిస్తే మాత్రమే రైతులకు ఎక్కువ ఉపయోగం. ఈ గిడ్డంగుల్లో దాచుకున్న పంటకు కూడా దాచుకున్న పంట విలువలో 75 శాతం మొత్తాన్ని6 నెలలకు వడ్డీ లేని రుణంగా ఇచ్చే “రైతు బంధు పథకం” వర్తింప చేయాలి. కూరగాయలు, పండ్లు పండించే ప్రాంతాల్లో సోలార్ బేస్డ్ “కోల్డ్ స్టోరేజ్” ల నిర్మాణం చేపడితే కూడా రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి స్థానికంగా అందుబాటులో ఉంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే పంట నష్టాలు కూడా గణనీయంగా తగ్గుతాయి.
- కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక