ఓపెన్‌‌‌‌ కాని సీసీఐ సెంటర్లు .. ప్రైవేట్‌‌‌‌ వైపు పత్తి రైతులు

ఓపెన్‌‌‌‌ కాని సీసీఐ సెంటర్లు .. ప్రైవేట్‌‌‌‌ వైపు పత్తి రైతులు
  • గ్రామాలకే వచ్చి పత్తిని కొంటున్న ప్రైవేట్‌‌‌‌ వ్యాపారులు
  • మద్దతు ధర కంటే రూ. వెయ్యి నుంచి రూ. 1,200 తక్కువ చెల్లింపు
  • సెంటర్లు లేకపోవడం, డబ్బు అవసరం ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అమ్ముకుంటున్న రైతులు

సిద్దిపేట, వెలుగు:  అనేక ఇబ్బందులు పడి పత్తి సాగు చేసిన రైతులకు.. ఆ పంటను అమ్ముకుందామన్నా తిప్పలు తప్పడం లేదు. పంట చేతికొచ్చినప్పటికీ సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డబ్బులు అత్యవసరం ఉన్న వారు పంటను ప్రైవేట్‌‌‌‌ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు తక్కువ ధర చెల్లిస్తున్నారు. దీంతో రైతులు క్వింటాల్‌‌‌‌కు రూ. వెయ్యికి పైగానే నష్టపోతున్నారు.

10 లక్షల క్వింటాళ్ల దిగుబడి

జిల్లాలో 1.04 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగగా 10 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఆఫీసర్లు అంచనా వేశారు. సీజన్‌‌‌‌ మొదట్లో భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడడంతో సాగుపై తీవ్ర ప్రభావం పడింది. అధిక వర్షాల వల్ల కొంత మేర నష్ట పోగా మిగిలిన పత్తిని అమ్ముకునేందుకు సిద్ధమయ్యారు. దసరా ముగిసిన తర్వాత పత్తిని అమ్ముకునేందుకు రైతులు మార్కెట్‌‌‌‌కు వస్తున్నారు. కానీ సీసీఐ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ప్రైవేట్‌‌‌‌ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.  

16 జిన్నింగ్ మిల్లుల నోటిఫై

జిల్లాలో మొత్తం 24 జిన్నింగ్ మిల్లులు ఉండగా వాటిలో 16 మిల్లులను సీసీఐ కేంద్రాలుగా నోటిఫై చేశారు. జిన్నింగ్‌‌‌‌ మిల్లుల నోటిఫై ఆగస్ట్‌‌‌‌లోనే ప్రారంభమైనా మిల్లు ఓనర్లు, సీసీఐకి మధ్య ఏకాభిప్రాయం కుదరడంలో ఆలస్యం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చొరవ తీసుకుని చర్చలు జరపడంతో టెండర్ల ప్రక్రియ సజావుగా పూర్తి అయింది. సీసీఐ కేంద్రాల్లో కొనుగోలు చేసిన పత్తి క్వాలిటీని జిన్నింగ్‌‌‌‌ మిల్లుల యాజమాన్యాలు పరిశీలించి మద్దతు ధర అందజేస్తారు. మిల్లులు నోటిఫై చేసినా ఇప్పటివరకు కేంద్రాలను ఓపెన్‌‌‌‌ చేయలేదు.

రూ. వెయ్యికిపైగా తగ్గిస్తున్న వ్యాపారులు

సీసీఐ కేంద్రాలు ఏర్పాటు కాకపోవడంతో ధరలపై ప్రభావం పడుతోంది. గతేడాది మద్దతు ధర రూ. 6,620 నుంచి  7,020  వరకు ఉండగా, ప్రస్తుతం ధరను రూ. 7,521గా ప్రభుత్వం నిర్ణయించింది. గింజ సైజ్‌‌‌‌ను బట్టి క్వింటాల్‌‌‌‌కు రూ. 7,121 నుంచి రూ. 7,521 చెల్లించాలని నిర్ణయించారు. అయితే వివిధ అవసరాల కోసం కొంత పంటను అమ్ముకునేందుకు వస్తున్న రైతులకు ప్రైవేట్‌‌‌‌ వ్యాపారులు తక్కువ ధర చెల్లిస్తున్నారు. వివిధ కారణాలను సాకుగా చూపుతున్న వ్యాపారులు క్వింటాల్‌‌‌‌కు రూ. 6,500కు మించి ఇవ్వడం లేదు. రెండు రోజుల కింద జగదేవ్‌‌‌‌పూర్‌‌‌‌, గజ్వేల్‌‌‌‌లో రూ. 6,500, బెజ్జంకి మండలంలో రూ. 6,200  మాత్రమే చెల్లించారు. తేమ ఎక్కువగా ఉందని, మార్కెట్‌‌‌‌లో డిమాండ్‌‌‌‌ లేదని క్వింటాల్‌‌‌‌కు రూ. వెయ్యికిపైగా కోత పెడుతున్నారు. కొందరు వ్యాపారులు గ్రామాల్లో తిరుగుతూ పత్తిని కొనుగోలు చేస్తున్నారు. 

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గాగిల్లాపూర్‌‌‌‌కు చెందిన కాచం వెంకటేశం తనకున్న భూమితో పాటు మరో 13 ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. పంట చేతికొచ్చినప్పటికీ సీసీఐ కేంద్రాలు ఏర్పాటు కాకపోవడం, డబ్బు అవసరం ఉండడంతో గ్రామానికి వచ్చిన ఓ ప్రైవేట్‌‌‌‌ వ్యాపారికి క్వింటాల్‌‌‌‌కు రూ. 6,200 చొప్పున 20 క్వింటాళ్ల పత్తిని అమ్మాడు. దీంతో క్వింటాల్‌‌‌‌కు రూ. 1,321 నష్టపోవాల్సి వచ్చింది. జిల్లాలోని మిగతా రైతుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

వారం రోజుల్లో సీసీఐ కేంద్రాలు 

వారం రోజుల్లో సీసీఐ కేంద్రాలను ఓపెన్‌‌‌‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలో 16 జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేశాం. పత్తి క్వాలిటీ ఆధారంగా మద్దతు ధర చెల్లించేలా చర్యలు తీసుకుంటాం. రైతులు తొందరపడి పత్తిని ప్రైవేట్‌‌‌‌ వ్యాపారులకు అమ్ముకోవద్దు.నాగరాజు, మార్కెటింగ్ అధికారి, సిద్దిపేట జిల్లా