యాసంగికి రెడీ .. 2.36 లక్షల ఎకరాల్లో వరి సాగు

యాసంగికి రెడీ .. 2.36 లక్షల ఎకరాల్లో వరి సాగు
  • ఎరువులు, విత్తనాల కొరత లేకుండా ఏర్పాట్లు 
  • యాక్షన్ ​ప్లాన్ రెడీ చేసిన వ్యవసాయ శాఖ

కామారెడ్డి, వెలుగు :  కామారెడ్డి జిల్లాలో రైతులు యాసంగి సీజన్​లో పంటల సాగుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే చాలా ఏరియాల్లో వరి నారు పోసుకున్నారు. మక్క, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. వానకాలం సీజన్​ముగిసి.. వరి కోతలు, అమ్మకాలు చివరి దశకు వచ్చాయి. ఈ నెలాఖరుకు వరి కొనుగోళ్లు కంప్లీట్​కానున్నాయి. దీంతో వ్యవసాయ శాఖ కూడా యాసంగి ( రబీ ) సీజన్​ప్లాన్ సిద్దం చేసింది. 

యాసంగిలోనూ రైతులు ఎక్కువగావరి సాగే చేయనున్నారు. జిల్లాలో యాసంగి సీజన్​ 3,90, 434 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు ఆవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 2,36,278 ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశముంది. 43,173 ఎకరాల్లో మక్క , 40,080 ఎకరాల్లో జొన్న, 57,800 ఎకరాల్లో శనగ , 5,708 ఎకరాల్లో సన్​ప్లవర్​, 1,117 ఎకరాల్లో పల్లి సాగు చేస్తారని యంత్రాంగం భావిస్తోంది. 

ఇప్పటికే కొన్ని ఏరియాల్లో రైతులు శనగ, మక్క పంటల సాగు మొదలుపెట్టారు. యాసంగికి అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. యూరియా 56,340 మెట్రిక్​ టన్నులు, కాంప్లెక్స్​ ఎరువులు 39,043 మెట్రిక్​ టన్నులు, డీఏపీ 19,521 మెట్రిక్​ టన్నులు, వరి విత్తనాలు 70,883 క్వింటాళ్లు, మక్క 1295 క్వింటాళ్లు, శనగ 4624 క్వింటాళ్లు, సన్​ప్లవర్​ 228 క్వింటాళ్లు అవసరమవుతాయి. విత్తనాలు, ఎరువుల కోసం రైతులు ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. 

 ప్రాకెక్టుల్లో ఫుల్​ నీళ్లు

ప్రస్తుతం నిజాంసాగర్​, పోచారం ప్రాజెక్టులతోపాటు చెరువుల్లో పుష్కలంగా నీళ్లున్నాయి. సాగునీటికి తిప్పలు లేకపోవడంతో రైతులు పూర్తిస్థాయిలో సాగుకు చేసేందుకు సిద్ధమవుతున్నారు. నిజాంసాగర్​, పోచారం ప్రాజెక్టుల కింద ఎక్కువగా వరి పంట వేస్తారు. ఇప్పటికే లింగంపేట, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, నిజాంసాగర్​, బీర్కుర్​, బాన్సువాడ, నస్రుల్లాబాద్​ మండలాల్లో వరి నారు పోశారు. పలు చోట్ల నారు ఎదిగింది. కామారెడ్డి ఏరియాల్లో ఇంకా వరి కోతలు కంప్లీట్​ కాలేదు. దీంతో ఇక్కడ యాసంగి కోసం కాస్త లేట్​గా ఇక్కడ నారు మళ్లు వేయనున్నారు.