పత్తి అమ్మాలంటే  కర్నాటక వెళ్లాల్సిందే!....పక్క రాష్ట్రంలో పత్తి అమ్ముకోలేక రైతుల తిప్పలు

పత్తి అమ్మాలంటే  కర్నాటక వెళ్లాల్సిందే!....పక్క రాష్ట్రంలో పత్తి అమ్ముకోలేక రైతుల తిప్పలు
  • జోగులాంబ జిల్లాలో ఓపెన్  కాని సీసీఐ కొనుగోలు కేంద్రం
  • మద్దతు ధర లేక నష్టపోతున్న రైతులు

గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో పండించిన పత్తిని అమ్ముకొనేందుకు కర్నాటకకు వెళ్లాల్సి వస్తోంది. అక్కడ పత్తిని అమ్ముకోలేక రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కర్నాటకలో ప్రైవేట్​ వ్యాపారులు సిండికేట్​గా ఏర్పడి తేమ ఎక్కువగా ఉందని, పత్తి గ్రేడ్ ను బట్టి క్వింటాలు పత్తిని రూ. 4 వేల నుంచి రూ.6,300 వరకు చెల్లిస్తున్నారని వాపోతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో పత్తి మార్కెట్  లేకపోవడం, ఇప్పటివరకు సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తమ పత్తి అమ్ముకునేందుకు కర్నాటకకు వెళ్లాల్సి వస్తోంది.

1.30 లక్షల ఎకరాల్లో పత్తి సాగు

జోగులాంబ గద్వాల జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అయినట్లు అగ్రికల్చర్  ఆఫీసర్లు చెబుతున్నారు. 12.91 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇంత పెద్ద మొత్తంలో పంట సాగు చేసినప్పటికీ కొనుగోలుకు మాత్రం సరైన ఏర్పాట్లు చేయడం లేదని రైతులు అంటున్నారు. ఇప్పటికే వేల క్వింటాళ్ల పత్తిని కర్నాటకలో తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వచ్చిందని వాపోతున్నారు.

మద్దతు ధర దక్కట్లే..

పత్తి రైతుకు మద్దతు ధర దక్కడం లేదు. ఏ గ్రేడ్  పత్తికి రూ.7,521, సాధారణ పత్తికి క్వింటాలుకు రూ.7,121గా ప్రభుత్వం ధర నిర్ణయించింది. అయితే పత్తి అమ్ముకునేందుకు గద్వాల జిల్లాలో మార్కెటింగ్  సౌకర్యం లేదు. దీంతో రైతులు జిల్లాలోని ప్రైవేట్​ వ్యాపారులకు క్వింటాలుకు రూ.6,200కు అమ్ముకున్నారు. ఇక కర్నాటకలోని రాయచూరు మార్కెట్ కు తీసుకెళ్తే అక్కడ కూడా క్వింటాలుకు రూ.6,300 మించి చెల్లించడం లేదని చెబుతున్నారు. ఈ లెక్కన క్వింటాలుకు రూ. వెయ్యి వరకు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది.

కొనుగోలు సెంటర్  ఓపెన్  చేయలే..

జిల్లాలో పత్తి కొనుగోలు కోసం సీసీఐ సెంటర్లను ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పారు. గత ఏడాది రెండు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఈ ఏడాది మాత్రం అలంపూర్ నియోజకవర్గంలో మాత్రమే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. దీంతో తాము పత్తిని ఎక్కడ అమ్ముకోవాలని గద్వాల నియోజకవర్గం రైతులు ప్రశ్నిస్తున్నారు.

బయటి మార్కెట్ లో ధర లేకపోవడం, జిల్లాలో ఏర్పాటు చేస్తామన్న కొనుగోలు కేంద్రం ఇంకా ఏర్పాటు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు.కర్నాటకలో పత్తి అమ్ముకునేందుకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. ఒక్కోసారి రెండేసి రోజులు ఉండాల్సి వస్తోంది. రాయచూరుకు పత్తి తీసుకెళ్లేందుకు క్వింటాలుకు రూ.500 వరకు ట్రాన్స్​పోర్ట్​ చార్జీలు అదనంగా చెల్లించాల్సి వస్తోందని అంటున్నారు. 

కొనుగోలు కేంద్రం ఓపెన్  చేస్తాం..

రెండు, మూడు రోజుల్లో అలంపూర్ లో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. గతంలో గద్వాలలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రంలో నష్టం రావడం వల్ల ఈసారి ఏర్పాటు చేయడం లేదు. నవంబర్ లో పత్తి వస్తుందనే ఉద్దేశంతో సెంటర్  ఓపెన్  చేయడానికి కొంత ఆలస్యమైంది. పుష్పమ్మ, మార్కెటింగ్  ఆఫీసర్, గద్వాల