- ఉమ్మడి జిల్లాలో 10 లక్షల ఎకరాల్లో పత్తి సాగు
- 75 లక్షల క్వింటాళ్లు వస్తుందని అంచనా
- మరో 15 రోజుల్లో పత్తి ఏరేందుకు ఏర్పాట్లు
ఆదిలాబాద్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది పత్తి పంట ఆశాజనంగా ఉండడంతో మంచి దిగుబడి వస్తుందని రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 17 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతుండగా ఇందులో 10 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. 75 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అంచనాలు ఉండడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 24 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
ప్రస్తుతం సీసీఐ కొనుగోలు చేసిన పత్తిని జిన్నింగ్ చేసేందుకు టెండర్లు పిలిచి మిల్లుల యజమానులకు అప్పగించనున్నారు. ఇప్పటికే పత్తి కొనుగోళ్లపై జిల్లా అధికారులతో రీజినల్ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ రివ్యూ నిర్వహించి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పత్తి కాయలు మరో వారం రోజుల్లో పగిలే అవకాశం ఉండడంతో 15 రోజుల్లో పత్తి ఏరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
దిగుబడిపై ధీమా..
జిల్లాలో పత్తి పంట దిగుబడులపై గడిచిన రెండుమూడేండ్లలో వర్షాలు, చీడ పీడల ప్రభావం తీవ్రంగా కనిపించింది. 80 శాతం మంది పంట పొలాల్లో ఎకరానికి కేవలం 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి వచ్చి తీవ్రంగా నష్టపోయారు. ధర సైతం ఆశించిన స్థాయిలో లేదు. అయితే ఈ సారి ప్రభుత్వం పత్తి క్వింటాల్‌కు రూ.7,521 మద్దతు ధర ఇవ్వనుంది. వర్షాలు సైతం సంమృద్ధిగా కురవడంతో పంటలు ఏపుగా పెరిగి పూత, కాయ భారీగా కాసింది.
ఎకరానికి 8 క్వింటాళ్ల నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ప్రైవేట్ ధర సైతం రూ.10 వేల వరకు పలికే అవకాశం ఉందని మార్కెట్లో ప్రచారం జరుగుతోంది. వ్యాపారుల చేతివాటం ప్రదర్శించకుంటే పత్తి రైతుల పంట పడుతుందని, అధికారులు దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని రైతులు కోరుతున్నారు.
కలెక్టర్ మీటింగ్ తర్వాత తేదీ ప్రకటిస్తా
ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 4.21 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. దాదాపు 29 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నాం. పత్తి కొనుగోళ్లకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 10 కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. వచ్చే నెల 3న పత్తి కొనుగోళ్లపై కలెక్టర్‌తో సమావేశం ఉంది. అనంతరం కొనుగోళ్ల తేదీని ప్రకటిస్తాం.- గజానంద్, మార్కెటింగ్ ఏడీ ఆదిలాబాద్
గిట్టుబాటు ధర కల్పించాలి
గతేడాది అధిక వర్షాలతో ఎకరానికి 5 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది 5 ఎకరాల్లో పత్తి సాగు చేసినం. ప్రస్తుతం పంట ఆశాజనకంగా ఉంది. పంట పూత, కాత దశలో ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్లు వస్తుందని ఆశిస్తున్నాం. పత్తి ధర సైతం అనుకూలంగా ఉంటే
లాభం వస్తుంది. రామన్న, రైతు, అంకోలి గ్రామం