అకాల వర్షంతో రైతులు ఆగమాగం.. చేతికొచ్చే దశలో పంటలన్నీ  నేలపాలు

  • వరికర్రలే మిగిలినయ్..
  • అకాల వర్షంతో రైతులు ఆగమాగం.. చేతికొచ్చే దశలో పంటలన్నీ  నేలపాలు
  • కొనుగోలు కేంద్రాల్లోనూ తడిసిన కుప్పలు 
  • ఉమ్మడి జిల్లాలో 42429 ఎకరాల్లో పంట నష్టం.

కామారెడ్డి / నిజామాబాద్, వెలుగు:   ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో  అకాల వర్షాలు రైతులను ఆగమాగం చేస్తున్నాయి. మంగళవారం కురిసిన వడగండ్ల వాన రైతులకు కడగండ్లు మిగిల్చింది. వరి కోసే దశలో వడగండ్లు  పడడంతో గింజలు రాలి పోయి కర్రలు మోడుగా మిగిలాయి.  ఉమ్మడి జిల్లాలో  42, 429 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.  కామారెడ్డి జిల్లాలో  ఈ నెల22, 25 తేదీల్లో కురిసిన  వానలకు 17 మండలాల్లోని  171  గ్రామాల్లో  31,929 ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు.  22,060  మంది రైతులు నష్టపోయినట్లు తెలిపారు.  వరి   31,814 ఎకరాలు,   మక్క 11 ఎకరాలు,  టమాట 64 ఎకరాలు,  మామిడి 40 ఎకరాల్లో  దెబ్బతిన్నట్లు   అగ్రికల్చర్​, రెవెన్యూ అధికారులు గుర్తించారు.  లింగంపేట, కామారెడ్డి,  రాజంపేట,  బాన్స్​వాడ, భిక్కనూరు, ఎల్లారెడ్డి, నిజాంసాగర్​,  బీర్కుర్​, సదాశివనగర్​,   నాగిరెడ్డిపేట మండలాల్లో  పంట నష్టం ఎక్కువగా  ఉంది. 

నిజామాబాద్​ జిల్లాలో..

జిల్లాలో 10,500 ఎకరాల్లో పంట  నష్టం జరిగినట్లు అంచనా వేశారు.  8వేల ఎకరాలు వరి,   1,602 ఎకరాల్లో నువ్వులు, జొన్న 610 ఎకరాలు, మామిడి 250 ఎకరాలు,   కూరగాయలు 50 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు అధికారులు అంచనాకు వచ్చారు.

 కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లు

 కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వడ్లు కూడా పూర్తిగా తడిసిపోయాయి.  చాలా చోట్ల రైతులు 20 రోజుల నుంచి  కొనుగోలు కేంద్రాల్లో వడ్లు ఆరబోస్తున్నారు. నిర్వాహకులు కాంటాలు పెట్టకపోవడంతో పడిగాపులు కాస్తున్నారు. దీంతో కాంటాలకు రెడీగా ఉన్న వడ్లు తడిసి ముద్దయ్యాయి. చాలా చోట్ల వడ్లు వరదలో  కొట్టుకుపోయాయి.  

4 ఎకరాలు వేస్తే .. గిప్పుడేం లేదు.. 

 4 ఎకరాల్లో వరి పంట వేసిన.  ఎకరాకు రూ.20వేల నుంచి రూ.30వేల దాక ఖర్చయ్యింది.  ఈ సారి రోగాలు  బాగా వచ్చినయ్​.  మందులు కొట్టనీకే ఎక్కువ ఖర్చులు  అయినయ్. 120 క్వింటాళ్ల  దిగుబడి వస్తదనుకున్న. రాళ్ల వానకు పూర్తిగా రాలిపోయినయ్. ఏం మిగలలేదు.

- కుర్మ మల్లయ్య,  బోనాల్​, కామారెడ్డి  జిల్లా

 వరి చేను .. ఇక మేతకే

మూడున్నర ఎకరాల్లో వరి వేసిన. వడగండ్లకు  వడ్లు మొత్తం రాలిపోయాయి.  కర్రలే మిగిలాయి. పశువులను మేపేందుకు తప్ప దేనికీ పనికిరాకుండా పోయింది. ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలి

ప్రశాంత్​,  రైతు, కోరాట్​పల్లి, నిజామాబాద్​ జిల్లా

హైరానా వద్దు.. అదుకుంటాం


ఉమ్మడి జిల్లాలో  వడగండ్లకు నష్టపోయిన రైతులు హైరానా పడొద్దు. ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంది. దెబ్బతిన్న పంటలను క్షేత్ర స్థాయిలో  పరిశీలించి  జరిగిన నష్టం గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించాం.     
మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి