యాసంగిలో మక్క వైపు రైతుల మొగ్గు.. పెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువ

యాసంగిలో మక్క వైపు రైతుల మొగ్గు.. పెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువ

హైదరాబాద్, వెలుగు: ఈ యాసంగిలో మక్క సాగుకే రైతులు మొగ్గు చూపుతున్నరు. యాసంగిలో సాధారణ సాగు 63.54 లక్షల ఎకరాలు కాగా.. ఈయేడు యాసంగిలో పంటల సాగు 65 లక్షల ఎకరాలకు చేరువైంది. అందులో దాదాపు 7 లక్షల ఎకరాల్లో మక్కలే సాగయ్యాయి. గతంలో నాలుగు నుంచి ఐదున్నర లక్షల ఎకరాలు మించని మక్కలు.. ఈసారి లక్ష ఎకరాలను దాటేస్తోంది. సులువైన సాగు, తక్కువ పెట్టుబడి, కొంత మోతాదు వరకు నీటి వనరులు, అధిక పంట దిగుబడి, సర్కారు నుంచి గిట్టుబాటు ధర వంటి కారణాలతో రైతులు మక్కసాగుపై మక్కువ చూపుతున్నారు. 

ఇతర పంటల సాగులో తెగుళ్లతో తిప్పలు పడడం కన్నా మక్కసాగు చేస్తే మంచి లాభాలు వస్తాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. మొక్కజొన్న పంట సాగుకు కూలీల ఖర్చు తక్కువగా ఉండడంతో పాటు ఆరుతడి పంట కావడంతో లాభాలు పక్కాగా వస్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు. తెగుళ్లతో వాణిజ్య పంటల దిగుబడి తగ్గుతుండడం, ఖర్చులు అధికంగా అవుతుండడం వంటి కారణాల వల్ల చాలా మంది రైతులు మొక్కజొన్న సాగు వైపు మళ్లుతున్నారు. 

పైగా ఈ పంటకు సాగు వ్యయం తక్కువగా ఉండడంతో ఎక్కువ మంది సాగు చేస్తున్నారు. దీనికి తోడు మొక్కజొన్న పంటను కోళ్లఫారాల యజమానులు, బీర్ల ఫ్యాక్టరీల యజమానులు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధరకు మించి వెచ్చిస్తున్నారు. దీంతో పంట ఆశాజనకంగా ఉండడంతో అందరూ మక్కల వైపు మొగ్గు చూపుతున్నరు. 

వరంగల్ రూరల్ టాప్​

యాసంగిలో నీటి లభ్యత అందుబాటులో ఉండడంతో వరితో పోటీపడి మక్కలు సాగుచేస్తున్నరు. వరంగల్​రూరల్‏లో వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్నను అధికంగా సాగు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఒక్క జిల్లాల్లోనే లక్ష ఎకరాలకు పైగా మక్కలు సాగు చేశారు. ఆ తర్వాత నిర్మల్‌లో లక్ష ఎకరాలు, ఖమ్మం జిల్లాలో 85 వేలు, వరంగల్ అర్బన్‌లోనూ 57 వేల ఎకరాల్లో మక్క సాగైంది. 

వ్యవసాయానికి అనుకూలమైన నల్లరేగడి, ఎర్రనేలలు ఉండడం ఈ ప్రాంత ప్రత్యేకత. మెరుగైన భూములు ఉండడంతో ఇక్కడ ఎకరాకు 45 నుంచి 52 క్వింటాళ్ల పంట దిగుబడి వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. గతంలో ఇదే జిల్లాలో టైమ్‌కు 76 లక్షల ఎకరాలు ఉంటే ఇప్పటికే ఇక్కడ లక్ష ఎకరాలు దాటింది. 

నాలుగు జిల్లాల్లో 4 లక్షలు దాటిన సాగు..

నిజామాబాద్ జిల్లాలో 5.02 లక్షల ఎకరాల్లో యాసంగి పంటలు సాగై ఇప్పటి వరకు టాప్‌లో నిలిచింది. సూర్యాపేటలో 4.60 లక్షల ఎకరాలు, నల్గొండలో 4.98 లక్షలు, కామారెడ్డిలో 4.02 లక్షల ఎకరాల్లో యాసంగి పంటలు సాగయ్యాయి. ఈ నాలుగు జిల్లాల్లోనే అన్ని జిల్లాల కన్నా రెట్టింపు స్థాయిలో యాసంగి పంటలు సాగయ్యాయి. 

యాసంగి పంటల్లో వరి 50 లక్షలు చేరువకాగా, మక్కలు 7 లక్షల ఎకరాలకు చేరువ అయింది. పల్లీలు 2.32 లక్షలు, పప్పుసెనగలు 2.38 లక్షల ఎకరాలు దాటాయి. జొన్న 1.80 లక్షల ఎకరాలు సాగు జరిగిందని వ్యవసాయ శాఖ గణాంకాలు తెలిపాయి. కాగా.. ములుగు, మేడ్చల్​జిల్లాలో సాగు కనీసం పదివేల ఎకరాలు కూడా దాటలేదు.