- ఓ వైపు కోతులు, మరో వైపు మార్కెట్ సమస్యతో ఇబ్బందులు
- యాదాద్రి జిల్లా వ్యాప్తంగా 861 ఎకరాల్లో సాగైన పప్పు దినుసులు
- రికార్డ్ స్థాయిలో వరి సాగు
యాదాద్రి, వెలుగు : సాగు సమయంలో కోతుల బెడద, పంట చేతికొచ్చాక మార్కెట్ సమస్య ఏర్పడుతుండడంతో రైతులు వరి తప్ప మిగతా పంటల సాగు వైపు మొగ్గు చూపడం లేదు. వరి తగ్గించి వాణిజ్య పంటల సాగు పెంచాలని ప్రభుత్వం చెబుతున్నా పెద్దగా పట్టించుకోవడం లేదు. యాదాద్రి జిల్లాలో ఏటేటా వరి సాగు పెరుగుతుంటే పప్పు దినుసులు, మిగతా పంటల విస్తీర్ణం మాత్రం భారీగా తగ్గిపోతోంది. ఈ యాసంగి సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా వరి రికార్డు స్థాయిలో సాగైంది. గత సీజన్‌తో పోలిస్తే ప్రస్తుతం లక్ష ఎకరాల్లో వరి సాగు పెరగడం గమనార్హం.
తగ్గిపోతున్న పప్పు దినుసుల సాగు
యాసంగి సీజన్‌లో పల్లి, మొక్కజొన్న, జొన్న, పెసర్లు, ఉలవలు సాగు చేసుకునే అవకాశం ఉంది. అయితే యాదాద్రి జిల్లాలో జనాభాకు సమానంగా కోతుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో అటవీ విస్తీర్ణం తక్కువగా ఉండడంతో కోతులు పొలాలపై పడుతున్నాయి. పప్పు దినుసులకు సంబంధించిన పంటలు కనిపిస్తే చాలు పీకి పారేస్తున్నాయి. ఎలాగోలా వాటి బారి నుంచి రక్షించుకున్నా, చేతికొచ్చిన పంటను అమ్ముకోవడం రైతులకు ఇబ్బందిగా మారింది. పంట తీసుకొని మార్కెట్‌కు వెళ్తే వ్యాపారులు సిండికేట్‌గా మారి ధర తగ్గించేస్తున్నారు. ఈ ఇబ్బందులన్నీ పడలేక రైతులు ఏకంగా పప్పు దినుసుల సాగునే తగ్గించుకుంటున్నారు. గత యాసంగి సీజన్‌లో జిల్లాలో 30 వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగైతే ఇందులో 8 వేల ఎకరాల్లో పప్పు దినుసులే సాగయ్యాయి. కానీ యాసంగి సీజన్‌లో 20 వేల ఎకరాల్లో అన్ని పంటలు సాగైతే ఇందులో పప్పు దినుసులు సాగైంది కేవలం 861 ఎకరాల్లోనే.
వరి సాగులో రికార్డ్ బ్రేక్
యాదాద్రి జిల్లాలో 6 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా అన్ని పంటలు, తోటలు కలుపుకొని 4.50 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతోంది. గతంలో అన్ని రకాలు పంటలు సాగు చేసిన జిల్లా రైతులు ప్రస్తుతం వరివైపే చూస్తున్నారు. కొనుగోలు సమయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా సాగు విషయంలో మాత్రం ఎలాంటి సమస్య లేకపోవడంతో సీజన్ల వారీగా వరి సాగును పెంచుతున్నారు. ఈ సీజన్‌లో యాదాద్రి జిల్లా వ్యాప్తంగా 2.74 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. భువనగిరి డివిజన్‌గా ఉన్నప్పుడు గానీ, జిల్లాగా మారిన తర్వాత గానీ ఈ స్థాయిలో వరి సాగు ఎప్పుడూ జరగలేదని ఆఫీసర్లు చెబుతున్నారు. గత యాసంగితో పోలిస్తే ప్రస్తుతం1.8 లక్షల ఎకరాల్లో వరి సాగు పెరిగింది.
యాదాద్రి జిల్లాలో యాసంగిలో సాగైన పప్పు దినుసులు (ఎకరాల్లో)
పంట 2021-22 2022-23
జొన్నలు 210 06
కందులు 106 20
పల్లి 1,861 68
శనగలు 145 27
ఉలవలు 4922 09
పెసర్లు 424 01