మన్యంలో రైతులు మిర్చి సాగుకే మొగ్గు!

మన్యంలో రైతులు మిర్చి సాగుకే మొగ్గు!
  • ఆటుపోట్లు ఎదురైనా రైతులకు కనిపించని ప్రత్యామ్నాయం
  • భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 32,168 ఎకరాల్లో మిర్చి సాగు
  • 32 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని ఆఫీసర్ల అంచనా 

భద్రాచలం, వెలుగు : రెండేళ్లుగా ఆటుపోట్లు ఎదుర్కొంటున్నా ఈసారి  కూడా మన్యంలో రైతులు మిర్చి సాగుకే మొగ్గు చూపుతున్నారు. మిర్చికి ప్రత్యామ్నాయ పంట రైతులకు కన్పించకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దానికి తోడు గోదావరి పరివాహక ప్రాంతంలోని నల్లరేగడి నేలల్లో పండించే మిర్చికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 32,168 ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేస్తుండగా, 32 క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఉంటుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. గోదావరి వరదల తర్వాత మిరప నారుమళ్ల సాగుకు రైతులు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

రెండేళ్లుగా తీరని వ్యథ!

వాతావరణ మార్పులు, నేలలో విపరీతమైన ఉష్ణోగ్రతలు ఇతర కారణాలతో మిర్చి పంటను తెగుళ్లు సోకాయి. నల్లి తామర పురుగులు దాడి చేయడంతో మిరప మొక్కలు నిలువునా ఎండిపోయాయి. వందల ఎకరాల్లో పాడైంది. రైతులు నష్టపోయారు. క్వింటా మిర్చి ధర రూ.27వేలకు పైగా పలికింది. ఇప్పటికీ ధర బాగానే ఉంది. 2022, 2023 సంవత్సరాలు వరుసగా ఇవే కష్టాలు రైతులను కుదేలు చేశాయి. అప్పుల పాలు అయ్యారు. అయినా మళ్లీ మిరప సాగుకే ఎక్కువ ఇంట్రెస్ట్​ 
చూపుతున్నారు. 

కౌలుకు తీసుకుని పంట సాగు.. 

భద్రాచలం గోదావరి పరివాహక ప్రాంతంలోని వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో మిర్చి సాగు ఎక్కువగా ఉంది. స్థానిక రైతులు భూమిని కౌలుకు తీసుకొని మరి మిర్చి సాగు చేస్తున్నారు. చర్లలో ఎకరం కౌలు రూ.లక్ష ఉంటుంది. వాజేడు, వెంకటాపురం, దుమ్ముగూడెం మండలాల్లో రూ.35వేల నుంచి రూ.50వేల వరకు కౌలు ధర పలుకుతోంది. అయినా రైతులు కౌలుకు పోటీ పడుతూనే ఉన్నారు. నష్టాలు వచ్చినా మిర్చి సాగుకు రైతులు వెనుకంజ వేయడం లేదని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఇల్లెందు, అశ్వారావుపేట, పినపాక నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. కౌలుకు తీసుకుని దుక్కులు దున్ని పంట సాగుకు సిద్ధం 
చేస్తున్నారు. 

విత్తనాలకు ఫుల్​గిరాకీ

మిర్చి విత్తనాలకు గిరాకీ పెరిగింది. పలు విత్తన కంపెనీలు మన్యంలో అమ్మకాలు కొనసాగిస్తున్నాయి. ఆరు గ్రాముల విత్తన ప్యాకెట్ రూ.750 నుంచి రూ.800కు కొనుగోలు చేస్తున్నారు. మరి కొందరైతే ఆరు గ్రాముల విత్తనాలు రూ.1250 ధర పెట్టి కూడా కొంటున్నారు. 32,168 ఎకరాల్లో సాగుకు సరిపడా నారును రైతులు సిద్ధం చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. మిర్చి సాగు తగ్గితే పత్తి సాగు పెరగాలి. కానీ పత్తి ఏ మాత్రం పెరగలేదు. ఎప్పటిలాగే 2.16లక్షల ఎకరాల్లో సాగు అవుతోంది. 

ఆసక్తి తగ్గట్లేదు 

రైతుల్లో ఏ మాత్రం మిర్చి సాగుపై ఆసక్తి తగ్గలేదు.  గోదావరి తీరం ప్రాంతంలో విత్తనాలకు డిమాండ్ పెరిగింది. తెగుళ్లు వచ్చినా దిగుబడులు తగ్గకపోవడం, రెండేళ్లుగా మిర్చి ధర గిట్టుబాటు కావడంతో రైతులు సాగుకు మొగ్గు చూపుతున్నారు.

చిట్టెం శ్రీను, విత్తన కంపెనీ ప్రతినిధి 

జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాలు.. 

గోదావరి తీరం తప్ప మిగతా చోట్ల రైతులు నారు మళ్లు పోస్తున్నారు. వరదలు వచ్చి పోయాక తీర ప్రాంతంలోని రైతులు నారు మళ్లు పోస్తారు. నారుమడుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాలు పొందొచ్చు. 

అనిల్​ కుమార్, ఏవో, భద్రాచలం