
మిల్లర్లు చెప్పిందే మాట.. ఇచ్చిందే రేటు..
తాలు, తరుగు పేరిట భారీ దోపిడీ
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : రైస్ మిల్లర్ల పెత్తనం వల్ల రైతన్నలు కోట్లల్లో నష్టపోతున్నారు. ప్రతీ యేడు లాగే ఈ సారి కూడా వానాకాలం సీజన్‌లో తాలు, తేమ పేరిట రైస్ మిల్లర్లు వడ్ల బస్తాలను దింపుకోవట్లేదు. బస్తాకు 3 కిలోల నుంచి 5 కిలోల వరకు తరుగు తీస్తేనే దింపుకుంటామంటూ పేచీ పెడుతున్నారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్ద 40 కిలోల బస్తాపై 2 కిలోల తరుగు తీస్తుండగా, మళ్లీ మిల్లర్లు తీసే తరుగుతో క్వింటాల్‌కు 8 కిలోల వరకు పోతోంది. దీంతో రైతులకు ఎకరంపై రూ.10 వేల వరకు నష్టం వస్తోంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రూ.500 కోట్ల వరకు దోపిడీ జరుగుతోంది. మిల్లర్లు దింపుకోకపోవడంతో మిల్లుల వద్ద వడ్ల బస్తాల లోడుతో ఉన్న లారీలు, డీసీఎం వ్యాన్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఒక్క రోజులోనే బస్తాలు దిగుమతి చేసుకోవాల్సిన చోట రెండు, మూడు రోజుల వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. దీంతో వెహికిల్ ట్రాన్స్‌పోర్ట్ ఛార్జీల భారం కూడా రైతులపైనే పడుతోంది. ఈ వ్యవహారాన్ని అరికట్టాల్సిన ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్చార్జి మంత్రులు, కలెక్టర్లు, ఇతర అధికార యంత్రాంగం దృష్టి పెట్టకపోవడంతో మిల్లర్లు అడింది ఆట.. పాడింది పాటగా మారింది.
పాత పద్ధతిలో రైతులకే మేలు!
పాత పద్ధతిలో రైతులు పండించిన వడ్లు కొనడానికి వచ్చే ప్రైవేట్ వ్యాపారి వడ్లు చూసి రేట్ చెప్పి కొనేవాడు. బారదాన్లు ఇచ్చి వడ్లు కాంటా వేసుకొని తీసుకొని పోయేవాడు. తనకు ఇష్టమున్న రైస్ మిల్లు వద్ద ఈ వడ్లు అమ్ముకొని డబ్బులిచ్చేవాడు. వడ్లు కొన్న వెంటనే రైతుకు డబ్బులిస్తే 100కు రూ.3 చొప్పున కట్ చేసేవాడు. 15 రోజులు ఆగాక డబ్బులు తీసుకుంటే కమీషన్ తీసుకోకుండా మొత్తం ఇచ్చేవాడు. కాంటా అయ్యాక రైతుకు వడ్లకు ఎలాంటి సంబంధం ఉండేది కాదు. వర్షాలతో వడ్లు తడిసినా..కొట్టుకుపోయినా కొన్నవారిదే బాధ్యత ఉండేది.
మిల్లర్లకు లాభం
ఇప్పుడు ప్రభుత్వ వడ్ల కొనుగోలు కేంద్రంలో వడ్లు అమ్మాలంటే సవాలక్ష నిబంధనలు పెడుతున్నారు. అవన్నీ కూడా రైస్ మిల్లర్లకే లాభం చేకూరుస్తున్నాయి. 17 శాతం లోపు తేమ ఉంటేనే వడ్లు కొనడానికి నిర్వాహకులు ఒప్పుకుంటారు. 3 శాతం మట్టి పెల్లలు, 3 శాతం తాలు మాత్రమే అనుమతిస్తారు. ఇవన్నీ పరిశీలించి బారదాన్లు ఇచ్చి కాంటాలు వేసుకున్నాక కూడా లారీల్లోకి వడ్లు నింపే వరకు రైతుదే బాధ్యత. కాంటా అయ్యాక వానలు పడితే వడ్లు తడవకుండా రైతే కాపలా ఉండాలి. లారీలు రాకపోతే వారం, పది రోజులు అక్కడే బస్తాల వద్ద కాపలా కాయాలి. తర్వాత లారీలో వడ్ల బస్తాలు లోడ్ చేసి మిల్లుకు పంపాక మిల్లర్ అభ్యంతరం చెప్తే లారీ అక్కడే ఆగిపోతుంది. దీంతో రైతులే మిల్లర్‌ను బతిమలాడి బస్తాకు 3 నుంచి 5 కిలోల తరుగు తీయడానికి అంగీకరించాల్సి వస్తోంది. నిబంధనల ప్రకారం..అన్నీ నాణ్యతా ప్రమాణాలు చూసే కేంద్రాల్లో వడ్లు కొంటారు. తీరా మిల్లుకు పంపాక నాణ్యత లేదని అనడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు.
ఆఫీసర్లు ఏం చేస్తున్నట్లు!
వడ్ల కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారాలన్నీ జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతాయి. రెండు నెలల సీజన్ మొత్తం జేసీలు వడ్ల కొనుగోళ్లపైనే దృష్టి పెట్టాలి. ఐదు ప్రభుత్వ శాఖల ఆఫీసర్లను సమన్వయం చేస్తూ రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలి. మిల్లర్లు వడ్లు దింపుకోకుండా రోజుల తరబడి వెహికిల్స్ ఆపేస్తున్నా.. వెయిటింగ్ పేరిట ట్రాన్స్‌పోర్ట్ చార్జీలను రైతులపై రుద్దుతున్నా , తేమ, తాలు పేరిట బస్తాకు 5 కిలోల తరుగు తీస్తున్నా జేసీలు పట్టించుకున్న దాఖలాలు లేవు. డీఆర్‌డీఓ, జిల్లా వ్యవసాయ శాఖాధికారి, డీసీఓ, సివిల్ సప్లయ్ ఆఫీసర్లు, సివిల్ సప్లయ్ డీఎంలు, తహసీల్దార్లు, ఏఈఓలు ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తున్నా రైతులకు న్యాయం జరగడం లేదు. మిల్లుకు వడ్ల బస్తాలు వెళ్లిన తర్వాత మిల్లర్ తేమ, తాలు శాతం చూపిస్తూ వడ్లను దింపుకోకుండా వెహికిల్స్ ఆపితే వాళ్లపై ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు.
కామన్ రకం వడ్లు కొంటలేరు..మిల్లర్లు దించుకుంటలేరు!
నెల కింద సుల్తానాబాద్ మండలం మియాపూర్ వడ్ల కొనుగోలు కేంద్రానికి 1001 కామన్ రకం వడ్లను తీసుకువచ్చాను. బి గ్రేడ్ రకం వడ్లను మిల్లర్లు దించుకోకపోవడం వల్ల కొనుగోలు కేంద్రం నిర్వాహకులు నా వడ్లను కొనుడు బందు చేశారు. నాలాగే ఎంతోమంది రైతులు సెంటర్లలో వడ్లు పోసి నిరీక్షిస్తున్నారు. నాలుగెకరాల్లో పంట వేయగా 160 బస్తాల వడ్లు వచ్చాయి. అమ్మడానికి వస్తే మిల్లర్లు సహకరించకపోవడం వల్ల నాకు వెయిటింగ్ తప్పడం లేదు. నెల రోజులుగా పొద్దటి నుంచి సాయంత్రం దాకా ఉండి పోతున్నా. ప్రతిరోజు ఇదే పని. నూక వస్తుంది అనే సాకుతో మిల్లర్లు వడ్లు దించుకోవడంలేదని సెంటర్ నిర్వాహకులు చెప్తున్నారు.
‒మేకల చంద్రమౌళి, పెరకపల్లి
రూ 30 వేలు కట్ చేసిండ్లు
మాది జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం రాంభద్రునిపల్లి. గతంలో వరి సాగు చేసి 420 బస్తాల పంట పండించా. పెగడపల్లి ఐకేపీ కొనుగోలు సెంటర్ కు తీసుకువెళ్తే నిర్వాహకులు 41 కిలోల చొప్పున ఒక్కో బస్తా తూకం వేసి ధాన్యాన్ని మిల్లుకు తరలించి దింపుకున్నారు. 168 క్వింటాళ్లకు సుమారు 3.46 లక్షలు రావాల్సి ఉండగా పది రోజుల తర్వాత నా బ్యాంక్ అకౌంట్ లో రూ.30 వేలు కట్ చేసి వేశారు. ఎలాంటి సమాచారం లేకుండా మిల్లర్లు కోత విధించారు.
‒గుర్రం మల్లయ్య, రాంభద్రునిపల్లి రైతు, జగిత్యాల జిల్లా