నాసిరకం విత్తనాలు అమ్మే కంపెనీలపై చర్యలేవీ?

నాసిరకం విత్తనాలు అమ్మే కంపెనీలపై చర్యలేవీ?
  •     ఇరిగేషన్​ అధికారులను సమావేశాలకు ఎందుకు పిలవట్లే..
  •     జడ్పీ స్టాండింగ్​ కమిటీ మీటింగ్​ల్లో సభ్యుల ఆగ్రహం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు  : నాసిరకం విత్తనాలతో ప్రతీ ఏడాది రైతులు నష్టపోతున్నారు..  నాసిరకం విత్తనాలు అమ్మే కంపెనీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ స్టాండింగ్​ కమిటీ సభ్యులు ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగూడెంలోని జిల్లా పరిషత్​ఆఫీస్​లో ఆర్థిక ప్రణాళిక, గ్రామీణ, అగ్రికల్చర్​, ఎడ్యుకేషన్, హెల్త్​, మహిళా సంక్షేమం, డెవలప్​మెంట్​ వర్క్స్​ కు సంబంధించి స్టాండింగ్​ కమిటీ సమావేశాలు జడ్పీ చైర్మన్​ కంచర్ల చంద్రశేఖర్​ అధ్యక్షతన గురువారం జరిగాయి. 

తూతూ మంత్రంగా.. 

వేర్వేరుగా నిర్వహించాల్సిన స్టాండింగ్​ కమిటీ మీటింగ్​లను స్టాండింగ్​ కమిటీ సభ్యులు పూర్తి స్థాయిలో రాకపోవడంతో జాయింట్​గా నిర్వహించారు. ప్రాధాన్యత కలిగిన జడ్పీ స్టాండింగ్​ కమిటీ సమావేశాలు తూతూ మంత్రంగా సాగుతున్నాయని పలువురు సభ్యులు వాపోయారు.  ప్రతీ ఏడాది రైతులు నాసిరకం విత్తనాలు, నారుతో నష్టపోతున్నారంటూ జడ్పీటీసీ వెంకటరెడ్డి వాపోయారు. నాసిరకం విత్తనాలు, నారుతో రైతులు నష్టపోతుంటే కంపెనీలు, డీలర్ల ప్రతినిధులతో చర్చలు జరిపి రాజీ చేస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదన్నారు.

నర్సరీలపై పక్కాగా నిఘా పెట్టాలని కోరారు. లారీలు రాక రైతులు ధాన్యాన్ని రోడ్లపైనే ఉంచుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బందులు పెట్టవద్దని జడ్పీ చైర్మన్​ కంచర్ల ఆఫీసర్లకు సూచించారు. హరితహారం, పల్లె, పట్టణ ప్రకృతి వనాల పేర రూ. వందల కోట్లను గత ప్రభుత్వం ఖర్చు పెట్టిందని పలువురు సభ్యులు చెప్పారు. రు. పండ్ల మొక్కలు పెంచకపోవడంతో కోతులు ఇండ్లలోకి రావడం, పంటలను పాడు చేయడం చేస్తున్నాయని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఎప్పటి నుంచి సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలను ఇవ్వకుండా పెండింగ్​లో పెట్టిన అధికారులు ఇప్పుడేమో ట్రెంచ్​లు కొడుతున్నారంటూ జడ్పీటీసీ మేరెడ్డి వసంత ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్​లో ఉన్న పోడు భూములకు పట్టాలిచ్చేలాచర్యలు తీసుకోవాలన్నారు. ఏజెన్సీలో ఇండ్లు నిర్మించుకుంటున్న వారికి ఇంటి నంబర్లు ఇవ్వాలని కోరారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి పలు శాఖల అధికారులతో పాటు కలెక్టర్​కు ఇప్పటికే కోర్టుల నుంచి నోటీస్​లు వస్తున్నాయని, ఇప్పటి వరకు దాదాపు 68 కేసులు నడుస్తున్నాయని జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి పేర్కొన్నారు.

జిల్లాలోని పలు గ్రామాల్లో వైరల్​ ఫీవర్స్​, ఒళ్లు నొప్పులతో ప్రజలు బాధపడుతున్నారని గుర్తించి స్పెషల్​గా హెల్త్​ క్యాంప్​లు పెట్టామని డీఎంహెచ్​వో డాక్టర్​ శిరీష తెలిపారు. అత్యంత ప్రాధాన్యమైన ఇరిగేషన్​ అధికారులను సమావేశాలకు ఎందుకు పిలువడం లేదని జడ్పీ ఆఫీసర్లపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా గవర్నమెంట్​జనరల్​ హాస్పిటల్, ఆర్టీసీతో పలు శాఖల అధికారులు రాకపోవడంపై సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో ప్రసూనా రాణి, జడ్పీటీసీలు పైడి వెంకటేశ్వరరావు, బి.వాసుదేవరావు, రామక్క, కె. హనుమంతరావు, కళావతి పాల్గొన్నారు.