రైతులు పొలాలకు పోలేకపోతున్నరు.. రోడ్లెయ్యండి

జిల్లాలో ఇలాంటి సమస్య కనిపించొద్దు

డిసెంబర్​లోగా కంప్లీట్​కావాలి: కలెక్టర్​ ఎంవీ రెడ్డి

వెంకటయ్యతండాలో రోడ్డు లేక 2 కిలోమీటర్లు నడక

నీళ్ల సమస్య పట్టించుకోని సర్పంచ్, సెక్రటరీకి షోకాజ్ 

టేకులపల్లి, వెలుగు: ‘జిల్లాలో పొలాలకు వెళ్లడానికి రోడ్లు లేకుండా ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదు. వెంటనే జిల్లాలో పొలాలకు రోడ్లు లేని ప్రాంతాలను గుర్తించండి. డిసెంబర్​లోగా అన్ని ఏరియాల్లో రహదారుల నిర్మాణం పూర్తి కావాలి’ అని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్​ ఎంవీ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఇల్లందు, టేకులపల్లి మండలాల్లో పర్యటించిన కలెక్టర్​ ముందుగా టేకులపల్లి మండలం వెంకటయ్యతండాలో పొలాలను విజిట్​ చేశారు.  వెహికల్ ​వెళ్లే దారి లేకపోవడంతో ఆయన సుమారు రెండు కిలోమీటర్లు నడిచి పత్తి, వరి మొక్కజొన్న పంటలను పరిశీలించారు. మెయిన్ రోడ్డు నుంచి వెంకటయ్య తండా వరకు రోడ్డంతా రాళ్లు రప్పలు ఉండడంతో రైతులు పొలాలకు వెళ్లడానికి కష్టాలు పడుతున్నారని గుర్తించారు. వెంటనే ఉపాధిహామీ పథకం కింద రోడ్డెయ్యాలని అధికారులను ఆదేశించారు.  జిల్లాలో ఇలాంటి సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి డిసెంబర్ లోగా రోడ్డు వేయాలన్నారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు. నకిలీ విత్తనాల వల్ల తాము మోసపోయామని, దిగుబడి సరిగా రాలేదని రైతులు చెప్పగా విచారణ జరిపి తనకు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాలమ్మిన వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.  పంట అమ్ముకునేందుకు రైతులకు టోకెన్లు ఇష్యూ చేయాలని వ్యవసాయాధికారులకు ఆర్డర్ ​వేశారు. అన్నదాతలు పంటలను దళారులకు అమ్ముకోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు వెళితేనే మద్దతు ధర వస్తుందన్నారు. గ్రామంలో మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని,  నీళ్ల కోసం ప్రతి ఇంటి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేయగా సర్పంచ్, సెక్రటరీకి షోకాజ్ నోటీసులిచ్చి తనకు నివేదిక ఇవ్వాలని డీపీఓకి సూచించారు. ఇల్లెందు మండలం సుదిమళ్ళ పంచాయతీలో పల్లె ప్రకృతి వనాన్ని, బొజ్జాయిగూడెంలో రైతు వేదికలను పరిశీలించారు. డీపీఓ రమాకాంత్, డీఆర్డీఏ పీడీ మధుసూదన్ రాజు, ఉద్యాన అధికారి మరియన్న, ఎంపీడీఓ విజయ, తహసీల్దార్ శ్రీనివాస రావు పాల్గొన్నారు.

For More News..

మాకిచ్చే పైసలు కాజేస్తున్నరు