ఇన్సెంటివ్​ కోసం వెయిటింగ్ ..  ఆరేండ్లుగా పట్టు రైతుల ఎదురుచూపులు

ఇన్సెంటివ్​ కోసం వెయిటింగ్ ..  ఆరేండ్లుగా పట్టు రైతుల ఎదురుచూపులు
  •  వెంటనే చెల్లించాలని ప్రభుత్వానికి వేడుకోలు

సిద్దిపేట, వెలుగు: పట్టు రైతులను ఎంకరేజ్​ చేసేందుకు ప్రకటించిన ఇన్సెంటివ్‌లు రైతులకు అందడం లేదు. ఆరు సంవత్సరాలుగా పెండింగ్​లోనే ఉన్నాయి. ప్రభుత్వం కిలో పట్టుకు రూ. 75 చొప్పున  ఇన్సెంటివ్ ప్రకటించింది. ప్రతి రైతు మార్కెట్లో అమ్మిన పట్టు గూళ్ల కు అదనంగా ఇన్సెంటివ్​ డబ్బులు ఇవ్వాలని ప్రకటించినా 2018 నుంచి ఇవి సిద్దిపేట జిల్లా రైతులకు అందడం లేదు. జిల్లాలో దాదాపు  300 మంది రైతులు 500 ఎకరాల్లో పట్టు సాగు చేస్తున్నారు. చిన్నకోడూరు, బెజ్జంకి, కొండపాక, తొగుట, సిద్దిపేట, కొమురవెల్లి మండలాల్లో రైతులు  పట్టు సాగు చేస్తున్నారు. స్థానికంగా పట్టు గూళ్లకు మార్కెట్ లేకపోవడంతో జనగామ, సికింద్రాబాద్​లోని తిరుమలగిరి మార్కెట్లకు తీసుకెళ్లి అమ్ముతుంటారు. 

రూ. 2 కోట్లకు పైగా పెండింగ్

జిల్లా పట్టు రైతులకు సంబంధించి రెండు కోట్లకు పైగా చిలుకు డబ్బులు పెండింగ్ లో ఉన్నాయి. ఆరేండ్లుగా రైతులకు ఇన్సెంటివ్ లు అందక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో  కష్టనష్టాలకు ఓర్చి పట్టు గూళ్లను సాగు చేస్తున్నా  ఇన్సెంటివ్​డబ్బులు అందక పోవడం నిరాశకు గురిచేస్తోంది. ఇన్సెంటివ్ లు సక్రమంగా అందింతే మరి కొందరు రైతులు పట్టు సాగు పై ఆసక్తి చూపే అవకాశం ఉన్నా ప్రభుత్వం దీనిపై శ్రద్ద చూపడంలేదు. ఈ విషయంపై ఎన్నోసార్లు అధికారులకు విన్నవించుకున్నా హామీలకే పరిమితమైందే తప్ప ఎలాంటి ఫలితం రాలేదని రైతులు వాపోతున్నారు.  

నామినేషన్ల దాఖలుకు ప్రయత్నం

ఇన్సెంటివ్ ల  కోసం ఎదురు చూస్తున్న రైతులు అసెంబ్లీ ఎన్నికల్లో  కేసీఆర్ పోటీచేస్తున్న గజ్వేల్​లో నామినేషన్లు దాఖలు చేయడానికి ప్రయత్నించారు. ఏండ్లు గడుస్తున్నా తమకు రావాల్సిన బకాయిలు రాకపోవడంతో సమస్యను ప్రపంచానికి తెలియజేడానికి నామినేషన్లు వేయాలనుకున్నారు. ఇందు కోసం కొండపాక మండలం మర్పడగ గ్రామంలో ప్రత్యేకంగా  సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు వారిని బుజ్జగించి నామినేషన్లు వేయొద్దని కోరారు. ఎన్నికలు పూర్తి కాగానే ఇన్సెంటివ్ లు వచ్చేలా చూస్తామని మాటివ్వడంతో చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు.

జనగామ మార్కెట్​కు అందిన డబ్బులు

పట్టు  రైతులకు సంబంధించి  ఇన్సెంటివ్ డబ్బుల్లో కొంత ట్రెజరీ నుంచి  జనగామ మార్కెట్​కు అందినట్టు తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా రైతులు జనగామ, తిరుమలగిరి మార్కెట్ల లో ఎక్కువగా పట్టుగూళ్లను అమ్ముతుంటారు. వీరికి సంబంధించిన ఇన్సింటివ్ లో రూ. 2.63 కోట్లు పక్షం రోజుల కింద జనగామ మార్కెట్ శాఖకు అందినట్టు తెలుస్తోంది.  ఈడబ్బుల్లోంచి జనగామ మార్కెట్లో అమ్మిన  రైతులకు ఇన్సెంటివ్ లు అందించాల్సి ఉన్నా ఈ ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఇదిలా ఉంటే తిరుమలగిరి మార్కెట్ కు సంబంధించి ఇన్సెంటివ్​డబ్బులు రాకపోవవడంతో అక్కడ అమ్మిన రైతులు తమకు డబ్బులు ఎప్పుడు వస్తాయోనని ఆందోళన చెందుతున్నారు.

దూర ప్రాంతాలకు పట్టు రైతులు

తిరుమలగిరి, జనగామ మార్కెట్లలో ఎదురవుతున్న ఇబ్బందులతో పట్టు రైతులు దూర ప్రాంతాలకు వెళ్లి సరుకు అమ్ముకుంటున్నారు. సిల్క్ కు ధరలేదని, నాణ్యత లోపమని, వ్యాపారులు సిండికేట్ గా మారి  ధరలు తగ్గిస్తుండడంతో పాటు డబ్బుల చెల్లింపు ఆలస్యం చేస్తున్నారు. దీంతో హిందూపూర్, పలమనేరు, ధర్మవరం, కర్నాటక రాష్ట్రంలోని రాంనగర్​కు వెళ్లి రైతులు పంటను అమ్ముకుంటున్నారు. దూర ప్రాంతాల్లో కిలోకు రూ. 600 వరకు ధర పలుకుతుంటే తిరుమల గిరిలో మాత్రం రూ. 450 మించడం లేదు. అంతేకాకుండా సరుకు అమ్మిన డబ్బులు రెండు నెలల వరకు చెల్లించడం లేదు. దీంతో రైతులు ఇతర ప్రాంతాలపై దృష్టి సారించారు. 

ఇన్సెంటివ్ లు త్వరగా అందించాలి

పట్టు రైతులకు అందించాల్సిన ఇన్సెంటివ్​లను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. రైతులు సరుకు అమ్మగానే ఇన్సెంటివ్​లు ఇస్తే ఎంతో  ఉపయోగకరంగా ఉంటుంది. సకాలంలో ఇన్సెంటివ్​లు అందితే మరికొంత మంది రైతులు పట్టు సాగు వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న ఇన్సెంటివ్ లను ప్రభుత్వం వెంటనే రైతులకు  అందించాలి. 

అన్నాడి మంగ, మహిళా రైతు, గాగిల్లాపూర్