వానాకాలం యాక్షన్ ప్లాన్ రెడీ .. ఎరువులు, విత్తనాల ఏర్పాట్లలో అధికారులు

వానాకాలం యాక్షన్ ప్లాన్ రెడీ .. ఎరువులు, విత్తనాల ఏర్పాట్లలో అధికారులు
  • సాగుకు సన్నద్ధం    
  • దుక్కులు సిద్ధం చేసుకుంటున్న రైతులు
  • జనగామ జిల్లాలో 3.70 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం అంచనా

జనగామ, వెలుగు : వానాకాలం పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఈనెల 25 నుంచి రోహిణీ కార్తె మొదలు కానుండగా, ఈసారి వర్షాలు ముందే కురుస్తుండడంతో అన్నదాతలు దుక్కులు సిద్ధం చేసుకుంటున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచేలా అధికారులు యాక్షన్​ప్లాన్​ రెడీ చేశారు.  

3.70 లక్షల ఎకరాల్లో పంటల సాగు..

వానాకాలంలో జనగామ జిల్లాలో 3 లక్షల 70 వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇందులో 2 లక్షల 10 వేల ఎకరాల్లో వరి, లక్షా 45 వేల ఎకరాల్లో పత్తి,  కందులు 10 వేల ఎకరాలు, కూరగాయలు తదితర పంటలు మరో 5 వేల ఎకరాల్లో సాగు కానున్నట్లు నివేదికలు రూపొందించారు. ఈ మేరకు 63 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు, 4 లక్షల 35 వేల పత్తి విత్తన ప్యాకెట్లు, 400ల క్వింటాళ్ల కంది విత్తనాలు అవసరమని ప్రణాళికలు సిద్ధం చేశారు.

 గత వానాకాల సీజన్ లో లక్షా 90 వేల ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా వేయగా, రైతులు 2 లక్షల 10 వేల 664 ఎకరాల్లో సాగు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ సారి వరి సాగు అంచనాను 2.10 లక్షలకు పెంచారు. పత్తి పంట కూడా గత సీజన్​లో లక్షా 70 వేల ఎకరాల్లో సాగును అంచనా వేస్తే, లక్షా 22 వేల 164 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. ప్రస్తుత అంచనాను లక్షా 45 వేలకు తగ్గించారు. కంది పంటను కూడా గత సీజన్​లో 11 వేల ఎకరాల్లో సాగు అని అంచనా వేయగా కేవలం 2,477 ఎకరాల్లో సాగైంది. దీంతో ఈసారి 10 వేల ఎకరాలకు అంచనాను తగ్గించారు. 

74 వేల మెట్రిక్ టన్నులకు ఎరువుల నివేదికలు

జిల్లాలోని పంటల సాగుకు మొత్తంగా 74,251 మెట్రిక్​ టన్నుల ఎరువులు అవసరముంటాయని అగ్రికల్చర్ ఆఫీసర్లు నివేదికలు పంపించారు. ఇందులో 37 వేల మెట్రిక్​ టన్నుల యూరియా, 14,800 మెట్రిక్​ టన్నుల డీఏపీ, 16,366 మెట్రిక్​ టన్నుల కాంప్లెక్స్, 6,085 మెట్రిక్ టన్నుల పొటాషియం అవసరం కానున్నట్లు ప్రణాళికలు రూపొందించి ఉన్నతాధికారులకు పంపించారు.

రసీదులు తప్పనిసరి..

వానాకాలం సీజన్​ లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నం. సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు ప్రణాళికలతో ముందుకెళ్తున్నం. రైతులు లైసెన్స్ ఉన్న ఫర్టిలైజర్ షాపుల్లోనే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయాలి. రైతులు తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలి.

 బీ.వినోద్​ కుమార్, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్