మెదక్, నిజాంపేట, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్ కాల్వలకు భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. సంబంధిత అధికారులు మెరుగైన పరిహారం ఇస్తామని గ్రామ సభలు పెట్టి రైతులకు నచ్చజెప్తున్నా వాళ్లు వినడం లేదు. తమకు ఉన్నదే ఎకరా, అరెకరం భూములని వాటిని కూడా కాల్వల కోసం తీసుకుంటే తామెలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాల్వలతో తమకు ఒరిగేది ఏమీ లేదని, ఇప్పుడు బోర్ల కిందనే పంటలు పండిస్తున్నమని చెబుతున్నారు. తమకు వ్యవసాయం తప్ప మరోపని తెలియదని పరిహారం ఎంతిచ్చినా భూములు మాత్రం ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు.
ప్యాకేజీ 13 కింద..
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ 13 కింద ప్రభుత్వం మల్లన్న సాగర్రిజర్వాయర్ద్వారా మెదక్ జిల్లాలోని చేగుంట, రామాయంపేట, నిజాంపేట మండలాలకు సాగునీరు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు నిజాంపేట మండలంలోని బచ్చురాజ్పల్లిలో 634 ఎకరాలు, నందిగామలో 786 ఎకరాలు, కల్వకుంటలో 84 ఎకరాలు, చల్మెడలో 503 ఎకరాలు, నార్లాపూర్ లో 1,543 ఎకరాలు, నిజాంపేటలో 580 ఎకరాలు కలిపి మొత్తం 4,130 ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు డిస్ట్రిబ్యూషన్ కాల్వల నిర్మాణం చేపట్టేందుకు ప్లాన్ రెడీ చేశారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాల పరిధిలో సర్వే చేసి 30.04 ఎకరాల భూమి సేకరించాలని నిర్ణయించారు. ఏ రైతుభూమి ఎంత పోతుందో గుర్తించి.. రైతుల అంగీకారం కోసం గ్రామ సభలు నిర్వహిస్తున్నారు.
గ్రామ సభల్లో ఇలా..
నిజాంపేటలో 64 మంది రైతులకు సంబంధించి 17.06 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా ఈ నెల 24 న గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో రైతులు కాల్వల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని, అందువల్ల తాము కాల్వల తవ్వకానికి భూములు ఇవ్వమని ఖరాకండిగా తేల్చి చెప్పారు. ఒకవేళ ఆఫీసర్లు జబర్దస్తీగా కాల్వ పనులు చేపడితే అడ్డుకుంటామని హెచ్చరించారు.
నందిగామ గ్రామంలో మంగళవారం తహసీల్దార్ ప్రభాకర్ ఆధ్వర్యంలో కాళేశ్వరం కాల్వల నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో గ్రామ సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులు నిరసన వ్యక్తం చేశారు. రెండు పంటలు పండే భూములను కాల్వల నిర్మాణానికి ఇవ్వమనడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. కాల్వలు లేకున్నా ఇప్పుడు పంటలు పండిస్తున్నామని, ఇక ముందు కూడా ఇలాగే పండించుకుంటామన్నారు. భూముల మధ్యలో నుంచి కాల్వల తవ్వకం చేపట్టొద్దంటూ రైతులు తహసీల్దార్ ప్రభాకర్ కు వినతిపత్రాన్ని అందజేశారు.
ALSO READ:మహారాష్ట్రలోనూ ధరణి తెస్తం.. రైతులకు పెన్షన్ ఇస్తం: కేసీఆర్
ప్యాకేజీ 13లో భాగంగా డిస్ట్రిబ్యూటరీ కెనాల్ తవ్వకానికి మండలంలోని చల్మెడ గ్రామంలో 53.15 ఎకరాలు, నస్కల్ లో 17.37 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంటుందని ఆఫీసర్లు గుర్తించారు. ఈ మేరకు కొన్ని రోజుల కింద సర్వేచేశారు. ఎకరాకు రూ.7 లక్షలు పరిహారం ఇస్తామని చెప్పగా.. అందుకు రైతులు అంగీకరించలేదు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఎకరా రూ.30 లక్షల పైనే ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకుని కనీసం ఎకరాకు రూ.24 లక్షలైనా ఇవ్వాలని కోరుతూ చల్మెడ గ్రామ రైతులు ఏకగ్రీవ తీర్మానం చేశారు.
ఉన్నదే 20 గుంటల భూమి
మాకున్నదే 20 గుంటల భూమి. భూమి గింతే ఉందని నా కొడుకు బతుకుదెరువు కోసం పట్నం పోయుండు. ఇప్పుడు ఆఫీసర్లు వచ్చి ఉన్న 20 గుంటల భూమిల నుంచి 15 గుంటలు కాళేశ్వరం కాలువకు పోతాదని అంటున్రు. అదిపోతే మిగిలిన 5 గుంటల ఏం పంటలేస్తం, ఎట్ల బతుకుతం.
- భూదవ్వ, రైతు, నందిగామ
కాల్వ అవసరం లేదు
మాకు ఎకరా పొలం ఉంది. అందులో నుంచి కాల్వ తవ్వెటందుకు 10 గుంటలు పోతదట. మా ఊర్లె చాలా మంది రైతుల భూములు పోతున్నయి. ఇప్పుడు కాల్వ లేకుంటే పంటలు పండిస్తలేమా..? గట్లనే నడుస్తది. ఆ కాలువ అవసరం లేదు. భూములు ఇచ్చేది లేదు. మా ఊరి రైతులందరం కలసి కాల్వ అవసరం లేదని లెటర్ రాసిచ్చినం.
–బాల్ రాజవ్వ, రైతు, నందిగామ
భూమితోనే బతుకుదెరువు
మా బతుకుదెరువు భూమితోనే ఉన్నది. మా భూములల్లకెంచి కాళేశ్వరం కాలువ తీసుకుని పోతే ఏం లాభం లేదు. మాకు బోరు సౌలత్ ఉంది. దాంతోనే పంటలు పండించుకుంటున్నం. కాల్వ తవ్వినా దానికింద సాగయ్యే పొలాలు తక్కువనే ఉంటయి.
– మల్లవ్వ, రైతు, నందిగామ