భద్రాచలం, వెలుగు: రైతులు ఈసారి మిరప పంట సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకు ఈఏడాది మార్కెట్లో మిర్చికి భారీ ధర పలుకడమే కారణం. ఈ అవకాశాన్నే అదునుగా తీసుకున్న ఆంధ్రాలోని డీలర్లతోపాటు దళారులు తెలంగాణ రాష్ట్రంలోని సరిహద్దులో ఉన్న భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట తదితర జిల్లాల రైతులకు బ్లాక్మార్కెట్లో విత్తనాలను అంటగడుతున్నారు. ‘నాణ్యమైనవి, పంట దిగుబడి ఎక్కువగా వస్తుందని, తెగుళ్లను తట్టుకుంటాయని, కంపెనీ విత్తనాలు దొరకడంలేదు’.. అంటూ రైతులను నమ్మబలికి అమ్ముతున్నారు. పలు కంపెనీలకు చెందిన సేల్స్ ప్రమోటర్లు ఈ ప్రాంతంలో తిరుగుతున్నారు. అక్కడి నుంచే మిరప విత్తనాలను భారీగా తెస్తున్నారు. డీలర్లు, దళారులు విక్రయించే విత్తనాలు కంపెనీవే కాకుండా ఇతర రకాలకు చెందినవి కూడా అంటగడుతున్నారు.
అసలు ఎందుకీ పరిస్థితి..?
రైతుల నుంచి డిమాండ్పెరగడంతో వ్యాపారులు అవకాశంగా మలచుకుంటున్నారు. బ్లాక్ మార్కెట్కు తరలించి డబుల్ రేటుకు అమ్ముతున్నారు. సాధారణంగా కిలో రూ.60వేలు ఉండే విత్తనాలను ఈసారి రూ.1.20 లక్షలకు పెంచేశారు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తొలకరి జల్లులు కురిసిన నేపథ్యంలో రైతులు మిరప విత్తనాలు కొనేందుకు షాపులకు క్యూ కడుతున్నారు. అయితే ఈ పరిస్థితికి అసలు కారణం ఈసారి మార్కెట్లో మిర్చి క్వింటాలుకు భారీ ధర రావడమే కారణం. ఏసీలో ఉంచినవి రూ.25వేలు, నాన్ఏసీలో ఉంచినవి రూ.22వేలు, తాలువి రూ.13వేలు ధర పలికింది. ఇప్పటికీ మార్కెట్లోకి మిర్చి వస్తూనే ఉంది. ఈసారి సీజన్లో రికార్డుస్థాయిలో రూ.60వేలు కూడా క్వింటాలుకు మిర్చి పంట ధర పలికింది. ఈ కారణంగా ఈసారి రైతులు పత్తిని వదిలి మిరప పంట సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. గతేడాది ఖమ్మం జిల్లాలో 70వేల ఎకరాల్లో సాగు చేయగా ఈసారి లక్ష ఎకరాల్లో, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో గతేడాది 26వేల ఎకరాల్లో సాగు కాగా ఈసారి 35వేల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరుగుతుందని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేశారు. ఈ క్రమంలో మిరప విత్తనాలకు డిమాండ్విపరీతంగా పెరిగింది.
యథేచ్ఛగా ఆంధ్రావారి వ్యాపారం...
రైతులు యూఎస్–341 అనే కంపెనీ రకం విత్తనాల కోసం రైతులు ఎగబడుతున్నారు. తెగుళ్లను తట్టుకునే శక్తి ఉన్న ఈ విత్తనాలను కొనేందుకు ఎక్కువ ధరను వెచ్చిస్తున్నారు. అయితే వీటితోపాటు ఇతర రకాల విత్తనాలను కూడా విక్రయిస్తున్నారు. భద్రాచలం మన్యంలోని దుమ్ముగూడెం, చర్లతో పాటు బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, టేకులపల్లి, ఇల్లెందు, అశ్వారావుపేట, దమ్మపేట తదితర మండలాల్లో ఈ దందా ఎక్కువగా సాగుతోంది. అందుకు ఇక్కడి అగ్రికల్చర్ఆఫీసర్లు కొందరు ఆంధ్రా డీలర్లు, దళారులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆంధ్రా డీలర్లు, దళారులు, సేల్స్ ప్రమోటర్లు ఇక్కడి అగ్రికల్చర్ ఆఫీసర్లకు ముడుపులు చెల్లించి తమ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని సమాచారం. గతేడాది ఇదే తరహాలో పలు చోట్ల రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి దిగుబడులు రాక, తెగుళ్లు సోకి నష్టపోయారు. వారు కొనుగోలు చేసింది ఆంధ్రా డీలర్ల నుంచి కావడంతో ఇక్కడి అగ్రికల్చర్ఆఫీసర్లు ఏమీ చేయలేకపోయారు.
నర్సరీలు కూడా పెరుగుతున్నయ్..
మిరప నారుకు డిమాండ్ఉన్న దృష్ట్యా నర్సరీలు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెరుగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే 153 నర్సరీలు ఉండగా, మరో17 ఏర్పాటుకు ఉద్యానశాఖకు అప్లికేషన్లు పెట్టుకున్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో కూడా 23 ఉండగా మరో10 అప్లికేషన్లు వచ్చాయి. ఒకవైపు నర్సరీలు, మరోవైపు రైతులు విత్తనాల కోసం వస్తుండడంతో విత్తన ధరలను ఆయా కంపెనీలు అమాంతం పెంచేశాయి. కాగా డీలర్లు మాత్రం వాటిని బ్లాక్ చేసి అధిక ధరలు వసూలు చేస్తున్నారు.
రైతులను ముంచుతున్నరు...
రైతులను డీలర్లు ముంచుతున్నరు. మాయమాటలు చెప్పి ఎక్కువ ధరకు మిరప విత్తనాలను అంటగడుతున్నరు. తక్షణమే ఆఫీసర్లు అప్రమత్తం కావాలి. లావు విత్తనాలకు డిమాండ్ ఉండడంతో వాటి ధరను అమాంతం పెంచేస్తున్నారు. నిఘాను పెంచాలి. బ్లాక్ మార్కెట్కు విత్తనాలు పోకుండా నియంత్రించాలి.
- యలమంచి వంశీకృష్ణ, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు
కంగారు పడి కొనొద్దు..
విత్తనాల విషయంలో రైతులు కంగారు పడొద్దు. అవసరమైన విత్తనాలను ప్రభుత్వం తరపున అందిస్తాం. ఎక్కడైనా కొంటే మాత్రం బిల్లు కచ్చితంగా తీసుకోండి. ఏడాది చివరి వరకు బిల్లు దగ్గర ఉంచుకోవాలి. విత్తనాలు బ్లాక్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాం.
- అభిమన్యుడు, జేడీఏ, భద్రాద్రికొత్తగూడెం