- ఒక్క ఏడాదిలోనే రూ. 7 వేలు పెరిగిన రేటు
- ఏడాదికి ఎకరానికి రూ.లక్షన్నర గ్యారంటీ ఇన్‌కం
- ఎకరం సాగుకు రూ.50 వేల వరకు సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం
ఖమ్మం, వెలుగు : రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు రైతులకు ఆశాజనకంగా మారింది. ధర పెరగడంతో పాటు ప్రభుత్వం నుంచి సబ్సిడీలు అందుతుండడంతో ఆయిల్‌పామ్ సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. పెట్టుబడి ఎక్కువగా లేకపోవడం, ఒక్కసారి దిగుబడి ప్రారంభమైతే క్రమం తప్పకుండా ఆదాయం వస్తుండడం, కూలీలు, కోతులు, పశువుల సమస్య లేకపోవడంతో రాష్ట్రంలో క్రమంగా ఆయిల్‌పామ్ సాగు
పెరుగుతోంది.
ఏడాదిలోనే రూ. 7 వేలు పెరిగిన ధర
ఒక్క ఏడాదిలోనే ఆయిల్‌పామ్ గెలల ధర టన్నుకు రూ.7 వేల వరకు పెరిగింది. గతేడాది ఇదే సమయంలో టన్ను గెలల ధర రూ.13 వేలు ఉండగా, సోమవారం రూ.20,413కు చేరుకుంది. రెండేళ్ల కింద రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సమయంలో దిగుమతులపై ప్రభావం పడడంతో టన్ను ఆయిల్‌పామ్ గెలల ధర రూ. 23,467కు చేరుకుంది. ఆ తర్వాత రేటు కాస్త తగ్గుతూ వచ్చింది. ఆయిల్ దిగుమతిపై కేంద్రం ఇంపోర్ట్ డ్యూటీ పెంచడం సైతం రైతులకు కలిసి వచ్చింది.
ఎకరానికి లక్షన్నర ఆదాయం
ఆయిల్‌పామ్ సాగు మొదలుపెట్టిన నాలుగేండ్ల తర్వాత దిగుబడి ప్రారంభం అవుతుంది. అప్పటి నుంచి 30 ఏండ్ల పాటు ప్రతి నెలా స్థిరమైన ఆదాయం పొందొచ్చు. ఎకరానికి సగటున 10 టన్నుల వరకు సుమారు రూ. 2 లక్షల విలువైన పంట దిగుబడి వస్తుంది. పెట్టుబడులు, కూలీ ఖర్చులు ఎకరానికి రూ. 50 వేలు పోగా రైతులకు సుమారు లక్షన్నర మిగులుతుంది. పత్తి, మిర్చి, వరి, ఇతర పంటల్లాగా ఆయిల్‌పామ్‌కు చీడపీడల బాధలేదు. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకోవడం ఈ పంట ప్రత్యేకత. రైతులు తమ వీలును బట్టి పనిచేసుకోవచ్చు.
కోతులు, ఇతర పశువులు ఈ గెలలను ముట్టుకోవు. తక్కువ నీళ్లు ఉన్నప్పటికీ డ్రిప్ సాయంతో ఈ పంటను సాగు చేయొచ్చు. దళారుల సమస్య లేకుండా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు పంటను తీసుకొస్తే వారే కాంటా వేసి సరుకు తీసుకుంటారు. రెండు రోజుల్లో ఆన్‌లైన్ ద్వారా రైతుల అకౌంట్లో డబ్బులు డిపాజిట్ అవుతాయి. ఆయిల్‌పామ్‌కు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలను కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తోంది. ఆయిల్‌పామ్ మధ్యలో అంతర పంటలు సాగు చేసుకొని అదనపు ఆదాయం సైతం పొందొచ్చు.
ఎకరానికి రూ. 50 వేల వరకు సబ్సిడీ
ఎకరం భూమిలో ఆయిల్‌పామ్ సాగుకు 60 మొక్కలు అవసరం అవుతాయి. ఒక్కో మొక్క ఖరీదు రూ.250 పడుతుండగా, రైతులకు రూ.20కే అందజేస్తున్నారు. మిగిలిన రూ.230ని సబ్సిడీగా ఇస్తున్నారు. పంట సాగు చేసిన తర్వాత మొదటి నాలుగేండ్ల పాటు ప్రతి సంవత్సరం మెయింటెన్స్ కింద ఎకరానికి రూ.4,200 చొప్పున రూ.16,800 ఇస్తారు. డ్రిప్ సబ్సిడీ కింద రూ.22,00 ఇస్తున్నారు. మొత్తం నాలుగేండ్లలో ప్రభుత్వం నుంచి రూ.52 వేల వరకు ప్రోత్సాహకం అందుతుంది.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కన్నా ఆయిల్‌పామ్ రైతే ధైర్యంగా ఉండొచ్చు : మంత్రి తుమ్మల
ఆయిల్‌పామ్ సాగుతో రైతును రాజుగా మార్చాలన్న లక్ష్యం నెరవేరుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. పంట సాగు చేశాక నాలుగేండ్ల తర్వాత దిగుబడి ప్రారంభమయ్యాక నెల వారీగా ఆదాయం పొందొచ్చన్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీరులకు, ఇతరులకు నెల జీతాలు ఆగుతాయేమో కానీ ఆయిల్‌పామ్ రైతుల ఆదాయం మాత్రం ఆగదన్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ఐఏఎస్, ఐపీఎస్‌లకన్నా రైతులై ధైర్యంగా బతకొచ్చని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఆయిల్‌పామ్ సాగయ్యేలా ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ప్రస్తుతం సీడ్స్‌ను విదేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడి నర్సరీల్లో పెంచి మొక్కలను రైతులకు అందజేస్తున్నామని, భవిష్యత్తులో ఇక్కడే సీడ్స్ తయారు చేసేలా ప్లాన్
ఏడాదికి లక్ష ఎకరాల్లో సాగు పెంచేలా ప్లాన్
రాష్ట్రంలో ప్రస్తుతం 2.30 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగవుతోంది. ప్రతి యేటా లక్ష ఎకరాల్లో సాగును పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది 59,261 ఎకరాల్లో కొత్తగా ఆయిల్‌పామ్ సాగు చేయగా, ఈ ఏడాది ఇప్పటివరకు 26,900 ఎకరాల్లో కొత్తగా ఆయిల్‌పామ్ సాగు చేపట్టారు. రాష్ట్రంలో ఆయిల్‌ఫెడ్‌తో పాటు 14 ప్రైవేట్ కంపెనీలకు సైతం ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఆయా కంపెనీల ద్వారానే నర్సరీలను ఏర్పాటు చేసి రైతులకు మొక్కలను అందజేస్తున్నారు.
ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో అప్పారావుపేట, నారావారిగూడెంలో 120 టన్నుల సామర్థ్యంతో మిల్లులు పనిచేస్తున్నాయి. అక్కడ ఉత్పత్తి అయ్యే ఆయిల్‌పామ్ వ్యర్థాలతోనే కరెంట్‌ను జనరేట్ చేసే కంపెనీని ఏర్పాటుచేశారు. ఆయిల్‌పామ్ గెఢలల నుంచి పామాయిల్‌ను తీయడానికి కంపెనీ ఏర్పాటు చేయాలంటే కనీసం 10 వేల ఎకరాల్లో పంట సాగై రెగ్యులర్‌గా దిగుబడి రావాలని అధికారులు అంటున్నారు. పంట వేసిన నాలుగేండ్ల తర్వాతే దిగుబడి వచ్చే అవకాశం ఉండడంతో ముందుగా రైతులను సాగు వైపు ప్రోత్సహిస్తున్నారు. ఆ తర్వాత ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తున్నారు.
నెలకు రూ.లక్ష ఆదాయం వస్తుంది
నేను ఆరు ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేశాను. రెండేండ్లుగా తగ్గుముఖం పట్టిన ఆయిల్‌పామ్ గెలల ధరలు ఇటీవల పెరగడంతో నాకు ఆదాయం కూడా పెరిగింది. ఇప్పుడు అన్‌సీజన్ కావడంతో రెండు, మూడు వారాలకోసారి గెలలు కోస్తున్నాం. ఎకరానికి టన్ను చొప్పున సుమారు 6 టన్నుల దిగుబడి వస్తోంది. దీని వల్ల నెలకు రూ. 1.20 లక్షలు వస్తున్నాయి. రూ.20 వేల వరకు ఖర్చులు పోగా రూ. లక్ష వరకు మిగులుతోంది.
మలిశెట్టి వెంకటేశ్వర రావు, పాకలగూడెం, సత్తుపల్లి మండలం