- వేరుశనగ కొనుగోళ్లలో దగా చేస్తున్న వ్యాపారులు
నాగర్ కర్నూల్/అచ్చంపేట, వెలుగు: ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కోసం వేరుశనగ పండించిన రైతులు తండ్లాడుతున్నారు. పంట తక్కువగా వచ్చిన రోజు రేటు పెడుతున్న వ్యాపారులు, ఎక్కువగా వచ్చిన రోజు మాత్రం రైతులను నిండా ముంచుతున్నారు. దీంతో వ్యాపారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 15 రోజులుగా రైతులు మార్కెట్లకు వేరుశనగను తెస్తున్నారు. తాలు, తేమ, పల్లీ పలుకు గ్రాములను లెక్కేసి కనీస మద్దతు ధర కంటే రూ.1000 వరకు తగ్గిస్తుండడంతో రైతుల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంటకు టెండర్ పిలుస్తున్న మార్కెట్ సిబ్బంది కమీషన్ ఏజెంట్లు నిర్ణయించిన ధరనే ఫైనల్ చేస్తున్నారు. ట్రేడర్లు, బయటి నుంచి కొనుగోలుదారులు వస్తే ధర కొంత పెరుగుతోంది. ఈ ఆదివారం అచ్చంపేట, కల్వకుర్తి మార్కెట్లలో ఆందోళన చోటు చేసుకోగా, సద్దుమణిగేందుకు రెండు రోజులు పట్టింది. మంగళవారం నాగర్ కర్నూల్ మార్కెట్లో పల్లీలకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదని రైతులు ఆందోళనకు దిగి 4 గంటల పాటు నిరసన తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకొని క్వింటాల్‌కు రూ.100 పెంచిన తర్వాత వివాదం సద్దుమణిగింది.
మార్కెట్ కమిటీలకు పాలకమండళ్లు లేకపోవడం, వ్యాపారుల దోపిడీని అరికట్టడంలో ఆఫీసర్లు విఫలం కావడం రైతులకు శాపంగా మారుతోందని అంటున్నారు. బయటి మార్కెట్లో రేట్లకు అనుగుణంగా జిల్లాలో వేరుశనగకు మద్దతు ధర చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలాఉంటే మార్కెట్ యార్డుల్లో రైతులకు కనీస సౌలతులు ఉండడం లేదు. ఆరబోసిన పంట కుప్పల దగ్గర పందులు, పశువులు రాకుండా కాపాలా ఉండాల్సి వస్తోంది. రైతు విశ్రాంతి గృహాలను కట్టినా అవి సిబ్బంది, దళారుల దావత్‌లకు తప్ప ఎందుకు పనికిరాకుండా పోయాయి.
10 రోజుల్లో మూడోసారి..
వేరుశనగ ధర పెంచాలంటూ రైతులు బుధవారం మరోసారి ఆందోళనకు దిగారు. అచ్చంపేటలో10 రోజుల్లో రైతులు ఆందోళనకు దిగడం ఇది మూడోసారి కావడం గమనార్హం. బుధవారం అచ్చంపేట మార్కెట్‌కు వేరుశనగ తీసుకొచ్చిన రైతులు మద్దతు ధర ఇవ్వడం లేదని ఆరోపిస్తూ మానికలు, డబ్బాలు పగలగొట్టారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ చేపట్టి ఆందోళన చేశారు.
మార్కెట్ ఆఫీస్ ఎదుట బైఠాయించారు. మార్కెట్‌కు 40,596 బస్తాల వేరుశనగ రాగా, రూ.7,029 గరిష్ట ధర పలకగా, రూ.5,015 కనిష్ట ధర చెల్లించారు. దీంతో తమ పంటకు ధర తక్కువగా నిర్ణయించారని రైతులు ఆందోళనకు దిగారు. దీంతో వ్యాపారులు దిగి వచ్చి క్వింటాల్‌కు రూ.100 నుంచి రూ.200 పెంచి కొనుగోలు చేశారు. ఇదిలాఉంటే అన్ని మార్కెట్ల కంటే అచ్చంపేటలో ధర ఎక్కువగా చెల్లిస్తున్నా రైతులు ఆందోళనకు దిగుతున్నారని వ్యాపారులు పేర్కొంటున్నారు. రైతులు మాత్రం ఓ వైపు దిగుబడి రాక నష్టపోయామని, ఈ తరుణంలో ధర తగ్గించడం ఎంత వరకు సమంజసమని రైతులు వాపోతున్నారు. మరోవైపు ధర తక్కువగా ఉంందని కొందరు రైతులు వేరుశనగను తిరిగి తీసుకెళ్తున్నారు.