- కాయ దశకు చేరిన పత్తి పంట నాశనం
- తగ్గిన మొక్క జొన్న సాగు
- చేజారిన మినుములు
- ఫారెస్ట్ ఆఫీసర్ల అవేర్నెస్ కరువు
ఆసిఫాబాద్, వెలుగు : ఏజెన్సీ ఏరియాల్లోని పంటలపై అడవి పందులు దండయాత్ర చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా చేరి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. కొద్ది రోజులైతే పంట చేతికొస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న రైతులకు పందులు కన్నీరు మిగుల్చుతున్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలోని అడవికి సమీపంలో ఉన్న గ్రామాల్లో పందుల బెడద విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా కోత, కాత దశలో ఉన్న పంటలపై పందులు ఇష్టమొచ్చినట్లు దాడి చేసి ధ్వంసం చేస్తున్నాయి. దీంతో వాటిని అరికట్టేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు.
నెల రోజులుగా పెరిగిన దాడులు
ప్రతి ఏటా సెప్టెంబర్, అక్టోబర్ నెలలో పత్తి కాత దశలో ఉంటుంది. మినుములు, పెసర్లు, సోయా, పప్పు పంటలు కోత దశలో ఉంటాయి. అయితే, మరికొద్ది రోజుల్లో పంట చేతికొస్తుందని రైతులు ఆశతో ఉంటే.. వారి ఆశలను పందులు అడియాశలు చేస్తున్నాయి. చేతికందే సీజన్లో అడవి పందులు పంటలపై దాడి చేసి రైతులకు తీవ్ర నష్టం కల్గిస్తున్నాయి. గత నెల రోజులుగా జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో అడవి పందుల బెడద విపరీతంగా పెరిగిపోయింది. కోత దశలో ఉన్న మినుములు, పెసర్ల పంటలపై దాడి చేసి నాశనం చేస్తున్నాయి. కాయ దశలో ఉన్న పత్తి చేన్లపై దండెత్తుతుండడంతో కొమ్మలు విరుగుతూ, కాయలు రాలిపోతున్నాయి.
కాయలను తినడం కంటే పంటల్లో కలియ తిరుగుతూ నాశనం చేయడమే ఎక్కువ అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పత్తి పంటను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. కుభీర్ మండలంలోని హల్దా గ్రామానికి చెందిన సాయన్న అనే రైతుకు చెందిన మొక్కజొన్న పంటను బుధవారం రాత్రి అడవి పందులు ధ్వంసం చేశాయి. సాయన్న నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేయగా.. చేతికి అందివస్తున్న పంటను అడవి పందులు ధ్వంసం చేసి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని ఆవేదన వ్యక్తం చేశాడు.
మొక్కజొన్న వేయాలంటేనే భయపడుతున్న రైతులు
ఏజెన్సీలో ఆదివాసీ రైతులు గతంలో గ్రామాల చుట్టూ మొక్కజొన్న ఎక్కువగా సాగు చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పంట కంకి దశకు చేరుకోగానే చేన్లలోకి గుంపులు గుంపులుగా చేరుకొని పందులు ఇష్టమొచ్చినట్లు దాడి చేసేవి. నిమిషాల వ్యవధిలోనే పంటను పూర్తిగా నాశనం చేసేవి. వాటి భయం కారణంగా జిల్లాలో మొక్కజొన్న సాగు పూర్తిగా తగ్గింది. రైతులు మొక్కజొన్న పంట వేసేందుకు ముందుకు రాకపోవడంతో ప్రస్తుతం మక్కలు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫారెస్ట్ ఆఫీసర్ల అవగాహన లోపం
పందుల బెడద తీరేదెప్పుడని రైతు దిగులు చెందుతున్నారు. రెండేండ్ల నుంచి పందుల గుంపులు పెరిగిపోతున్నాయని, ముఖ్యంగా జోడేఘాట్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని ఏజెన్సీ మండలాలైన ఆసిఫాబాద్, జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్‌లో పందుల దాడులు పెరిగినట్లు రైతులు చెప్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తున్న ఫారెస్ట్ అఫీసర్లు వాటి నివారణపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. పంటలను కాపాడడానికి అవేర్నెస్ కార్యక్రమాలు కూడా నిర్వహించడంలేదని పేర్కొంటున్నారు. పందుల దాడులు తగ్గేలా తగిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.
20 ఎకరాల్లో పంట నాశనం జేసినయ్
నేను 40 ఎకరాల్లో పత్తి పంట సాగు చేసిన. పంట కోసం ఇప్పటివరకు రూ.12 లక్షలు ఖర్చు చేసిన. పూత, కాత దశలో ఉన్న పత్తి పంటను అడవి పందులు నాశనం చేసినయ్. 20 ఎకరాల పత్తి పంటను పూర్తిగా ధ్వంసం చేసినయ్. ఫారెస్ట్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం నా కుటుంబాన్ని ఆదుకోవాలి.
- దాసరి. మల్లేశ్, రైతు, ఆసిఫాబాద్
అధికారులు ఆదుకోవాలి
నేను 8 ఎకరాల్లో పత్తి పంట వేసిన. ఎంతో కష్టపడి సాగు చేసిన పంటలు చేతికొచ్చే సమయంలో అడవి పందులు మూడెకరాల్లో పూర్తిగా ధ్వంసం చేశాయి. అప్పుల భారం మీద పడుతూ బతుకు బండి గడవడం కష్టంగా మారింది. అధికారులు పట్టించుకొని మమ్మల్ని ఆదుకోవాలి.
- శ్రీనివాస్, రైతు, ఈదులవాడ, ఆసిఫాబాద్