- పంట ఏదైనా నష్టం రైతుకే..
- సిండికేట్‌గా మారి రేటు తగ్గిస్తున్న వ్యాపారులు
- తొమ్మిది నెలల తర్వాత అమ్మినా మిర్చికి దక్కని ధర
- డిమాండ్ తగ్గింది
వరంగల్/మహబూబ్‍నగర్, వెలుగు : కందులు, సోయా, మిర్చి, పత్తి... పంట ఏదైనా రైతులకు కష్టాలు, నష్టాలు మాత్రం తప్పడం లేదు. వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి, అంతర్జాతీయ మార్కెట్‌లో పంటకు డిమాండ్ లేదని సాకు చూపుతూ తమకు నచ్చినట్లు రేట్లను ఫిక్స్ చేస్తున్నారు. ఇది చాలదన్నట్లు క్వాలిటీ పేరుతో మరోసారి కోత విధిస్తున్నారు. దీంతో రైతులు పంటను అటు అమ్మలేక, ఇటు దాచుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మిర్చి రేటు రూ.4 వేలు తగ్గింది.. తొమ్మిది నెలల కిరాయి మీదపడ్డది
రాష్ట్రంలో మిర్చి సాగు చేసిన రైతుల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్లయింది. మిర్చి కొనుగోళ్లకు ప్రధాన కేంద్రంగా ఉన్న వరంగల్ ఏనుమాముల మార్కెట్‌కు మార్చి, ఏప్రిల్ నెలల్లో పెద్ద ఎత్తున పంట వచ్చింది. గత సీజన్‌లో తేజ రకం మిర్చి క్వింటాల్ రూ.19 వేల నుంచి రూ.20 వేలు పలుకగా... మార్చి, ఏప్రిల్‌లో మాత్రం రూ.15 వేల నుంచి రూ. 16 వేలే చెల్లించారు. ఒక్కో క్వింటాల్‌కు రూ.4 వేలు తగ్గడంతో పంటను కోల్డ్ స్టోరేజీల్లో దాచుకోవాలని ఆఫీసర్లు సూచించారు. ఆరు నెలల కాలానికి ఒక్కో బస్తాకు రూ.150 నుంచి రూ. 250 భరిస్తే.. భవిష్యత్‌తో మంచి ధర పొందొచ్చని చెప్పారు. దీంతో మిర్చి రైతులంతా కోల్డ్ స్టోరేజీల బాట పట్టారు.
ఏనుమాముల మార్కెట్ పరిధిలో 25 కోల్డ్ స్టోరేజీల్లో 25 లక్షల బస్తాలు కెపాసిటీ ఉండగా అవన్నీ నిండిపోయాయి. 9 నుంచి 10 నెలల పాటు కోల్డ్ స్టోరేజీకి కిరాయిలు కట్టిన రైతులు ఇప్పుడు పంటను అమ్ముకునేందుకు మార్కెట్‌కు తీసుకొచ్చారు. తీరా చూస్తే మార్చి, ఏప్రిల్‌లో క్వింటాల్‌కు ఇచ్చిన రేటు కంటే ఇప్పుడు మరో రూ.3 వేల నుంచి రూ. 4 వేల వరకు ధర తగ్గించారు.
ALSO READ : కుటుంబాలెన్నోఅప్లికేషన్లు అన్ని..!..జనగామ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే
తేజ రకం మిర్చి మార్చి, ఏప్రిల్‌లో క్వాలిటీ ఆధారంగా గరిష్టంగా రూ. 15 వేలు, కనిష్టంగా రూ. 13,500 పలికింది. కానీ బుధవారం మార్కెట్ ఆఫీసర్లు ఇచ్చి ధర ప్రకారం తేజ రకం మిర్చి రేటు క్వింటాల్‌కు గరిష్టంగా రూ. 15,500లుగా ఉంది. ఇందులోనూ నాణ్యత లేదంటూ రైతులకు క్వింటాల్‌కు రూ. 12 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. ఈ నష్టానికి తోడు పంట దాచుకున్నందుకు తొమ్మిది నెలల కోల్డ్ స్టోరేజీ కిరాయిలు కూడా రైతుల మీదే పడ్డాయి.
సోయా, పత్తిపైనా దోపిడీ
సోయా, పత్తి కొనుగోలు వ్యాపారులు సిండికేట్‌గా మారి మద్దతు ధర కంటే క్వింటాల్‌కు రూ.500 నుంచి రూ.1,600 వరకు తగ్గించేశారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 65 వేల ఎకరాల్లో సోయా సాగు చేయగా నాఫెడ్ ఆధ్వర్యంలో నాలుగు సెంటర్లలో కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఇప్పటికీ 29 వేల టన్నులు కొనుగోలు చేయగా మరో 7 వేల టన్నులు వచ్చే అవకాశం ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. అయితే ఇటీవల బేల మార్కెట్ యార్డులో తేమ శాతాన్ని సాకుగా చూపుతూ కొనుగోళ్లు చేపట్టలేదు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. కొందరు వ్యాపారులు రైతులను మభ్యపెట్టి ప్రైవేట్‌లో అమ్ముకునేలా చేస్తున్నారు.
క్వింటాల్‌కు రూ.4,100 నుంచి రూ.4,300 మాత్రమే చెల్లిస్తూ రూ.600 నుంచి రూ. 800 వరకు తమ జేబుల్లో వేసుకుంటున్నారు. పత్తికి వచ్చే సరికి వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లో మద్దతు ధర రూ.7,500 వరకు ఉండగా.. సీసీఐ ఆఫీసర్లు, వ్యాపారులు చేతులు కలిపి కొర్రీలు పెడుతూ క్వింటాల్‌కు రూ.6 వేల నుంచి రూ. 6,600 మధ్యే చెల్లిస్తున్నారు. అదే పంటను వ్యాపారులు పట్టుకొస్తే కమీషన్ మాట్లాడుకొని రూ.7 వేలకు మించకుండా చెల్లిస్తున్నారు.
కంది రైతుల ధర్నా
రాష్ట్రంలో కంది, సోయా పండించిన రైతులు మద్దతు ధర కోసం ధర్నాకు దిగాల్సి వస్తోంది. నారాయణపేట జిల్లాలో ఏటా వానాకాలం సీజన్‌లో రైతులు వరితో పాటు కందిని ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఈ సీజన్లో 78 వేల ఎకరాల్లో కంది సాగైంది. ప్రస్తుతం దిగుబడుల సీజన్ కావడంతో కందులు పెద్ద మొత్తంలో మార్కెట్‌కు వస్తున్నాయి. అయితే ఈ పంటకు నారాయణపేటలో తప్పితే మరెక్కడా మార్కెట్ లేదు. దీంతో ఈ జిల్లాలోని ఊట్కూరు, మక్తల్, నర్వ, మరికల్, ధన్వాడ, దామరగిద్ద, మాగనూరు, నారాయణపేట, కోస్గి, మద్దూరు మండలాలకు చెందిన రైతులు తమ పంటను నారాయణపేట మార్కెట్‍కు తరలిస్తున్నారు.
ఇదే అదనుగా భావించిన వ్యాపారులు రైతులను నిలువునా ముంచేస్తున్నారు. గత వారం కంది క్వింటాల్ రూ.11,500 నుంచి రూ.12,100 మధ్య పలుకగా సోమవారం నుంచి వ్యాపారులు సడన్‌గా రేటు తగ్గించారు. ప్రస్తుతం క్వింటాల్ కందులకు రూ. 7,500 నుంచి రూ. 8,500 లోపే చెల్లిస్తున్నారు. దీంతో తమకు గిట్టుబాటు కాదంటూ రైతులు సోమవారం మార్కెట్ యార్డు వద్ద ఆందోళనకు దిగారు.
సోమవారం రాత్రి వ్యాపారులు రైతులతో చర్చలు జరిపారు. కందికి రాష్ట్ర, జాతీయ మార్కెట్‌లో డిమాండ్ పడిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశారు. గత వారం ఇచ్చిన ధరే చెల్లించాలని రైతులు పట్టుబట్టినా వ్యాపారులు ఒప్పుకోలేదు. దీంతో మంగళవారం మరోసారి నారాయణపేట– హైదరాబాద్ ప్రధాన రహదారిపై ధర్నాకి దిగారు.
మిర్చి దాచుకుని ఏం లాభం
ఎండాకాలంలో మిర్చి అమ్ముకుందామని వరంగల్ మార్కెట్‌కు వచ్చిన. ధర లేదని, కొన్ని రోజులాగితే మంచి రేటు వస్తుందంటే కిరాయి కట్టి కోల్డ్ స్టోరేజీలో దాచుకున్న. ఇప్పుడు ధరలు.. అప్పటికంటే మరో రూ.3 వేల నుంచి రూ. 4 వేలు తగ్గినయ్. ఒక్కో బస్తాకు 8 నెలల పాటు కిరాయి కట్టిన. వ్యాపారులు మాత్రం వారు చెప్పిందే ధర.. లేదంటే తీస్కపో అంటున్నరు. మిర్చి దాచుకున్నా నష్టమే తప్ప లాభం లేదు.
– మోహన్, నల్లబెల్లి, వరంగల్-
ధర్నాలు చేస్తున్నామని ధర తగ్గించిన్రు
గత వారం కందులు క్వింటాల్ రూ.10 వేలపైనే పలికాయి. ఎంతో ఆశతో పంటను మార్కెట్‌కు తెచ్చిన. ఇప్పుడు క్వింటాల్‌కు రూ.8 వేల నుంచి రూ.8,500 మించి చెల్లించడం లేదు. రెండు రోజులుగా రైతులు ధర్నాలు, ఆందోళనలు చేస్తుండడంతో వ్యాపారులు ధరలను మరింత తగ్గించిన్రు.
– శ్రీనివాస్, రైతు, పేరపల్ల గ్రామం, నారాయణపేట మండలం