ఖమ్మం వ్యవసాయ మార్కెట్​లో కమీషన్ దందా

ఖమ్మం, వెలుగు : ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో కమీషన్​దారుల, ట్రేడర్ల చేతుల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అమాయక రైతులను, గిరిజనులను టార్గెట్ చేసుకొని వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారు. పంటను అమ్మినందుకు రూల్స్​ ప్రకారం 2 శాతం కమీషన్​ తీసుకోవాల్సిన కమీషన్​దారులు 6శాతం వరకూ వసూల్​ చేస్తున్నారు. తూకం అయిన తర్వాత రైతులకు ఇవ్వాల్సిన తక్​ పట్టీ కూడా ఇవ్వడం లేదు. కేవలం తెల్ల కాగితాల మీదే లెక్కలు రాసి రైతుల చేతుల్లో పెడుతున్నారు. ధాన్యం కొనుగోలు తర్వాత మార్కెట్ ఆఫీసులో సబ్మిట్​ చేయాల్సిన తక్​ పట్టీ డూప్లికేట్ కాపీలో 2 శాతం చొప్పన కమీషన్​ తీసుకున్నట్టుగా లెక్క మారుస్తున్నారు. అయితే వ్యవసాయ మార్కెట్లో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న అధికారులకు తెలిసే ఈ దందా నడుస్తోందనే ఆరోపణలున్నాయి. 

రైతులకు తీవ్ర నష్టం.. 

కొంతమంది రైతులు పంట పెట్టుబడి కోసం కమీషన్​దారుల నుంచి అప్పు తీసుకుంటారు. పంట అమ్మే టైంలో కమీషన్​దారులు బాకీని వసూలు చేసుకుంటారు. దానికి వడ్డీ తీసుకుంటూనే, మరోవైపు ఎక్కువ మొత్తం కమీషన్​ వసూలు చేస్తుండడంతో రైతులు తెలియకుండానే నష్టపోతున్నారు. మార్కెట్లో కటింగ్ బిల్లు వ్యాపారం పేరుతో కొంత మంది చేస్తున్న దందానే దీనికంతటికీ కారణమని తెలుస్తోంది. పంట అమ్ముకుని వెళ్లే సమయంలో రైతులకు మొత్తం డబ్బులను కమీషన్​దారులు చెల్లించాలి. అయితే ఛాంబర్​ ఆఫ్ కామర్స్​ బైలా ప్రకారం పంటను కొన్న ట్రేడర్ ఆ పంట కమీషన్​దారుడికి 13 రోజులుల్లోపు డబ్బులు చెల్లించాలి. కానీ ట్రేడర్లు డబ్బులు చెల్లించడంలో ఆలస్యం చేస్తూ కటింగ్ బిల్ వ్యాపారుల సంస్కృతిని తీసుకువచ్చారు. పంటను అమ్మిచ్చిన రోజే కమీషన్​దారుడికి డబ్బులు రావాలంటే ఒకటిన్నర శాతం చొప్పున కట్ చేసుకొని ఇస్తున్నారు. దీంతో కమీషన్​ దారులు తమకు నష్టంరాకుండా ఆ మొత్తాన్ని రైతుల పైనే భారం మోపుతూ.. అర శాతం నుంచి ఒకటిన్నర శాతం వరకు కలుపుతూ రైతుల నుంచి కటింగ్​ బిల్లు వసూలు చేస్తున్నారు.

తెల్లకాగితాల పైనే రూ.కోట్ల వ్యాపారం .. 

మార్కెట్​లో తెల్ల కాగితాల మీదే రోజూ రూ.కోట్ల వ్యాపారం నడుస్తోంది. అధికారికంగా సరైన బిల్లులు రైతులకు అందడం లేదు. రైతుల నుంచి 6 శాతం కమీషన్​ వసూలు చేసే వ్యాపారులు 20 మందికి పైగా ఉన్నారు. లైసెన్స్​ ఉన్న కమీషన్​దారులు 410 మంది దాకా ఉండగా.. అనధికారికంగా మరో 200 మంది వరకు కమీషన్​ వ్యాపారం చేస్తున్నారు. వీరిలో చాలామంది పంటను రికార్డు ప్రకారం కటింగ్ బిల్లు వ్యాపారుల పేర్లపై నమోదు చేయిస్తున్నారు. ఈ సమయంలో రోజూ జరిగే లావాదేవీలను కేవలం తెల్లకాగితాలు, ఆఫీసుల్లోని బుక్కుల్లో మాత్రమే నామమాత్రంగా నమోదు చేస్తూ, రూ.కోట్లలో అనధికారిక క్యాష్ ట్రాన్సాక్షన్​ నడిపిస్తున్నారు. ఇలా మార్కెట్లో జీరో వ్యాపారానికి తెరలేస్తోంది. పత్తి మార్కెట్లో 10 శాతం వరకు జీరో దందా నడుస్తుండగా, మిర్చి మార్కెట్లో మాత్రం 50 శాతం వరకు ఈ రకంగా జీరో సరుకు మార్కెట్ నుంచి బయటకు వెళ్తోందన్న ఆరోపణలున్నాయి.