జగిత్యాల జిల్లాలో ఆయిల్ పామ్​ సాగుకు రైతుల వెనుకడుగు

జగిత్యాల, వెలుగు: ప్రభుత్వం భారీగా రాయితీ ఇస్తున్నా జిల్లాలో ఆయిల్​పామ్​సాగు చేయడానికి రైతులు వెనకడుగు వేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంట సాగులో భాగంగా ఆయిల్ పామ్ సాగు కోసం అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈ ఏడాది 9 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్​తోటలు సాగు చేసేలా చర్యలు చేపట్టి జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం అబ్బాపూర్ లో నర్సరీ ఏర్పాటు చేశారు. అయితే జగిత్యాలలో ఏర్పాటు చేయాల్సిన క్రషింగ్ యూనిట్ కు అడుగులు పడకపోవడంతో ఆయిల్ పామ్​ సాగు చేసేందుకు రైతులు ముందుకు రావడం లేదు.  

ఎకరానికి 57 మొక్కలు..

ఎకరానికి 57 ఆయిల్​పామ్​మొక్కలు పెంచాలని ఆఫీసర్లు చెబుతున్నారు. ఓపెన్​ మార్కెట్​లో ఆయిల్​ పామ్​ మొక్క రూ.223 పైగా అందుబాటులో ఉండగా ప్రభుత్వం రాయితీతో రూ.20కే అందజేస్తోంది. ఈ మేరకు ఒక్కో ఎకరంలో అధికారులు 57 మొక్కలు పెంచేలా ప్రణాళిక చేపట్టారు. ఈ లెక్కన ఒక్కో మొక్క రూ.20 చొప్పున 57 మొక్కలకు రూ.1,140లను డీడీ రూపంలో చెల్లిస్తున్నారు. అలాగే సుమారు నాలుగేళ్ల వరకు పంట చేతికి రానందున ఎరువులకు, అంతర్ పంటల కోసం రైతులకు ప్రోత్సాహకంగా రూ.4,200 చొప్పున నాలుగేళ్ల వరకు రైతుల అకౌంట్​లో డబ్బులు వేయనుంది.

2,400 ఎకరాలకు రైతుల డీడీలు..

హార్టికల్చర్, అగ్రికల్చర్ శాఖ అధికారులు ప్రైవేట్ కంపెనీతో కలిసి 9 వేల ఎకరాల్లో సాగు చేసేలా 5,13,000 మొక్కలు పెంచుతున్నారు. వీటిని 2023 ఫిబ్రవరిలో పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంకో మూడు నెలల్లో మొక్కలు నాటేందుకు సిద్ధం చేస్తున్నారు. అయితే ఇప్పటికి సుమారు 2,400 ఎకరాల్లో 1,36,800 లక్షల మొక్కల కోసం మాత్రమే రైతులు డీడీలు కట్టారు. 

ఏర్పాటు కాని క్రషింగ్ యూనిట్..

సర్కార్ నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నా క్రషింగ్ యూనిట్ ఏర్పాటు చేయడంలో జాప్యం జరుగుతోంది. పండించిన ఆయిల్ పామ్​ను అమ్మడానికి క్రషింగ్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద స్థల పరిశీలన చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ మూత పడటంతో అమ్ముకునే వీలులేక చెరుకు సాగు విపరీతంగా పడిపోయింది. దానిలాగే ఆయిల్ పామ్​సాగు చేశాక క్రషింగ్ యూనిట్ ఏర్పాటు చేయకపోతే తమ పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన చెందుతున్నారు. చెరుకు, ఆయిల్ పామ్​కోసిన అనంతరం 36 గంటల్లో క్రషింగ్ కు పంపించాల్సి ఉంటుందని, ఆలస్యమైతే దిగుబడి రాదని రైతులు చెబుతున్నారు. 

రైతులకు భరోసా కల్పించాలి

ప్రభుత్వం ఆయిల్ పామ్​సాగు కోసం రైతులను ప్రోత్సహిస్తోంది  కానీ పంటను అమ్ముకోవడానికి ఎలాంటి ఏర్పాట్లు చెయ్యడం లేదు. యూనిట్ ఏర్పాటు చేస్తే రైతులు పంట వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ‌‌‌‌‌‌‌‌ 
- ముత్యం రెడ్డి, డబ్బు తిమ్మయ్యపల్లి, కొడిమ్యాల

రైతులకు ఆర్థికంగా ఎదుగుతారు

రైతులు సంప్రదాయ పంటలు కాకుండా ఆర్థికంగా ఎదగడానికి ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలి. ఆయిల్​పామ్​కు డిమాండ్ పెరుగుతోంది. రైతులు ఆ దిశగా ఆలోచన చేయాలి. ప్రభుత్వ రాయితీలు వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలి.
- ప్రతాప్ సింగ్, జగిత్యాల హార్టికల్చర్ అధికారి