పంటలకు పెట్టుబడి ఎట్లా?..చేతిలో పైసలు లేక అప్పులు చేస్తున్న రైతులు

పంటలకు పెట్టుబడి ఎట్లా?..చేతిలో పైసలు లేక అప్పులు చేస్తున్న రైతులు
  • 25 లోగా వరి నాట్లు పూర్తి చేయాలని చెబుతున్న రాష్ట్ర సర్కారు
  • యాసంగి వడ్ల డబ్బులు ఇంకా జమ కాలె
  • చేతిలో పైసలు లేక అప్పులు చేస్తున్న రైతులు

మహబూబ్​నగర్​, వెలుగు :వానాకాలం సాగు కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సీజన్​లో వరి నాట్లను రోహిణి కార్తెలో ప్రారంభించి 30 రోజుల్లో కంప్లీట్​ చేయాలని రాష్ట్ర సర్కారు సూచించింది. అయితే యాసంగి వడ్లు అమ్మి రెండు నెలలు కావస్తున్నా రైతులకు ఇంత వరకు పైసలు జమ కాకపోవడంతో పంటల పెట్టుబడులకు ఏం చేయాలోనని ఆందోళన చెందుతున్నారు. 

3.77 లక్షల ఎకరాల్లో..

మహబూబ్​నగర్​ జిల్లాలో ఈ వానాకాలంలో 3.77 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని అగ్రికల్చర్​ ఆఫీసర్ల లెక్కలు చెబుతున్నాయి. 1.89 లక్షల ఎకరాల్లో వరి, 1.15 లక్షల ఎకరాల్లో పత్తి, 28 వేల ఎకరాల్లో మక్కలు, 13 వేల ఎకరాల్లో జొన్న, 12,548 ఎకరాల్లో కందులు, 14 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగు చేస్తారని అంటున్నారు. అయితే ఈ నెల​ 25 నాటికి వరి నాట్లు పూర్తి చేయాలని సీఎం చెప్పడంతో, ఆ టైం వరకు నాట్లు పోసుకోవడం కష్టమేనని రైతులు చెబుతున్నారు. ఈ విషయంపై ఆఫీసర్లు అవగాహన కల్పించకపోవడంతో రైతులు ఎప్పటి మాదిరిగానే సాగుకు సిద్ధం అవుతున్నారు. 

పెట్టుబడుల కోసం అప్పులు..

వరి సాగుకు సిద్ధమవుతున్న రైతులకు ప్రస్తుతం ఎకరానికి రూ.20 వేల వరకు పెట్టుబడులు అవసరం. ఎకరా పొలంలో నారు పోసుకోవడానికి వరి విత్తనాలతో పాటు కరిగెట్ట చేయడానికి ట్రాక్టర్​ కిరాయి కింద రూ.7 వేలు, నాట్లు వేయడానికి కూలీలకు మరో రూ.6 వేల వరకు ఖర్చవుతోంది. వానాకాలం సీజన్​ నెల ముందే ప్రారంభించాలని ఇటీవల సర్కారు సూచించిందే తప్ప, వడ్లు అమ్మిన రైతులకు సకాలంలో పైసలను జమ చేయలేదు. పంట పెట్టుబడి సాయాన్ని కూడా ముందుగా ఇచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరో రెండు వారాలు దాటితే అదును దాటి పోతుందనే భయంతో రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు 
తెచ్చుకుంటున్నారు. 

నూటికి రూ.4 నుంచి రూ.5 వడ్డీ..

జిల్లాలో వరి తర్వాత పత్తి, మక్కలు, జొన్న, కంది పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఈ పంటల సాగుకు కూడా రైతులు అప్పులు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో చాలా మంది రైతులు వేసవి దుక్కులను పూర్తి చేసుకొని, విత్తనాలు చల్లుకున్నారు. ఇందు కోసం వడ్డీ వ్యాపారుల నుంచి నూటికి రూ.4 వడ్డీ కింద రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు అప్పులు చేశారు. మరో వారం రోజుల్లో తొలకరి వర్షాలు వచ్చే అవకాశం ఉండడంతో, వానల కోసం ఎదురుచూస్తున్నారు.

ఎండిపోయిన కాల్వలు..

ప్రాజెక్టుల్లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని, వానాకాలం సాగును నెల ముందు ప్రారంభిస్తే కాల్వల ద్వారా సాగునీటిని అందిస్తామని అధికారులు  ప్రకటించారు. కానీ, జిల్లాలోని కోయిల్​సాగర్, ఎంజీకేఎల్ఐ కాల్వల ద్వారా చుక్క నీరు పారడం లేదు. మార్చి రెండో వారం నుంచే ఈ కాల్వల ద్వారా నీటి విడుదలను ఇరిగేషన్​ బంద్​ పెట్టింది. వారబందీ ప్రకారం యాసంగి పంటలకు పది రోజులకోసారి నీటిని అందించినా, చివర్లో చేతులెత్తేసింది. ప్రస్తుతం శ్రీశైలం, కోయిల్​సాగర్​ ప్రాజెక్టులు డెడ్​స్టోరేజీల్లో ఉండగా, కాల్వల ద్వారా ఇప్పట్లో సాగునీరందించే పరిస్థితి లేదు. 

వడ్ల పైసలియ్యలె..

వానాకాలం పంటలు నెల ముందుగాల ఏయమని చెబుతున్రు. సెంటర్​లో 62 క్వింటాళ్ల వడ్లను అమ్మిన. రెండు నెలలైనా ఇప్పటి దాకా పైసలు రాలె. వానాకాలం పంటలకు పెట్టుబడులు ఎక్కడి నుంచి తేవాలె? ముందస్తు పంటలేయాలంటే రైతుబంధు డబ్బులు ముందుగాలే ఇయ్యాలి.
- మున్నూరు పుల్లయ్య, రైతు, నంచర్ల

కార్తె పోతుందని అప్పు తెచ్చిన..

నాకున్న రెండెకరాల్లో ఈ సీజన్​లో జొన్నలు వేస్తున్నా. పంట వేయనికి చేతిలో పైసల్లేవ్​. రైతుబంధు వస్తదనుకుంటే ఇప్పట్లో వచ్చేట్లు కనిపిస్తలేదు. కార్తె పోతుందని రూ.20 వేలు మిత్తికి తెచ్చి, విత్తనాలు చల్లుకున్నా. 
- ఎర్రగొల్ల యాదయ్య, హన్వాడ