
- సాగు పెట్టుబడి కోసం రైతుల తిప్పలు
- ఈ ఏడాది పంట రుణాల లక్ష్యం రూ. 2,350 కోట్లు
ఆదిలాబాద్, వెలుగు: ప్రభుత్వం రుణమాఫీ చేయక, బ్యాంకుల్లో పంట రుణాలు అందక, రైతులు ప్రైవేటు వ్యాపారుల వద్ద పంటల సాగుకు అప్పులు చేస్తున్నారు. బుక్ అడ్జస్ట్ మెంట్లు తప్పా దీంతో అప్పుల కోసం రైతులు వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరుగుతున్నారు. విత్తనాలు, ఎరువులు, ఇతర ఖర్చులకు దాదాపు రూ. లక్ష నుంచి రెండు లక్షల వరకు ఖర్చు చేస్తారు. ఇప్పటికే 50 శాతం మంది రైతులు పత్తి విత్తనాలు వేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 5 లక్షల ఎకరాల్లో పంట సాగవుతుందని అంచనా. ఇందులో ఎక్కువగా 3.50 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేస్తున్నారు.
రుణ లక్ష్యం లో వెనుకంజ..
ఈ ఏడాది పంట రుణ లక్ష్యం రూ. 2,350 కోట్లు కాగా... గతేడాదితో పోలిస్తే పది శాతం రుణ పరిమితి పెరిగింది. 1.45 లక్షల మంది రైతులకు పంట రుణాలు అందించాలని నిర్ణయించారు. గతేడాది పంట రుణ లక్ష్యం రూ. 2,161 కోట్లు కాగా కేవలం రూ.1494 కోట్లు మాత్రమే బ్యాంకర్లు రుణాలు ఇచ్చారు. అంటే 69 శాతం మాత్రమే లక్ష్యం చేరుకున్నారు. ఈ ఏడాది పంట రుణాలు అందించే ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికలకు ముందు రూ.లక్ష వరకు రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ దాన్ని అమలు చేయలేదు. పాత బకాయిలు ఉండటం.. ప్రభుత్వం పంట రుణమాఫీ చేస్తుందనే ఉద్దేశంతో రీషెడ్యూల్ చేసుకోకపోవడంతో ఇప్పుడు పాత రుణం కడితేనే కొత్త రుణం ఇస్తామంటున్నారు.
25 శాతం వడ్డీకి అప్పులు..
ప్రైవేట్ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చి రైతులు పంటలు సా95గు చేస్తున్నారు. పంట కాలానికి అప్పులు ఇచ్చే వడ్డీ వ్యాపారులు జిల్లాలో అధికంగా ఉన్నారు. పంట కాలాన్ని పరిగణలోకి తీసుకొని 20 నుంచి 25శాతం వడ్డీతో వ్యాపారులు రైతులకు అప్పులు ఇస్తుంటారు. ఒక రైతు కనీసం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు అప్పులు తీసుకుంటేనే సాగు సాధ్యమవుతుంది. విత్తనాలు, ఎరువులు ముందుగానే కొనుగోలు చేయడం, అటు కూలీలకు, ట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వాల్సి రావడంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ రైతులు కుదేలవుతున్నారు. సర్కారు రుణ మాఫీ చేస్తే ఈ పరిస్థితి ఉండేది కాదని అన్నదాతలు వాపోతున్నారు.
రూ. 2 లక్షలు అప్పు తీసుకున్న
ఈ ఏడాది మూడు ఎకరాల్లో పంట సాగు చేస్తున్న. పెట్టుబడి కోసం బ్యాంకులో రూ. 80 వేల లోను మాత్రమే ఇచ్చారు. ప్రభుత్వం రుణ మాఫీ చేస్తుందనే ఆశతో నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్న. పంట సాగు కోసం ప్రైవేట్ వ్యాపారుల వద్ద రూ. 2 లక్షలు అప్పు తీసుకున్న. రుణమాఫీ కాకపోవడం.. పంట రుణం కూడా తక్కువగా ఉండటంతో అప్పులు చేయక తప్పడం లేదు.
మంచికుంట సంతోష్, రైతు బోథ్