పంట చేన్లలో నిప్పు.. ప్రాణాలకు ముప్పు

  • వరి కొయ్యలు, మక్క దంట్లకు మంట పెడుతున్న రైతులు
  • మిరప, పత్తి చెట్లను పీకేసి కుప్పలుగా కాల్చివేత
  • గాలులతో పక్క చేలకు వ్యాపిస్తున్న మంటలు
  • ఇటీవలే ఓ రైతు మృతి, రూ.25 లక్షలకు పైగా ఆస్తినష్టం

ఖమ్మం, వెలుగు:  ఓ వైపు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. దాదాపు నెల రోజులుగా 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే పంట సీజన్ కోసం రైతులు సిద్ధమవుతున్నారు. పంట చేలలో ఉన్న వరి కొయ్యలను, మక్క దంటు, పత్తి కర్ర, మిరప చెట్లకు రైతులు నిప్పు పెడుతున్నారు. ఈ క్రమంలో మంటల కారణంగా వచ్చే ప్రమాదాలను రైతులు గుర్తించలేకపోతున్నారు. కొన్ని చోట్ల రైతులే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోంది. మరికొన్ని ఘటనల్లో పక్క చేలకు మంటలు వ్యాపించి ఆస్తి నష్టం జరుగుతోంది. విపరీతమైన ఎండలకు తోడు, ఈదురు గాలుల కారణంగా మంటలు త్వరగా వ్యాప్తిస్తాయనే ఆలోచన రైతులకు రాకపోవడం ఎక్కువ ప్రమాదాలకు కారణమవుతోంది. సమీపంలోని వ్యవసాయ మోటార్లు, నీటి పైపులు, ఇతర రైతుల చేలకు మంటలు వ్యాపించకుండా కాపాడే ప్రయత్నంలో జిల్లాలోని కూసుమంచి మండలంలో ఇటీవలే ఓ రైతు చనిపోగా, మంటలు వ్యాపించిన ఘటనల్లో రూ.25 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగింది. 

జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు...

ముదిగొండ మండలం వెంకటాపురంలో ఆదివారం ఎండిన పత్తి, మిర్చి కుప్పలకు రైతులు నిప్పుపెట్టారు. గాలి కారణంగా మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి. మేడేపల్లి వెళ్లే రహదారి వరకు మంటలు రావడంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో సమీపంలోని ముగ్గురు రైతులకు చెందిన ఏడెకరాల్లో సుబాబుల్, జామాయిల్ తోటలకు నిప్పంటుకుంది. సుమారు రూ.5 లక్షల వరకు పంట నష్టం జరిగింది.  

రెండ్రోజుల క్రితం బోనకల్లు మండలం గోవిందాపురంలో రైతు తాళ్లూరి శ్రీను తన పొలంలో ఉన్న మక్క దంటు కుప్ప వేసి నిప్పు పెట్టి ఇంటికి వెళ్లాడు. ఆ పక్కనే కల్లంలో మరో రైతు ఉమ్మనేని సురేశ్​50 క్వింటాళ్ల మక్కలు ఆరబోశారు. నిప్పు ఎండలకు పెద్ద మంటలుగా మారి కల్లంలో ఉన్న మక్కలకు వ్యాపించాయి. దీంతో దాదాపు పది క్వింటాళ్ల మక్కలు కాలిపోయాయి. 

రెండు వారాల క్రితం నేలకొండపల్లి మండలం రాయిగూడెం మక్కల కొనుగోలు కేంద్రంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ కేంద్రంలో రైతులు అమ్మేందుకు సుమారు 600 క్వింటాళ్ల మక్కలను తెచ్చారు. సమీప చేనులో రైతు చెత్తకు నిప్పంటించగా అది కొనుగోలు కేంద్రం వరకూ వ్యాపించింది. గమనించిన రైతులు మంటలు ఆర్పారు. 

ఈనెల16న తల్లాడ మండలం కేశవాపురం, వెంకటాపురంల మధ్య పంట చేనులోని వరికొయ్యలకు కొందరు రైతులు నిప్పు పెట్టడంతో మంటలు సమీప ప్రాంతాల్లోకి వ్యాపించాయి. అదే రోజు తల్లాడలోని మిర్చి నర్సరీలోకి సమీపంలోని పొలాల నుంచి మంటలు రావడంతో నారు కాలిపోయింది. 

ఈనెల16న బోనకల్లు మండలం రాయన్నపేటలో కౌలు రైతు వడ్డెబోయిన పానకాలు రెండెకరాల్లోని మక్క కంకి విరిచి కుప్పగా పోశారు. పక్కన ఉన్న పొలం నుంచి మంటలు వచ్చి పంట మొత్తం దగ్ధమైంది. రూ.లక్ష నష్టం వాటిల్లింది. అదే రోజు చింతకాని మండలం నాగిలికొండలో పక్కన చేల నుంచి మంటలు వ్యాపించి కొప్పుల వీరయ్య, కావూరి వెంకటయ్య, పులిబాబు, దమ్మాలపాటి శ్రీను పొలాల్లోని సుమారు500 క్వింటాళ్ల మక్క పంట కాలిపోయింది. 

రెండు వారాల క్రితం కొణిజర్ల మండలం పల్లిపాడు, లాలాపురం మధ్య కొందరు రైతులు వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో ముగ్గురు రైతులకు చెందిన ఎనిమిది ఎకరాల జామాయిల్ తోట దగ్ధమైంది. 

కూసుమంచి మండలం గైగోళ్లపల్లి జీపీ శివారు గ్రామం హట్యాతండాలో ఈనెల15న తన పొలంలోని వరి కొయ్యలకు రైతు మున్యా నిప్పు పెట్టాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లాడు. ఉదయం 11 గంటలకు పొలం వద్దకు వెళ్లగా గాలికి మంటలు ఇతర పొలాల్లోకి వెళ్లడాన్ని గుర్తించాడు. పక్క చేనులో బోరు, పైపులు ఉండడంతో వాటికి మంటలు అంటుకోకుండా చెట్లకు కొమ్మలు విరిచి ఆర్పే ప్రయత్నం చేశాడు. పొగకు తోడు మంటల వేడితో మున్యా కళ్లు తిరిగి పడిపోయాడు. దీంతో మంటలు మున్యా(53)కు అంటుకొని అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. పొలంలోని వరి కొయ్యలు, చెత్తా చెదారానికి నిప్పంటించబోయి, అదే మంటలకు రైతు అగ్గిపాలయ్యాడు. 

మూడేళ్ల కష్టం అగ్గిపాలైంది...

నా రెండున్నర ఎకరాల్లో జామాయిల్ వేసిన. ఈ పంట కోసం మూడేండ్లుగా ఎదురు చూస్తున్న. రెండు రోజుల కింద రూ.2 లక్షల 40 వేలకు అడగగా ఆలోచించుకొని చెప్తా అన్న. ఆదివారం వారు రావాలి. కానీ ఓ రైతు ఆయన చేనుకు నిప్పు పెట్టడంతో దాదాపు100 ఎకరాలు పైగా మంటలం టుకున్నయ్. దీంతో నా జామాయిల్​పూర్తిగా కాలిపోయింది. మూడేళ్ల కష్టం అగ్గిపాలైంది. దీనిపై పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసినం. 

–కందుల రవీంద్రబాబు, వెంకటాపురం