రేటు రాక పత్తి అమ్ముతలేరు 

కామారెడ్డి , వెలుగు:  పత్తికి రేటు రోజు రోజుకు తగ్గుతుండడంతో జిల్లా రైతులు  పత్తి అమ్ముత లేరు. గతేడాది దళారులకు పత్తి అమ్మినంక ధర పెరగడంతో, ఈ యేడు  అలా అమ్మితే నష్టపోతామని భావించి   ఏరిన కాడికి ఇండ్లలోనే దాచుకున్నారు. కానీ  గత 3 వారాలుగా దళారులు పత్తి రేటు  తగ్గుతుండడంతో రైతులు ఏం చేయాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు.  జిల్లాలో 2,854 ఎకరాల్లో పత్తి పంట సాగైంది.  సదాశివనగర్​, తాడ్వాయి,  బిచ్కుంద తదితర మండలాల్లో ఎక్కువగా రైతులు పత్తి వేశారు. సదాశివనగర్​మండలం మర్కల్​లో 650 ఎకరాల వరకు  సాగు చేశారు.  ఈ ఊరిలో ఇప్పటి వరకు 20 క్వింటాళ్ల పత్తిని మాత్రమే  అమ్మినట్లు  రైతులు చెప్తున్నారు. 

తగ్గిన ధర

జిల్లాలో  మహారాష్ర్ట  బార్డర్​లో ఉన్న మద్నూర్​ మండల కేంద్రంలో  పత్తి జిన్నింగ్​ మిల్స్​ ఉన్నాయి.  సీసీఐ కూడా  ఇక్కడి జిన్నింగ్​ మిల్లులోనే కొనుగోలు సెంటర్​ ఏర్పాటు చేసింది.  మద్నూర్, జుక్కల్​, బిచ్కుంద మండలాలకే జిన్నింగ్​ మిల్లులు దగ్గరగా ఉన్నాయి. మిగతా  కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాల్లోని మండలాలకు 90 నుంచి 100 కి.మీ. దూరం.   గ్రామాలకు వచ్చే దళారులకే పత్తి దిగుబడులు రైతులు అమ్ముతున్నారు.   నెల రోజుల కింద వరకు  క్వింటాల్​కు రూ. 8,500 నుంచి రూ.9వేల వరకు ఇచ్చారు.  తీరా దిగుబడులు ఎక్కువ రాగానే దళారులు ఒక్కసారిగా రేట్​ తగ్గించారు. రూ.7,500 నుంచి రూ.8వేలకు కొంటామంటున్నారు.  ప్రభుత్వం​ ధర పెరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

గిట్టుబాటు కావట్లే

ఎకరంన్నర పత్తి పంట సాగు చేసిన.  పంట పెట్టుబడులు బాగా పెరిగినయ్​. దున్నకం,  కూలీల రేట్లు,  మందులు అన్ని రేట్లు  పెరిగినప్పటికీ  కష్టపడి పండించిన పంట చేతికి రాగానే  ధర పడిపోతుంది.   క్వింటాల్​కు రూ.8వేలు కూడా లేదు.  పోయిన సారి కంటే  తగ్గింది.  

‘ సదాశివనగర్​ మండలం మర్కల్​కు చెందిన పత్తి రైతు ఎర్రవాటి రాజిరెడ్డి.  4 ఎకరాల్లో పత్తి వేయగా, 20 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది.   నెల రోజులుగా పత్తిని  బస్తాల్లో నింపి ఇంటిలోనే దాచాడు. గ్రామాలకు వచ్చి పత్తి కొనే దళారులు   మొదట్లో క్వింటాల్​కు రూ.  9వేల రేటు ఇస్తామన్నారు. ఇంకా పెరుగుతుందేమోనని అప్పుడు అమ్మలేదు. ఇప్పుడు  క్వింటాల్​కు రూ.7,500  లకు మించి ధర చెల్లించలేమని చెప్తుండడంతో ఆందోళన చెందుతున్నాడు.

‘ఈయన మర్కల్​కు చెందిన రైతు జైపాల్. ఎకరన్నరలో పత్తి సాగు చేశాడు. 9 నుంచి10 క్వింటాళ్ల వరకు  దిగుబడి రావడంతో అమ్మకుండా బస్తాల్లో నింపి ఇంట్లో వేశాడు. ఇప్పుడు  అమ్ముకుందామంటే దళారులు ధర తగ్గించారని వాపోతున్నారు. మిల్లుకు తీసుకెళ్దామంటే దగ్గరలో లేవని 100 కిలో మీటర్లు  పోవాల్సి వస్తుందని వాపోయారు.  ప్రభుత్వం   ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు.