విద్యుత్ కోతలపై రోడ్డెక్కిన రైతులు

  • రోజుకు నాలుగైదు గంటలన్నా ఇస్తలేరని ఆవేదన
  • నల్గొండలో సబ్​స్టేషన్​ వద్ద రైతు ఆత్మహత్యాయత్నం  
  • నాగర్ కర్నూల్​లో సబ్ స్టేషన్​కు తాళమేసిన రైతులు

నెట్​వర్క్, వెలుగు:కరెంట్ కోతలపై రైతులు ఆందోళన ఉధృతం చేశారు. కొన్ని రోజులుగా సబ్ స్టేషన్లను ముట్టడిస్తున్నా సర్కార్ స్పందించకపోవడంతో గురువారం రాష్ట్రవ్యాప్తంగా రోడ్లను దిగ్బంధించారు. 24 గంటలు కరెంట్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. నాలుగైదు గంటలు కూడా ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అది కూడా ఇష్టమున్నట్లు ఇస్తున్నదని.. కరెంట్ ఎప్పుడు వస్తున్నదో? ఎప్పుడు పోతున్నదో? తెలియడం లేదని వాపోయారు. ఫలితంగా పంటలు ఎండిపోతున్నాయని, ఇట్లయితే తామెట్ల బతకాలని ఆందోళన వ్యక్తం చేశారు.

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో బండలింగాపూర్ గేటు వద్ద వందలాది మంది రైతులు నేషనల్ హైవే 63పై బైఠాయించారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఈ క్రమంలో పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం జరిగి కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా రైతు సంఘాల నేతలు మాట్లాడుతూ.. ‘‘వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని సర్కార్ గొప్పలు చెప్పుకుంటోంది. కానీ నాలుగైదు గంటలకు మించి ఇవ్వడం లేదు. కరెంట్​కోతలతో మెట్ పల్లి ప్రాంతంలో దాదాపు 30 వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయే దుస్థితి దాపురించింది. ఇష్టమున్నట్లు కరెంట్ కట్ చేస్తున్నారు. అసలు కరెంట్ ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు పోతుందో? కూడా తెలియడం లేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు.  

మంచిర్యాలలో 200 మంది రైతుల ధర్నా.. 

దిలావర్ పూర్ లో నిర్మల్– భైంసా రోడ్డుపై కాంగ్రెస్ నేతలతో కలిసి రైతులు రాస్తారోకో చేశారు. సర్కార్ కనీసం మూడు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. పంటలు ఎండిపోతున్నాయని, ఇప్పుడే పరిస్థితి ఇట్లుంటే ఏప్రిల్​లో ఇంకెలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లాలో కన్నెపల్లి సబ్​స్టేషన్ ముందు రైతులు ధర్నా చేశారు. కన్నెపల్లి సబ్​స్టేషన్​పరిధిలోని రెబ్బెన ముత్తాపూర్, కన్నెపల్లి, మాడవెల్లి గ్రామాలకు చెందిన సుమారు 200 మందికి పైగా రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పగలు త్రీఫేజ్ కరెంట్ ఇస్తలేరని, రాత్రి పూట ఇస్తే తాము ప్రమాదాలకు గురవుతున్నామని ఆవేదన చెందారు. లోకల్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తమ సమస్యలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. విద్యుత్ ఏడీ రాంచందర్, ఏఈ బాపు అక్కడికి రాగా.. వాళ్లపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

సిద్దిపేట జిల్లాలో కాలిన మోటార్లతో నిరసన... 

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం బేగంపేట సబ్​స్టేషన్​ఎదుట రైతులు ధర్నా చేశారు. ‘‘మొన్నటి వరకు వరికి తెగుళ్లు సోకి నష్టపోయాం. ఇప్పుడేమో కరెంట్​లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. టైమింగ్​లేని కరెంట్​తో ఒక్క మడి కూడా పారడం లేదు. కరెంట్​5 గంటలకు మించి రావడం లేదు. అది కూడా ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు పోతుందో? తెలియక బావుల వద్దే పడిగాపులు కాస్తున్నాం” అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే జిల్లా మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల రోడ్డుపై రైతులు కాలిన మోటార్లతో రెండు గంటల పాటు బైఠాయించారు. ‘‘వచ్చీరాని కరెంట్​తో మోటార్లు కాలిపోతున్నాయి. ఇప్పటికే అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టాం. ఇప్పుడు కాలిపోతున్న మోటార్లకు రిపేర్లు చేయించేందుకు ఎక్కడి నుంచి తేవాలి” అని వాపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో రైతులు సబ్​స్టేషన్​ను ముట్టడించారు. కరెంటు కోతలతో పంటలు ఎండుతున్నాయని ఆందోళన చేశారు. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మాక్లూర్​మండలంలోని దాస్ నగర్ సబ్ స్టేషన్ ను ముట్టడించారు. కరెంట్​కోతలు ఆపకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ట్రాన్స్​కో ఏఈ లక్ష్మీనర్సింహారావుకు వినతిపత్రం అందజేశారు.

రైతు ఆత్మహత్యాయత్నం.. 

కరెంట్‌‌‌‌‌‌‌‌ సరిగా ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఓ రైతు సబ్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌ ముందు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం బుగ్గతండాలో జరిగింది. తండాకు చెందిన జటావత్‌‌‌‌‌‌‌‌ చందు తనకున్న రెండు ఎకరాల్లో వరి, కౌలుకు తీసుకున్న నాలుగు ఎకరాల్లో పల్లి వేశాడు. వారం నుంచి కరెంట్‌‌‌‌‌‌‌‌ సరఫరా సరిగా లేకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి తలెత్తింది. ఆఫీసర్లను కలిస్తే తామేమీ చెయ్యలేమని చెప్పారు. దీంతో గురువారం బుగ్గతండా సబ్‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌ వద్దకు చేరుకున్న చందు.. అక్కడే పురుగుల మందు తాగాడు. గమనించిన సిబ్బంది, ఇతర రైతులు అతణ్ని పెద్దమునిగల్‌‌‌‌‌‌‌‌లో ఓ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ హాస్పిట్‌‌‌‌‌‌‌‌ కు తరలించారు. 


సబ్ స్టేషన్​కు తాళం..  

నాగర్​కర్నూల్ ​జిల్లా తాడూరు మండలం ఐతోలు సబ్ స్టేషన్ కు రైతులు గురువారం తాళం వేశారు. కరెంట్ కోతలకు నిరసనగా తాడూరు మండలం ఐతోలు, బలాన్ పల్లి రైతులు సబ్ స్టేషన్ కు తాళం వేసి నిరసన తెలిపారు. 15 రోజుల నుంచి 12 గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదని, పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందారు. సమస్య పరిష్కరించే వరకు తాళం తీసేది లేదని స్పష్టం చేశారు. అక్కడే వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.

రాత్రి రెండు గంటలు ఇస్తున్నరు

నాలుగెకరాల్లో వరి వేసిన. 20 రోజులుగా కరెంట్ కోతలు ఎక్కువైనయ్. కరెంట్ ఎప్పుడు వస్తదో? ఎప్పుడు పోతదో? తెలుస్తలేదు. రాత్రి రెండు గంటలు ఇస్తున్నరు. పొలం దగ్గరే ఉండి మోటార్ పెడుతున్న. ఆ నీళ్లు ఎటూ సాల్తలేవు. కోతలు లేకుండా కరెంట్ ఇయ్యాలే. కరెంట్ కోసం రోడ్డెక్కే పరిస్థితి వచ్చినా సర్కార్ పట్టించుకుంటలేదు. 
- పిడుగు అమృత్ లాల్, బండలింగాపూర్, జగిత్యాల