- డిమాండ్ ఉన్నా పత్తి విత్తనాలు లేవంటున్న వ్యాపారులు
- ఆందోళన చెందుతున్న రైతులు
- వానకాలం సాగుకు అంతా సిద్ధం
- 5.79 లక్షల ఎకరాల్లో సాగు అంచనా
ఆదిలాబాద్, వెలుగు: డిమాండ్ ఉన్న విత్తనాల కొరత చూపుతూ వ్యాపారులు బ్లాక్లో అమ్ముకుంటున్నారు. ఫలితంగా దిగుబడి వచ్చే రకం విత్తనాలు మార్కెట్లో దొరక్క రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్జిల్లా రైతులు ప్రతి ఏటా డిమాండ్ఉన్న విత్తనాల వైపే మొగ్గు చూపుతారు. అయితే డిమాండ్ ఉన్న పత్తి రకం విత్తనాలకు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. జిల్లాలోని నల్లరేగడి, ఎర్రరేగడి భూముల్లో ఓ రకం పత్తి విత్తనాల దిగుబడి బాగుంటుందని రైతుల్లో నమ్మకంఉంది. కానీ వ్యాపారులు కావాలని ఆ రకం పత్తి విత్తనాల కొరత సృష్టిస్తున్నారు. ఆపై బ్లాక్లో అమ్ముతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
10 లక్షల ప్యాకెట్లు అవసరం..
జిల్లాలోని పత్తి రైతులకు దాదాపు 10 లక్షలకు పైగా విత్తనాల ప్యాకెట్ల అవసరం ఉంది. ఇప్పటికే విత్తనాల కోసం రైతులు నిత్యం ఆదిలాబాద్ మార్కెట్కు వస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 5 లక్షల ప్యాకెట్లు మార్కెట్లోకి వచ్చాయని, జూన్ మొదటి వారం వరకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాయని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ వ్యాపారులు మాత్రం రైతులు అడిగిన విత్తనాలు లేవంటూ మభ్యపెడుతున్నారు. రైతులకు విత్తనాల కొరత లేకుండా అందుబాటులో ఉంచాలని గతంలో కలెక్టర్ ఆదేశాలను వ్యాపారులు, డీలర్లు పట్టించు
కోవడంలేదు.
5.79 లక్షల ఎకరాల్లో సాగు
జిల్లాలో రైతులు వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో ప్రతి ఏటా మే చివరి వారంలోనే చాలా మంది రైతులు పత్తిని విత్తుకునే ఆనవాయితీ ఉంది. ఈ క్రమంలో త్వరగా పనులు పూర్తిచేసేందుకు పొలాల బాట పట్టారు. వారం రోజుల నుంచి ఖరీఫ్ పనులు జోరుగా సాగుతున్నాయి. చేనుల్లో దుక్కులు దున్నుతున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది వానాకాలం పంటల సాగు విస్తీర్ణాన్ని అధికారులు అంచనా వేశారు. మొత్తం 5,79,548 ఎకరాల్లో పంటలు వేయనున్నారు. ఇందులో అత్యధికంగా 4.18 లక్షల ఎకరాల్లో పత్తి సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
గతేడాది 3.80 లక్షల ఎకరాల్లో (దాదాపు 70 శాతం) సాగు చేసిన రైతన్నలు ఈ సారి 20 వేల నుంచి 30 వేల ఎకరాల్లో అధికంగా పత్తి వేయనున్నారు. దీని తర్వాతి స్థానంలో సోయాబీన్ 91 వేలు, ఆపై కందులు 62 వేలు, మొక్కజొన్న 4 వేలు, జొన్న 2 వేల ఎకరాలు ఇతర పంటలు మినుములు, వరి, పెసర్లు, పప్పుదినుసులు సాగు చేయనున్నారు. యూరియా, డీఏపీ, ఎంఓపీ, తదితర ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఈ సారి మొత్తంగా మొత్తం 90 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
రైతులు ఆందోళన చెందవద్దు
మార్కెట్లో అన్ని రకాల పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి కొరత లేకుండా పర్యవేక్షిస్తున్నాం. ఇప్పటి వరకు 5 లక్షల ప్యాకెట్లు వచ్చాయి. జూన్ మొదటి, రెండో వారంలోగా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటాయి. విత్తనాల కొరత ఉందని రైతులు ఆందోళన చెందవద్దు. ఇంకా విత్తనాలు వచ్చేందుకు టైమ్ ఉంది.
పుల్లయ్య, వ్యవసాయ శాఖ అధికారి