
- పెరుగుతున్న మొగిపురుగు, అగ్గితెగులు
సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లాలో వరి పంటకు మొగిపురుగు, అగ్గితెగులు సోకుతుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. సాధారణంగా వరి కోతకు వచ్చే దశలో మొగిపురుగు సోకే అవకాశాలుఎక్కువగా ఉంటుంది. కానీ ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల వల్ల ప్రారంభ సమయంలోనే మొగిపురుగు సోకుతోంది. యాసంగి సీజన్ లో జిల్లాలో 3.25 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఫిబ్రవరి చివరి వారం నుంచే వరికి మొగిపురుగు, అగ్గితెగులు సోకడం మొదలైందని రైతులు చెబుతున్నారు. జిల్లాలోని గజ్వేల్, వర్గల్, బెజ్జంకి, దుబ్బాక, మిరుదొడ్డి, సిద్దిపేట రూరల్, నారాయణరావుపేట, కోహెడ, అక్కన్నపేట, హుస్నాబాద్, చేర్యాల దౌల్తాబాద్, చిన్నకోడూరు మండలాల్లోని పలు గ్రామాల్లో మొగిపురుగు, అగ్గితెగులు సమస్యను రైతులు ఎదుర్కొంటున్నారు.
వాతావరణ ప్రభావం
వాతావరణ పరిస్థితుల వల్ల మొగిపురుగు, అగ్గితెగుళ్ల బెడద పెరుగుతోందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. వీటివల్ల పంట ఎదగక దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉంది. మొగి పురుగు కాండాన్ని తొలచడం వల్ల నారు ఎదగక గింజ పెరగక తాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి తోడు ఎక్కువగా పురుగుల మందుల వాడకం, పంట మార్పిడి చేయక పోవడం కూడా కొన్ని సమస్యకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
సస్య రక్షణకు అధికారుల సూచనలు
మొగిపురుగు, అగ్గితెగులు నివారించడానికి వ్యవసాయ అధికారులు సస్య రక్షణ చర్యలను సూచిస్తున్నారు. మొగిపురుగు నివారణ కోసం కార్టప్ హైడ్రాక్లోరైడ్ 75 ఎస్. జి మందు 250 గ్రాములు లేదా క్లోరాంట్రనిలిప్రోల్ 60మిల్లి లీటర్లు లేదా టెట్రానిలిప్రోల్ 100 మిల్లి లీటర్ల ద్రావణాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. ప్రారంభ దశలోనే దీనిని నివారించకపోతే తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయని అధికారులు సూచిస్తున్నారు. అగ్గితెగులుకు ట్రైసైక్లాజోల్ 120 గ్రాములు, లేదా ట్రిఫ్లాక్సిస్ట్రోబిన్+ టెబుకోనజోల్ 90 గ్రాములు లేదా పికాక్సి స్ట్రోబిన్+ ట్రైసైక్లాజోల్ 400మిల్లి లీటర్లను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలని చెబుతున్నారు. కాగా మొగిపురుగు, అగ్గితెగులు సోకడం వల్ల దిగుబడిపై ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా
కనిపిస్తున్నాయి.
వాతావరణ మార్పుతోనే సమస్య
జిల్లాలో వాతావరణం మార్పుల వల్ల వరి నారుపై మొగి పురుగు ప్రభావం చూపుతోంది. పలు గ్రామాల్లో ఈ సమస్యను గుర్తించి సస్య రక్షణ చర్యలు తీసుకోవాలని రైతులకు సూచిస్తున్నా. ఏఈవోలు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పరిస్థితులను పరిశీలించి అవసరమైన సలహాలు, సూచనలను రైతులకు అందిస్తున్నారు. అధికారుల సూచనలు తప్పకుండా పాటిస్తే సమస్య నుంచి బయటపడవచ్చు.
శ్రీనాథ్, అగ్రికల్చర్ ఆఫీసర్