
- జాడలేని చినుకు.. ఆందోళనలో అన్నదాతలు
- ముందస్తు సాగు ప్రణాళిక వెనక్కి.. నామ మాత్రంగా పంటలసాగు!
సిద్దిపేట/మెదక్/సంగారెడ్డి, వెలుగు : ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. అదును దాటిపోతోందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం ప్రారంభమై నెలవుతున్నా చినుకు జాడ లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లాలో జూన్ నెలలో 104.9 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 77.2 మిల్లీ మీటర్లు మాత్రమే కురిసింది. మెదక్లో 129.8 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 102.7 మిల్లీ మీటర్లు మాత్రమే పడింది. సంగారెడ్డి జిల్లాలో 108.8 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా, కేవలం 80.02 మిల్లీ మీటర్లు మాత్రమే కురిసింది. ఈ పరిస్థితితో పత్తి, మొక్కజొన్న, పెసర, మినుము, కంది లాంటి పంటలు పండించాలంటే రైతులు ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు.
విత్తనాలు వేయలేదు..
సిద్దిపేట జిల్లాలో ఏడు లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా ప్రస్తుత వానాకాలం సీజన్ లో 5.25 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తారని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. కానీ వానలు లేకపోవడంతో ఇప్పటి వరకు విత్తనాలు వేయలేదు. జిల్లాలో అత్యధికంగా 3.66 లక్షల ఎకరాల్లో వరి, 1.16 లక్షల ఎకరాల్లో పత్తి, 32,344 ఎకరాల్లో మొక్కజొన్న 10,491 కందులు పండించే అవకాశం ఉంది. గజ్వేల్, హుస్నాబాద్, సిద్దిపేట నియోజకవర్గాల్లో వర్షాధార పంటల సాగు ఎక్కువగా జరుగుతుంటుంది. కోహెడ, బెజ్జంకి, జగదేవ్ పూర్, తొగుట, దుబ్బాక, చిన్నకోడూరు, దౌల్తాబాద్, సిద్దిపేట మండలాలతోపాటు పలు చోట్ల వరి నారు సిద్ధం చేసుకుని వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.
మెదక్ జిల్లా వ్యాప్తంగా 3,76,220 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అగ్రికల్చర్ డిపార్ట్ మెంట్ అంచనా వేసింది. ఇందులో అత్యధికంగా 3,10,800 ఎకరాల్లో వరి, 45,500 ఎకరాల్లో పత్తి, 7,200 ఎకరాల్లో మొక్కజొన్న, 4,100 ఎకరాల్లో కందులు, 1,500 ఎకరాల్లో పెసర, 7,120 ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగవుతాయని భావిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 7,19,528 ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. బోర్ల కింద సాగు చేయాల్సిన పంటలకు కూడా రైతులు వెనకముందు అవుతున్నారు. సరైన వర్షాలు లేకపోతే భూ గర్భ జలాలు తగ్గి పంట కోతకొచ్చే దశలో నీటి కొరత ఏర్పడుతుందేమోననే ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలోనే చాలాచోట్ల
వరినట్లు పూర్తిస్తాయిలో వేయలేదు.
ముందస్తు కాస్త వెనక్కి..
యాసంగి సీజన్ లో వడగండ్లు, అకాల వర్షాలతో పంటలు దెబ్బతినడంతో ముందస్తు సాగు చేయాలనే ప్రభుత్వ ప్రచారం వర్షాలు కురియక వెనక్కి వెళ్లిపోయింది. నెల రోజుల ముందు సాగు ప్రారంభిస్తే యాసంగి సీజన్ మార్చి నెలాఖరు నాటికి కోతలు పూర్తి చేసి వడగండ్లతో పంట నష్టపోకుండా ఉంటుందని ప్రభుత్వం భావించింది. మే నెలాఖరు వరకు ముందస్తు సాగుపై విస్తృతంగా ప్రచారం చేసినా వర్షాలు ఆలస్యం కావడంతో ఇప్పుడు ఆ ఊసే లేకుండాపోయింది. మరో వారంలో రోజుల్లో వర్షాలు కురవకపోతే ఈసారి ఆశించిన స్థాయిలో పంటలు పండించడం కష్టమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు.