- ఇప్పటి వరకు ఎత్తిపోసింది మూడు టీఎంసీలే
- డిమాండ్ లేదని కెఎల్ఐ మోటర్లు బంద్
- రైతుల ఆందోళన, ఎమ్మెల్యే చొరవతో రిపేర్లు షురూ
నాగర్ కర్నూల్, వెలుగు : ఇటీవల కురిసిన భారీ వర్షాలవల్ల కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ (కేఎల్ఐ) స్కీమ్ ప్రధాన కాల్వకు గండ్లు పడి నెల రోజులైనా ఇంతవరకు రిపేర్లు పూర్తి కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే విత్తనాలు తెచ్చుకుని పల్లీ పంట వేసుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. వారం పది రోజుల్లో వానలు పడితే ఇబ్బంది ఉండదని, లేకపోతే కాల్వల ద్వారా నీళ్లు వదిలితేనే పంట సాగు చేయగలమంటున్నారు. ఇదే విషయాన్ని వారు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లడం.. ఆయన అధికారులను నిలదీయడంతో పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్దమయ్యారు.
పలు చోట్ల గండ్లు.. కొట్టుకుపోయిన ఆప్రాన్
ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు కెఎల్ఐ స్కీమ్ ప్రధాన కాలువ పలు చోట్ల తెగిపోయింది. కొన్ని చోట్ల గండ్లు పడ్డాయి. మున్ననూర్ దగ్గర అప్రాన్ కింది భాగం కొట్టుకుపోయింది. దీంతో ఇంజనీరింగ్ అధికారులు 25 రోజులుగా కెఎల్ఐ మోటార్లు బంద్‌పెట్టారు. రెగ్యులర్‌గా వానలు పడుతున్నందున ఇప్పుడు సాగునీటికి డిమాండ్ లేదంటూ లిఫ్ట్ ఆపేశారు. ఈ వర్షాకాలం సీజన్లో కెఎల్ఐ నుంచి కేవలం 3 టిఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోసినట్లు తెలుస్తోంది. భారీ వర్షాల వల్ల బిజినేపల్లి మండలం లట్టుపల్లి వద్ద కెఎల్ఐ మెయిన్ కెనాల్‌కు భారీ గండి పడి, 300 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది.
మెయిన్ కెనాల్ తెగడంవల్ల ముంచెత్తిన వరద కారణంగా మిడ్జిల్ మండలం మున్ననూర్ వద్ద అప్రాన్ బేస్ కిందిభాగం కొట్టుకుపోయింది. కల్వకుర్తి మండలం వెంకటాపూర్ వద్ద కాల్వకు గండిపడింది. జీడిపల్లి వద్ద కట్ట కొట్టుకుపోయింది.ఎల్లికట్ట,కుర్మిద్ద గ్రామాల మధ్య కట్ట తెగిపోయింది. 30వ ప్యాకేజీలోని వెంకటాపూర్, పుల్జాల గ్రామాల దగ్గర గండిపడింది. మెయిన్ కెనాల్ రెండు చోట్ల తెగిపోవడంతో వాగుల నుంచి వచ్చే వరదతో పాటు కెఎల్ఐ మోటార్లు నడిపితే నీటి ప్రవాహానికి గండ్లు పడిన చోట కాల్వలు తెగిపోతాయన్న అనుమానంతో నీటి పంపింగ్ ఆపేసినట్లు తెలిసింది.
ఎమ్మెల్యే సీరియస్
వట్టెం పంప్‌హౌజ్‌లో నిండిన నీటిని తోడిపోయడానికి అధికారులు 20 రోజుల పాటు తంటాలు పడ్డారు. ఆ పనుల్లో మునిగిపోయిన ఇరిగేషన్అధికారులు కాల్వల రిపేర్ల గురించి పెద్దగా పట్టించుకోలేదు. కాల్వల రిపేర్లలో జరుగుతున్న ఆలస్యానికి తోడు ఎండలు పెరగడంతో పంట ఎలా వేసుకోవాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. వారు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి పరిస్థితిని వివరించడంతో ఆయన.. మాడ్గుల మండలం నాగిళ్ల నుంచి మిడ్జిల్ మండలం మున్ననూర్ వరకు మెయిన్ కెనాల్‌ను పరిశీలించారు.
ఐదు మండలాలలో గండ్లను పరిశీలించినఆయన రిపేర్లు ఎప్పటివరకు పూర్తి చేస్తారని సర్కిల్-2 ఎస్.ఇ. సత్యనారాయణ రెడ్డి, ఇఇ శ్రీకాంత్‌లను నిలదీశారు. 29వ ప్యాకేజీలో రిపేర్ల విషయంలో కాంట్రాక్ట్ ఏజెన్సీపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సీరియస్అయ్యారు. దాంతో ఇంచార్జీ సీఇ విజయ భాస్కర్ రెడ్డి, ఎస్.ఇ సత్యనారాయణ రెడ్డి కాల్వలను పరిశీలించి కాంట్రాక్టర్ పై ఒత్తిడి తేవడంతో ఎట్టకేలకు పనులు మొదలు పెట్టారు.
సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తాం..
భారీ వర్షాలకు కెఎల్ఐ కెనాల్ పడిన గండ్లు పూడ్చడానికి చర్యలు తీసుకుంటున్నాం. సాధ్యమైనంత త్వరగా రిపేర్లు పూర్తి చేస్తాం. మున్ననూర్ వద్ద అప్రాన్ కింద భాగం కొట్టుకుపోయిన చోట కాంక్రీట్ బేస్ వేస్తాం.
శ్రీకాంత్ ఈఈ, డివిజన్-6