- ఐదు నుంచి పదెకరాల్లోపే అమలు చేయండి
- రైతుబంధులా రాళ్లు రప్పలకు, వ్యవసాయేతర భూములు ఇవ్వొద్దు
- భూస్వాములకు కాకుండా చిన్నసన్నకారు రైతులకే ఇవ్వాలి
- రైతు భరోసా పథకం అమలుపై రైతుల అభిప్రాయం
కరీంనగర్, వెలుగు: ఐదు నుంచి పది ఎకరాల వరకు సాగు చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులు కేబినేట్ సబ్ కమిటీని కోరారు. గతంలో సాగు చేయని భూములకు కూడా రైతు బంధు ఇచ్చారని, అలాంటి దుర్వినియోగం మళ్లీ జరగకుండా చూడాలన్నారు. కరీంనగర్ బైపాస్ రోడ్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో రైతు భరోసా పథకం అమలుపై శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతుల నుంచి సబ్ కమిటీ అభిప్రాయాలను సేకరించింది. ఈ సందర్భంగా ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు, ముగ్గురు చొప్పున రైతులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
అగ్రికల్చర్ ఆఫీసర్లు ఇచ్చిన ఫామ్స్ లో రైతులు తమ అభిప్రాయాలను నింపి ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ బడా వ్యవసాయదారులకు రైతు భరోసాను అందించవద్దని, సన్న చిన్న కారు రైతులకే అందించే ఆదుకోవాలని కోరారు. వ్యవసాయ భూములకే అందించాలని, నిరుపయోగంగా ఉన్న భూములకు, రియల్ ఎస్టేట్, రోడ్లకు, గుట్టలకు చెల్లించవద్దని విజ్ఞప్తి చేశారు. వందలాది ఎకరాలు ఉన్న రైతులకు కూడా పథకాన్ని వర్తింపజేయవద్దన్నారు.
రైతులకు సబ్సిడీపై పనిముట్లు అందించి ఆదుకోవాలని కోరారు. కాగా రైతుల అభిప్రాయ సేకరణకు జోగినపల్లి సంపత్ రావు తాను ప్రతిమ మెడికల్ కాలేజీ పీఆర్వోనని పరిచయం చేసుకుంటూ తాను రాసుకొచ్చిన లెటర్ చదవడం మొదలుపెట్టాడు. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ కలగజేసుకుని.. రైతులతో మాట్లాడించండని ఆఫీసర్లకు సూచించారు. కలెక్టర్, జిల్లా అధికారుల దగ్గరికి వెళ్లి ఇలాంటి వారిని ఎలా పిలిచారని సీరియస్ అయ్యారు.
10 ఎకరాల్లోపు రైతులకు అందించాలి
10 ఎకరాలు వరకు రైతులకు పెట్టుబడి సాయం అందించాలి. ఎక్కువ భూమి ఉన్న రైతులకు ఇవ్వొద్దు. సర్కార్ ఏడాదికి ఎకరానికి రూ.15వేలు రైతు భరోసా ఇచ్చేందుకు కసరత్తు చేయడం అభినందనీయం. రాళ్లకు రప్పలకు గుట్టలకు సాగు యోగ్యం లేని భూములకు పెట్టుబడి సాయం అందించవద్దు. ఏకకాలంలో రుణమాఫీ చేయడం సంతోషకరం. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు.
పెండ్యాల రామిరెడ్డి, రైతు, ఈదులగట్టుపల్లి
ఐదెకరాలకే అందించాలి...
రైతు రుణమాఫీతో రైతులు సంతోషంగా ఉన్నారు. గతంలో వైఎస్సార్ రుణమాఫీ చేశారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేశారు. రైతు భరోసాతోపాటు అతివృష్టి, అనావృష్టితో పంట నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు పటిష్టమైన క్రాప్ ఇన్సూరెన్స్ ను అమలు చేయాలి. రైతు భరోసాను సన్న, చిన్నకారు రైతులకు అందజేయాలి. ఐదు ఎకరాలకే అమలు చేస్తే నిజమైన రైతుకు అందుతుంది. నిశాంత్ రెడ్డి, గొల్లపల్లి, ధర్మపురి